ఆహార తయారీలో పవిత్ర యజ్ఞమే వ్యవసాయం

12 Jun, 2022 02:05 IST|Sakshi
శనివారం హైదరాబాద్‌లో పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఏర్పాటుచేసిన స్టాల్లో చెరుకు రసం తాగుతున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 

‘ప్రకృతి సైన్యం’ పుస్తకావిష్కరణలో ఉపరాష్ట్రపతి

సాక్షి, హైదరాబాద్‌: మట్టి నుంచి మనుగడకు ఉపయోగపడే ఆహారాన్ని తయారు చేసే పవిత్ర యజ్ఞమే వ్యవసాయం అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వాఖ్యానించారు. ఈ యజ్ఞంలో కీలకపాత్ర పోషిస్తున్న రైతుల పట్ల ప్రభుత్వాలు, మీడియా, శాస్త్రవేత్తలు, ప్రజలు పక్షపాతం చూపించాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. పంటల ఉత్పత్తిలో దిగుబడి ఎంత ముఖ్యమో, ప్రకృతి పరిరక్షణ కూడా అంతే ముఖ్యమన్నారు.

శనివారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో రైతునేస్తం పబ్లికేషన్‌ ప్రచురించిన ‘ప్రకృతి సైన్యం’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు మళ్లీ పట్టం కడుతూ, విజయాలు సాధించిన వంద మంది రైతుల విజయ గాథలను పుస్తకంగా తీసుకురావడం అభినందనీయమని, ప్రచురణ కర్త యడ్లపల్లి వెంకటేశ్వరరావు, రచయిత డి.ప్రసాద్‌లను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఆంగ్లేయుల పాలనలో భారతీయ సంస్కృతి, సంప్ర దాయాలతో పాటు వ్యవసాయ రంగం కూడా తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొందని, స్వరాజ్య సాధన తర్వాత మన అవసరాలకు అనుగుణంగా దిగుబడి సాధించడంలో పర్యావరణాన్ని అశ్రద్ధ చేశామన్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మొగ్గుచూపడం సంతోషకరమని తెలిపారు.

ప్రకృతి వ్యవసాయం ద్వారా ఖర్చులను అదుపు చేసుకుని, స్థిరమైన ఆదాయాన్ని సంపాదించవచ్చని, ఈ పద్ధతిలో ఏ వస్తువును బయట నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా, ఆకర్షణీయంగా మార్చేందుకు చిత్తశుద్ధితో వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు. పార్లమెంట్, పార్టీలు, ప్రణాళికా సంఘాలు, నీతి ఆయోగ్, పత్రికలు, ప్రసార మాధ్యమాలు అన్నీ వ్యవసాయ రంగం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలన్న ఆయన.. యువత కూడా ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నార్మ్‌ సంచాలకుడు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు