అక్కడి వైద్యం..ఓ ధైర్యం

28 Feb, 2022 09:17 IST|Sakshi

సాక్షి హైదరాబాద్‌(ఏజీవర్సిటీ): ఇంట్లో ఇష్టంగా పెంచుకుంటున్న పప్పీకి గానీ..పిల్లికి గానీ అనారోగ్యం సోకితే.. మనం కనిపిస్తే చాలు కళ్లల్లో ఆనందం నింపుకొని గెంతులేస్తూ వచ్చి ఒళ్లో వాలిపోయే నోరు లేని ఆ జీవులు కదలకుండా కూర్చుంటే..మనసు కీడు శంకిస్తుంది..వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని  పోరుపెడుతుంది. అప్పుడే మనకు అసలు సమస్య ఎదురవుతుంది. చికిత్సకోసం ఎక్కడికి తీసుకెళ్లాలని? అటువంటి వారికోసమే సేవలందిస్తోంది రాజేంద్రనగర్‌లోని ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రి. కుక్క..కోడి..పిల్లి..మేక..ఏదైనా సరే మేం వైద్యమందిస్తామని గర్వంగా చెబుతున్నారు అక్కడి వైద్యులు.  

మేకలు, పిల్లులకు ఉచితమే... 
వెటర్నరీ ఆసుపత్రిలో మేకలు, పిల్లులు, గెదే, గొర్రె, ఆవు తదితర వాటన్నిటికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ల బృందం ఆసుపత్రికి వచ్చిన ప్రతి జంతువుకు మొదట దాని జాతి, బరువు, జ్వరం తదితరాలు నమోదు చేస్తారు. అనంతరం వ్యాధికి సంబంధించిన డాక్టర్‌ వద్దకు పంపించి పరిశీలించి అనంతరం సూదులు, మందులు ఉచితంగా అందజేస్తారు. కుక్కలు, కుందేలు, గుర్రాలు, చిన్న జీవులు తదితర వాటిని రూ. 20 ఫీజులు వసూలు చేస్తున్నారు.  

అధునాతన పరికరాలు 
ఎలాంటి అనారోగ్యాలపాలైన బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాం. మా ఆసుపత్రికి ప్రతి రోజు 200 వరకు రకరకాల జంతువులను చికిత్స కోసం తీసుకువస్తారు.  ఆసుపత్రిలో అధునాతనమైన పరికరాలు ఉన్నాయి. అల్ట్రాసౌండ్, స్కానింగ్, ఎక్స్‌రే తదితర పరికరాలు ఉన్నాయి. మాతో పాటు మా సిబ్బంది, పీజీ విద్యార్థులు ఎల్లవేళల అందుబాటులో ఉంటాం. 
– అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రామ్‌సింగ్‌

 30 కిలోమీటర్ల దూరం నుంచి వస్తాం.. 
మా తాతముత్తాతల నుంచి రకరకాల మేకలను మేము పెంచుతున్నాం. ఈ మేకలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఇక్కడికే వచ్చి వైద్యం చేయిస్తాం. ఎప్పుడు కూడా డబ్బులు తీసుకోలేదు. ఉచితంగానే వైద్యంతో పాటు మందులు కూడా ఇస్తారు. మా ఇంటి ఆసుపత్రికి రావడానికి సుమారు 30 కిలోమీటర్లు అవుతుంది. అయినా మంచి వైద్యం అందుతుంది కాబట్టి ఇక్కడికే వస్తున్నాం. 
– మహ్మద్‌ ఇబ్రహీం, మొఘల్‌పురా 

త్వరలో నూతన భవనం ప్రారంభం 
ఇక్కడ 55 సంవత్సరాలనుంచి సేవలందిస్తున్నాం. కొన్ని మూగ జీవాలకు తక్కువ ఫీజు తీసుకుంటాం. చాలావాటికి ఉచితంగా సేవలందిస్తాం. ఇప్పటికి లక్షలాది జీవులకు ప్రాణం పోశాం. ఆసుపత్రి భవనం సరిపోవడం లేదని ప్రభుత్వానికి సూచించడంతో రూ. 11 కోట్ల తో అధునాతన హంగులతో నూతన భవనం నిర్మించాం. త్వరలో ప్రారంభిస్తాం. జరుగుతుంది.
  –  రవీందర్‌రెడ్డి, వైస్‌ ఛాన్సలర్‌

మరిన్ని వార్తలు