నాణ్యమైన విద్య కోసమే ఫీజుల పెంపు

30 Jul, 2021 02:48 IST|Sakshi

వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ స్పష్టీకరణ 

11 రకాల కొత్త వంగడాల ఆవిష్కరణ 

కొత్త జొన్నలో గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ తక్కువ.. డయాబెటిస్‌ రోగులకు ప్రయోజనం 

త్వరలో తెలంగాణలో అగ్రి హబ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: నాణ్యమైన విద్య కోసం సెల్ఫ్‌ ఫైనాన్స్‌ వ్యవసాయ కోర్సుల్లో ఫీజులు పెంచక తప్పదని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్‌ డాక్టర్‌ వి.ప్రవీణ్‌రావు స్పష్టం చేశారు. ఒకేసారి డొనేషన్‌ ఫీజు కింద రూ.10 లక్షలు, ఏడాదికి రెగ్యులర్‌ ఫీజు కింద రూ.50 వేల చొప్పున వసూలు చేస్తున్నామన్నారు. ఈవిధంగా వచ్చిన సొమ్మును హాస్టళ్ల అభివృద్ధికి కేటాయిస్తున్నామని చెప్పారు. ఇక్కడ కల్పిస్తున్న మౌలిక వసతులు ఫైవ్‌స్టార్‌ స్థాయిలో ఉనప్పటికీ ఫీజులు మాత్రం దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తక్కువగానే ఉన్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం 20–25 లక్షల రూపాయలు ఖర్చు చేస్తోందని వివరించారు. కొత్తగా 11 రకాల వంగడాలను గురువారం ఆవిష్కరించిన సందర్భంగా ప్రవీణ్‌రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ప్రైవేటు వ్యవసాయ కళాశాలలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. గత ఐదారేళ్లలో 47 రకాల వంగడాలను విడుదల చేశామన్నారు.

ఐదు రకాల వరి కొత్త వంగడాలు  
కొత్తగా విడుదల చేస్తున్న 11 వంగడాల్లో ఐదు వరి రకాలు, రెండు జొన్న, కంది, పెసర, సోయా చిక్కుడు, నువ్వులకు చెందిన వంగడాలు ఒకటి చొప్పున ఉన్నాయని ప్రవీణ్‌ రావు తెలిపారు. జొన్న రకాల వంగడాలను పండించాక వాటిని తిన్నవారికి ఆరోగ్యకర ప్రయోజనాలు ఉంటాయన్నారు. గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ తక్కువ ఉంటుందని, ఇది డయాబెటిస్‌ రోగులకు ప్రయోజనమన్నారు.  చీడపీడల్ని తట్టుకునే వంగడాల రూపకల్పనకి వర్సిటీ ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. వర్సిటీ విద్యార్థులు ఏటా 30కిపైగా జేఆర్‌ఎఫ్‌ (జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిఫ్‌)లు సాధిస్తున్నారన్నారు.  

రోబోటిక్స్‌తో కలుపు నివారణ 
రోబోటిక్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డ్రోన్‌ వంటి అధునాతన పరిజ్ఞాన వినియోగంలో వర్సిటీ ముందంజలో ఉందని ప్రవీణ్‌ రావు వివరించారు. ‘రోబోటిక్స్‌ సాంకేతికతను మొక్కజొన్న పంటల్లో కలుపు నివారణకు ఉపయోగించుకోవచ్చు. డ్రోన్‌ పరిజ్ఞానాన్ని ప్రతీ గ్రామానికి తీసుకెళ్లాలని భావిస్తున్నాం. తద్వారా డ్రోన్లతో పంటలపై పురుగు మందులను పిచికారీ చేయొచ్చు. డ్రోన్లపై నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించవచ్చు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ స్కిల్స్‌లో శిక్షణ ఇచ్చేందుకు వర్సిటీలో త్వరలోనే అగ్రిహబ్‌ని ప్రారంభిస్తున్నాం. కేంద్రప్రభుత్వం ఈ మధ్య ఒక జిల్లాకి ఒక పంట పథకంలో భాగంగా మన వర్సిటీకి మూడు జిల్లాలకి రూ.8.4 కోట్లు మంజూరు చేసింది. వాటిని జగిత్యాలలో వరి, మామిడి, వరంగల్‌ జిల్లాలో పసుపు, మిరప, హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో చిరుధాన్యాల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తాం’అని వివరించారు. వర్సిటీ తరపున రాష్ట్రంలోని అన్ని జిల్లాల సాయిల్‌ మ్యాపింగ్‌ పూర్తయిందని ఆయన చెప్పారు.  

మరిన్ని వార్తలు