విద్యావలంటీర్‌ బలవన్మరణం, రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌‌

14 Apr, 2021 13:40 IST|Sakshi
పాలకూరి శైలజ (ఫైల్‌)

విధుల్లోకి తీసుకోకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు

ఉద్యోగం రెన్యువల్‌ కాకపోవడంతో భర్త కూడా ఇంటివద్దే..

రూ.50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి 

షర్మిలమ్మ అనుచరులు ఇందిరా శోభన్, రాంరెడ్డి డిమాండ్‌  

సాక్షి, నల్లగొండ క్రైం: ఆర్థిక ఇబ్బందులతో ఓ విద్యావలంటీర్‌ రైలుకింద పడి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మంగళవారం నల్లగొండలో చోటుచేసుకుంది. పట్టణంలోని హౌజింగ్‌బోర్డు కాలనీకి చెందిన పాలకూరి శైలజ (30) భర్త అమరేందర్‌ సివిల్‌సప్లయ్‌ విభాగంలో అటెండర్‌గా అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్నాడు. అతని ఉద్యోగం రెన్యువల్‌ కావాల్సి ఉండగా కాలేదు. దీంతో జీతం రావడం లేదు. శైలజ గతంలో విద్యావలంటీర్‌గా పని చేసేది. కరోనాతో ఏడాది కాలంగా పాఠశాలలు ప్రారంభం కాకపోవడంతో విధుల్లోకి తీసుకోలేదు. ఇద్దరికీ వేతనాలు రావడం లేదు. ఆర్థికంగా చితికిపోవడంతో కుటుంబ జీవనం గడవడం దుర్భరంగా మారింది. భర్త ఆవేదనను భరించలేక శైలజ నల్లగొండలో రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. 

శైలజది ప్రభుత్వ హత్యే..
హైదరాబాద్‌: విద్యా వలంటీర్‌ శైలజది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని వైఎస్‌ షర్మిలమ్మ అనుచరురాలు ఇందిరాశోభన్‌ ఆరోపించారు. లోటస్‌పాండ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షర్మిలమ్మ బృందంలోని నాయకుడు పిట్టా రాంరెడ్డితో కలసి ఆమె మాట్లాడారు. ఆర్థిక ఇబ్బందులకు తాళలేక నల్లగొండలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న పాలకూరి శైలజ మృతి పట్ల ఇందిర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మూడు నెలల క్రితమే ఆర్థిక ఇబ్బందులతో, తీవ్ర మనోవేదనకులోనై ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన తొడసం రామస్వామి అనే విద్యావలంటీర్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటనను ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 వేలమంది విద్యా వలంటీర్లను ప్రభుత్వం విధుల్లోకి తీసుకోకపోవడం, పెండింగ్‌ వేతనాలను చెల్లించకపోవడంతో కుటుంబాల పోషణ భారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. శైలజ కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.   

చదవండి: ముఖ్యమంత్రుల జాతకాలు బాగుండటం శుభసూచకం

మరిన్ని వార్తలు