అగ్రహారం గుట్టల్లో భూతవైద్యుడి బాగోతం

7 Aug, 2020 09:39 IST|Sakshi

సాక్షి, సిరిసిల్లా : మంచిర్యాల జిల్లాలో భూత వైద్యానికి బాలింత బలై మూడు రోజులు గడవక ముందే రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో భూతవైద్యం వెలుగులోకి వచ్చింది. సిరిసిల్ల సమీపంలోని పెద్దూరుకు చెందిన భూతవైద్యుడు వేములవాడ మండలం అగ్రహారం గుట్టల్లో భూతవైద్యం చేస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. వీడియో చిత్రీకరణ చేయడంతో భూతవైద్యుడితోపాటు దంపతులు పారిపోయారు. (భూతవైద్యం: ప్రాణాలు కోల్పోయిన రజిత)

ఇంట్లో ఒంట్లో సమస్యలు ఉంటే నయం చేస్తామని నమ్మించి గుట్టలోకి తీసుకెళ్లి పూజలు మొదలుపెట్టగానే స్థానికులు అక్కడికి చేరుకుని నిలదీశారు. ఇక్కడ ఏం పూజలు చేస్తున్నారు, ఏం వైద్యం చేస్తున్నారంటూ నిలదీస్తూ వీడియో తీయడంతో ఆరోగ్యం బాగు లేకుంటే పూజలు చేస్తున్నామని దంపతులతో పాటు వారి వెంట వచ్చినవారు తెలిపారు. ఇంటి వద్దే వైద్యం చేయించుకోవచ్చు కదా అని సూచించడంతో కరోనా వల్ల ఇంటి వద్దకు కుదరక గుట్టల్లో పూజలు చేస్తున్నామని బ్రతిమాలుతూ భూతవైద్యుడితో పాటు దంపతులు పారిపోయారు.

మంచిర్యాల జిల్లాలో భూత వైద్యానికి బాలింత ప్రాణాలు కోల్పోయిన నాలుగు రోజులు గడవక ముందే సిరిసిల్ల జిల్లాలో భూతవైద్యం వెలుగులోకి రావడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే భూత వైద్యుల నకిలీబాబా ల పట్ల పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని జనం కోరుతున్నారు.

మరిన్ని వార్తలు