కార్లలో గంజాయి.. కొరియర్‌లో డ్రగ్స్‌ రవాణా 

14 Dec, 2020 08:22 IST|Sakshi

న్యూఇయర్‌ వేడుకల కోసం భారీ ఆర్డర్లు 

హైదరాబాద్‌లో మెఫిడ్రిన్, కెటమైన్‌ తయారీ 

గ్రేటర్‌ ఎన్నికల సమయంలో పెద్దఎత్తున సరిహద్దులు దాటిన సరుకు 

నగర శివారు ఫ్యాక్టరీలపై ఎన్‌సీబీ, డీఆర్‌ఐ నిఘా 

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో అప్పుడే కొత్త సంవత్సర వేడుకల హడావుడి మొదలైంది. కరోనా భయాన్ని పక్కనబెట్టి పలు మెట్రో నగరాల్లో భారీగా పార్టీలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. న్యూఇయర్‌ డిమాండ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు డ్రగ్స్‌ మాఫియా ‘మాల్‌’తెప్పించుకుంటోంది. తయారు చేయిస్తోంది. ఒడిశా, తెలంగాణ, ఏపీల నుంచి ఉత్తరాది డ్రగ్స్‌ మాఫియా గంజాయి కోసం భారీగా ఆర్డర్లు ఇచ్చింది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఏపీ, కర్ణాటక సరిహద్దుల్లో పట్టుబడుతున్న గంజాయి మూటలే ఇందుకు నిదర్శనం. గంజాయితోపాటు హైదరాబాద్‌లో మెఫిడ్రిన్, కెటమైన్, ఎఫిడ్రిన్‌లనూ పెద్దఎత్తున తయారు చేసి ముంబైకి తరలించేందుకు ఏర్పాట్లు జరిగినట్లు డీఆర్‌ఐ, నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇప్పటికే తమకు కావాల్సినంత సరుకును రాష్ట్ర సరిహద్దులు దాటించినట్లు సమాచారం. పలు రకాల డ్రగ్స్ పౌడర్ల రవాణాకు గ్రేటర్‌ పరిధిలోని ఆర్టీసీ కొరియర్, కార్గో సరీ్వసులను కూడా వినియోగిస్తుండటం గమనార్హం. 

కొరియర్లు, ఆర్టీసీ పార్సిళ్ల ద్వారా పౌడర్‌! 
గంజాయితోపాటు నగరంలో మెఫిడ్రిన్, కెటమైన్, ఎఫిడ్రిన్‌లను పెద్ద ఎత్తున ప్రాసెస్‌ చేసి విక్రయిస్తున్నట్లుగా వివిధ దర్యాప్తు సంస్థల వద్ద సమాచారం ఉంది. అందుకే పలు పాత ఫ్యాక్టరీలపై నిఘా పెట్టాయి. తాజాగా డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఓ ఇంట్లోనే మెఫిడ్రిన్‌ను ప్రాసెస్‌ చేసి ముంబైకి విక్రయిస్తోన్న వ్యక్తిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టులోనూ నగర శివారులోని ఓ పాత ఫ్యాక్టరీలో తయారుచేసిన వందలాది కిలోల మెఫిడ్రిన్, కెటమైన్, ఎఫిడ్రిన్‌ పౌడర్లను ముంబైకి తరలిస్తుండగా పట్టుకున్నారు. హైదరాబాద్‌ నుంచి వెంటాడిన డీఆర్‌ఐ అధికారులు నిందితులు, వాహనాన్ని ముంబైలోనే అదుపులోకి తీసుకుని కోట్లాది రూపాయల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత కొంతకాలం స్తబ్దుగా ఉన్న డ్రగ్స్‌ వ్యాపారులు తిరిగి దుబ్బాక, నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల సమయాన్ని సది్వనియోగం చేసుకున్నారని సమాచారం. (చదవండి: న్యూ ఇయర్‌ జోష్‌కు బ్రేక్)

నగరంలోని పలు ప్రాంతాలకు డ్రగ్స్‌ సరఫరా చేసేందుకు కొరియర్‌ సంస్థలను వాడుతున్నారని కూడా డీఆర్‌ఐ గుర్తించింది. కిలోల కొద్దీ సరుకును వాహనాల ద్వారా తీసుకెళ్లే డ్రగ్స్‌ వ్యాపారులు, గ్రాముల్లో ఉన్న డ్రగ్స్‌ను కస్టమర్లకు సరఫరా చేసేందుకు కొరియర్‌ సర్వీసులను వాడుతున్నారు. ఆర్టీసీ కార్గో పార్సిల్‌ సర్వీసులను కూడా ఇందుకు వాడుతున్నారని అనుమానిస్తున్నారు. తప్పుడు ఫోన్‌నెంబర్లు, చిరునామాలతో ఒక గ్రాము నుంచి నాలుగైదు గ్రాముల వరకు పౌడర్, మాత్రలను కొరియర్ల ద్వారా పంపుతున్నారన్న సమాచారం దర్యాప్తు సంస్థల వద్ద ఉంది. ఇటీవల నాచారంలో ఓ వ్యక్తి ఆ్రల్పాజోలంను ఆర్టీసీ కార్గోలో పంపించినట్లు ఎక్సైజ్‌ అధికారులు గుర్తించారని సమాచారం.

వయా హైదరాబాద్‌.. టు ముంబై 
లాక్‌డౌన్‌ కాలంలో ఏపీ, ఒడిశా, తెలంగాణలోని ఏజెన్సీ, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో భారీగా గంజాయి సాగు చేశారు. దీనికితోడు ఈ ఏడు భారీగా వర్షాలు కురియడం గంజాయి స్మగ్లర్లకు కలిసి వచ్చింది. ఈ మూడు రాష్ట్రాల్లో పండిన గంజాయిని హైదరాబాద్‌ మీదుగా ముంబై, బెంగళూరులకు సరఫరా చేస్తున్నారు. తొలుత గంజాయిని లారీల్లో అదనపు కేబిన్లు ఏర్పాటు చేసి రవాణా చేశారు. ఈ విషయాన్ని టోల్‌గేట్ల వద్ద ఉన్న పోలీసులు, నిఘా సంస్థలు కనిపెట్టడంతో రూటు మార్చారు. ఈసారి ఖరీదైన కార్ల డిక్కీల్లో గంజాయిని ప్యాక్‌ చేసి రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. ఇటీవల అశ్వాపురం పోలీసులు జగ్గారం క్రాస్‌రోడ్‌ వద్ద వాహన తనిఖీల్లో ఓ కారులో 163 ప్యాకెట్లలో ఉన్న 326 కేజీల గంజాయిని గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో వ్యక్తులిద్దరూ ఒడిశాకు చెందిన వారు. వీరిద్దరూ జహీరాబాద్‌ మీదుగా గంజాయిని మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నట్లుగా వెల్లడించారు. అలాగే విశాఖపట్నం జిల్లా గోలిగొండ మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు విశాఖ ఏజెన్సీ నుంచి మహారాష్ట్రకు గంజాయి రవాణా చేస్తుండగా హద్నూర్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి 436 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: టెన్నిస్‌ బంతులతో బుక్కయ్యారు!)

ఎండు గంజాయితో పాటు పచ్చళ్ల బాటిళ్ల మధ్యన ద్రవరూ పంలోకి మార్చిన గంజాయిని సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల నగర పోలీసులు కూడా ఇలాంటి ఓ ముఠాను పట్టుకున్నారు. కొత్త సంవత్సర వేడుకల కోసం ముంబై, ఇతర నగరాల కోసం లిక్విడ్‌ గంజాయి, మెఫిడ్రిన్‌ పౌడర్, ఇతర మాత్రల ఆర్డర్లు భారీగా వచ్చినట్లు తెలిసింది.  
 

>
మరిన్ని వార్తలు