ప్రైవేటుతో మౌలిక వసతుల ప్రగతి

6 Mar, 2022 05:33 IST|Sakshi

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు 

సాక్షి, హైదరాబాద్‌: దేశ మౌలిక వసతుల వ్యవస్థను మరింత సమర్థంగా ముందుకు తీసుకెళ్లడంలో ప్రైవేటు రంగం ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు భారత్‌కు పుష్కలమైన శక్తి సామర్థ్యాలున్న ప్రస్తుత సమయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటూ సుస్థిర ప్రగతి పథంలో భాగస్వాములు కావాలన్నారు.

మౌలిక వసతుల వృద్ధిద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలన్నారు. శనివారం సీఈవో క్లబ్స్‌ ఇండియా, హైదరాబాద్‌ చాప్టర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి కేంద్రం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఇందుకోసం వ్యాపారానుకూల వాతావరణాన్ని నిర్మిస్తోందన్నారు.

పారిశ్రామిక రంగం ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, పోటీ వాతావరణంలో సృజనాత్మకంగా ముందుకెళ్లాలని కోరారు. సంపదను పెంచుకోవడంతోపాటు ఉపాధి కల్పనకు బాటలు వేయాలని సూచించారు. దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య పరస్పర సమన్వయం అవసరమని సూచించారు. డిజిటల్‌ సేవలు, తయారీ రంగం వంటి ఎన్నో రంగాల్లో మన దేశంలో అపారమైన శక్తి సామర్థ్యాలున్నాయన్నారు. కావలసిందల్లా వాటిని గుర్తించి, ప్రోత్సహించి సద్వినియోగపరచుకోవడమేనని చెప్పారు. కార్యక్రమంలో సీఈవో క్లబ్స్‌ అధ్యక్షుడు శ్రీ కాళీప్రసాద్‌ గడిరాజు, భారత్‌ బయోటెక్‌ వ్యవస్థాపక చైర్మన్‌ శ్రీ కృష్ణ ఎల్ల, సహ వ్యవస్థాపకురాలు సుచిత్ర ఎల్ల, ట్రెండ్‌ సెట్‌ బిల్డర్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ కె.ఎల్‌.నారాయణ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు