ప్రజాస్వామ్యంలో మీడియా కీలకం 

7 Mar, 2022 01:26 IST|Sakshi
పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ప్రభుత్వ విధానాల్లో లోపాలను ఎత్తి చూపాలి  

‘శ్రీ ముట్నూరి కృష్ణారావు సంపాదకీయాలు’ పుస్తకావిష్కరణలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రచార, ప్రసార మాధ్య మాలపై ఉందని, ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య వారధిగా పాత్రికేయులు పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు. హైదరాబాద్‌ని ఎంసీహెచ్‌ఆర్‌డీలో ‘శ్రీ ముట్నూరి కృష్ణారావు సంపాదకీయాలు’ పుస్తకాన్ని ఆదివారం ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. పత్రికలు లేని ప్రజాస్వామ్యాన్ని ఊహించలేమన్నారు.

పత్రికలు సత్యానికి దగ్గరగా, సంచలనాలకు దూరంగా ఉండాలని అన్నారు. వార్తలు, వ్యక్తిగత అభిప్రాయాలు కలిపి ప్రచురించరాదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ విధానాల్లో లోపాలను ఎత్తిచూపిస్తూ మార్పులను సూచించాల్సిన బాధ్యత మీడియాదేనని స్పష్టం చేశారు. సమాజంలో మనం కూడా భాగస్వాములమనే విషయాన్ని పాత్రికేయులు గుర్తుంచుకోవాలని సూచించారు. తెలుగు పాత్రికేయ చరిత్రలో వ్యాసరచనకు నూతన ఒరవడి ప్రవేశపెట్టిన ముట్నూరి కృష్ణారావు గారికి ఉపరాష్ట్రపతి నివాళులర్పించారు.

 యువతలో దేశభక్తిని నూరిపోసి, స్వ రాజ్య కాంక్షను రేకెత్తించి జాతీయోద్యమం దిశగా ముందుకు నడిపించేందుకు కృషి చేసిన పత్రికల్లో తెలుగునాట కృష్ణాపత్రికకు ప్రత్యేకస్థానం ఉందన్నారు. ముట్నూరి కృష్ణారావు ప్రవేశపెట్టిన ఒరవడే తర్వాతి తరం పాత్రికేయులకు మార్గదర్శనం అయిందన్నారు. ‘తెల్లవారిని తుపాకులతో కాల్చుట’ అన్న ముట్నూరి సంపాదకీయం గురించి మాట్లాడిన ఉపరాష్ట్రపతి, ఆ రోజుల్లో అలాంటి శీర్షిక పెట్టడమంటే దేశం కోసం ప్రాణాలను కూడా వదులుకునేందుకు వెనుకాడకపోవడమేననే విషయాన్ని గుర్తుచేశారు.

కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, శాంతా బయోటెక్‌ చైర్మన్‌ డా.వరప్రసాద్‌ రెడ్డి, రచన టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపక చైర్మన్‌ తుమ్మల నరేంద్ర చౌదరి, సీనియర్‌ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, వల్లీశ్వర్, రచయిత దత్తాత్రేయ శర్మ, దర్శనం పత్రిక ఎడిటర్‌ ఎం.వి.ఆర్‌.శర్మ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు