అర్బన్‌ నక్సల్స్‌తోనే హిందుత్వానికి ముప్పు 

23 Aug, 2021 08:48 IST|Sakshi
విశ్వ హిందూ పరిషత్‌ జాతీయ ప్రధానకార్యదర్శి మిలింద్‌ పరండేజీ (ఫైల్‌ఫోటో)

 వీహెచ్‌పీ జాతీయ ప్రధాన కార్యదర్శి మిలింద్‌ పరండేజీ 

సాక్షి, హైదరాబాద్‌: దళితులు, ఆదివాసీలు హిందువులు కాదంటూ అర్బన్‌ నక్సలైట్లు విషప్రచారం చేస్తున్నారని, వారివల్లే హిందుత్వానికి ముప్పు పొంచి ఉందని విశ్వహిందూ పరిషత్‌ జాతీయ ప్రధానకార్యదర్శి మిలింద్‌ పరండేజీ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌ కోఠిలోని వీహెచ్‌పీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రక్షాబంధన్‌ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువుల పండుగలు అతి ప్రాచీనమైనవని, దాదాపు రెండు వేల ఏళ్ల నుంచి విదేశీ దురాక్రమణలను ఎదుర్కొంటూ హిందువులు తమ సంప్రదాయాలను కాపాడుకుంటున్నారని పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశంలోని 185 జిల్లాల్లో హిందువుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, కశీ్మర్, అరుణాచల్‌ ప్రదేశ్, దక్షిణ బిహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాంతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో హిందువుల పండుగలను స్వేచ్ఛగా జరగనివ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా లెక్కల్లో ‘మేం ఏ మతానికి చెందని వారం కాదు’ అని చెప్పేవారి సంఖ్య కోట్లలో ఉందని, వారంతా హిందువులేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్‌ నాయకులు స్థానుమలై, రాఘవులు, సత్యంజీ, కేశవ్‌హెడ్గే, యాదిరెడ్డి, జగదీశ్వర్, రాజేశ్వర్‌రెడ్డి, పగుడాకుల బాలస్వామి, బజరంగ్‌దళ్‌ రాష్ట్ర కో కన్వీనర్‌ శివరాములు పాల్గొన్నారు.   
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు