విశ్వసాహితీ మూర్తి సినారె

30 Jul, 2022 02:01 IST|Sakshi
ప్రతిభారాయ్‌కు అవార్డును ప్రదానం చేస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. చిత్రంలో మంత్రి నిరంజన్‌రెడ్డి, సినారె కుటుంబ సభ్యులు 

సినారె 91వ జయంతి వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 

రచయిత్రి ప్రతిభారాయ్‌కు సినారె జాతీయ సాహిత్య పురస్కారం ప్రదానం

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు ప్రపంచం ఎల్లకాలం గుర్తుంచుకునే మహాకవి, తెలుగు కీర్తి, విశ్వ సాహితీమూర్తి సి.నారాయణరెడ్డి చిరస్మరణీయుడని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసి, సినిమా సాహిత్యానికి సైతం గౌరవం తెచ్చి పెట్టారన్నారు. సుశీల నారాయణరెడ్డి ట్రస్టు రవీంద్రభారతిలో శుక్రవారం నిర్వహించిన సి.నారాయణరెడ్డి 91వ జయంత్యుత్సవంలో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రతిష్టాత్మకమైన సి.నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పుర స్కారాన్ని ప్రముఖ ఒడియా రచయిత్రి డాక్టర్‌ ప్రతిభారాయ్‌కు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సినారె కవిత్వం, సాహిత్యం ఎప్పుడూ మానవ జీవనం, తత్వం, ప్రకృతిని ప్రేమించడం వంటి అంశాల చుట్టూనే సాగిందన్నారు. ఆలోచనాత్మక కావ్యం విశ్వంభర ఆయనను విశ్వసాహితీ పీఠంపై నిలబెట్టిందని అభినందించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలు గు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా, అధికార భాషాసంఘం అధ్యక్షుడిగా, ప్రభుత్వ భాషా సంస్కృతుల సలహాదారుగా.. ఆయ­న తన ప్రతి పదవికీ వన్నె తీసు కొచ్చారని గుర్తుచేశారు. సినారె తెలుగుదనానికి నిలువెత్తు సంతకమన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన ప్రవేశపెట్టిన బిల్లుల్లో మాతృభాష బిల్లు ప్రధానమైందన్నారు. ఉన్నత విద్యవరకు మాతృభాష ఉండాలనే నిబంధనను తప్పనిసరి చేయాలని పట్టుబట్టారని, నూత న జాతీయ విద్యావిధానం మాతృభాషకు ఇస్తున్న ప్రాధాన్యం ఆయన ఆకాంక్షించిందేనని చెప్పారు.

ప్రతిభారాయ్‌ మాట్లాడుతూ, సినారె పురస్కారాన్ని అందుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పా­రు. కార్యక్రమ ప్రారంభంలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌ దీపికారెడ్డి బృందం ప్రదర్శించిన నృత్య రూపకాలు ప్రేక్షకులను అలరించా­యి. కార్యక్రమంలో మంత్రి నిరంజన్‌రెడ్డి, సుశీలా నారాయణరెడ్డి ట్రస్ట్‌ కార్యదర్శి జె.చెన్నయ్య, రచయిత్రి ఓల్గా, సినారె కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు