ఓటుకు పనితీరే కొలమానం

2 Apr, 2021 04:02 IST|Sakshi

సామాజికవర్గం, డబ్బు ప్రభావంతో ఓటేస్తే అభివృద్ధి కుంటుపడుతుంది

మాజీ సీఎస్‌ ఎస్‌కే జోషి రచించిన సుపరిపాలన పుస్తకావిష్కరణలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైందని, ఎన్నుకోబోయే వ్యక్తి పనితీరు, ప్రజా ప్రయోజనాలనే కొలమానంగా తీసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. పోటీచేసే వ్యక్తి గుణగణాలు, సామర్థ్యం, యోగ్యత, నడతను కచ్చితంగా అంచనా వేసి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కులమతాలు, ధన ప్రభావంతో ఓటు వేస్తే అభివృద్ధి కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఉపరాష్ట్రపతి తన నివాసంలో రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్‌ జోషి రచించిన ‘ఎకోటి కాలింగ్‌’పుస్తకాన్ని తెలుగులో అనువదించిన ‘సుపరిపాలన’ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. ప్రభుత్వం కంటే పాలనే కీలకమైందని, పాలనా ప్రక్రియలో ప్రజలను భాగస్వాములను చేయ వలసిన అవసరం ఉందని సూచించారు. సౌకర్యాల కల్పనతో పాటు ప్రజలకు అడ్డంకులు లేని ఆనందమయ జీవితాన్ని కల్పించడమే సుపరిపాలన ధ్యేయమన్నారు. ఎన్నుకోబడిన ప్రతినిధులు తమ బాధ్యతలను త్రికరణశుద్ధిగా నిర్వహించాలని, ప్రజలకు పరిపూర్ణమైన సేవలు అందించాలన్నారు. 

కరదీపికలా సుపరిపాలన పుస్తకం..
కొత్తగా సివిల్‌ సర్వీసుల్లోకి వచ్చే వారికి సుపరిపాలన పుస్తకం కరదీపికలా పని చేస్తుందని వెంకయ్యనాయుడు అన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎదురయ్యే సమస్యలు, ఒత్తిడులు, అడ్డంకులు తదితర ఎన్నో అంశాలను ఇందులో చర్చించినట్లు తెలిపారు. థర్డ్‌ జండర్స్, న్యాయం లాంటి అనేక అంశాల మీద తమ అభిప్రాయాలను వెలువరించిన ఈ పుస్తకం, ఉద్యోగంతో పాటు సమాజం పట్ల జోషి చేసిన అధ్యయనాన్ని తెలియజేస్తుందని, రచయిత జోషి రచించిన ఇంగ్లీషు పుస్తకాన్ని సరళమైన, చక్కని తెలుగులో అనువాదం చేసిన అన్నవరపు బ్రహ్మయ్యకు ఉపరాష్ట్రపతి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత డాక్టర్‌ ఎస్‌.కె.జోషి, అనువాదకుడు బ్రహ్మయ్య పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు