విజయ్‌కి ‘లైగర్‌’ సెగ!

1 Dec, 2022 03:24 IST|Sakshi
ఈడీ విచారణ అనంతరం బయటికి వస్తున్న విజయ్‌ దేవరకొండ

ఈడీ ఎదుట హాజరైన విజయ్‌ దేవరకొండ

లైగర్‌ సినిమాలో పెట్టుబడుల విషయమై ప్రశ్నలు 

కొందరు రాజకీయ నేతల డబ్బులున్నట్లు అనుమానం 

త్వరలో కరణ్‌ జోహార్‌ సహా మరికొందరికి నోటీసులు 

సాక్షి, హైదరాబాద్‌: ‘లైగర్‌’చిత్రంలో పెట్టుబడులకు సంబంధించిన సెగ ఆ చిత్రంలో నటించిన హీరో విజయ్‌ దేవరకొండకు తగిలింది. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారుల ఎదుట ఆయన బుధవారం హాజరయ్యారు. ప్రధానంగా భారీ బడ్జెట్‌తో కూడిన ఆ సినిమా నిర్మాణానికి పెట్టుబడులు పెట్టిన వారి విషయం పైనే ఈడీ దృష్టి పెట్టింది.

కొందరు రాజకీయ నేతలు మనీలాండరింగ్‌ ద్వారా లైగర్‌లో పెట్టుబడులు పెట్టారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈడీ గత నెల 17న ఈ సినిమా దర్శకనిర్మాతలు పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్‌లను 10 గంటలపాటు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. వారి విచారణలో వెలుగులోకి వచ్చిన కొన్ని అంశాలను క్రాస్‌ చెక్‌ చేసుకోవడానికి విజయ్‌ దేవరకొండకు నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్‌ చట్టంలోని సెక్షన్‌ 50 ప్రకారం అధికారులు ఆయన వాంగ్మూలం నమోదు చేశారు.
 
రెమ్యునరేషన్‌ ఎలా తీసుకున్నారు? 
విజయ్‌ తన మేనేజర్‌తో కలిసి బుధవారం ఉదయం 8.30 గంటలకు ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఈడీ అధికారులకు ఇవ్వడానికి తన వెంట కొన్ని పత్రాలను తెచ్చారు. ఉదయం 10.30 గంటలకు విజయ్‌ను ప్రశ్నించడం ప్రారంభించిన అధికారులు గంట భోజన విరామం ఇచ్చారు. ఆ తర్వాత ప్రారంభమైన విచారణ రాత్రి 8 గంటల వరకు సాగింది. ఈ చిత్ర నిర్మాణంతోపాటు విజయ్‌ తీసుకున్న రెమ్యునరేషన్‌కు సంబంధించి అధికారులు ప్రశ్నల్ని సంధించారు. పారితోషికాన్ని చెక్కుల ద్వారానా, ఆన్‌లైన్‌లోనా లేదా నగదు రూపంలో తీసుకున్నారా అని ప్రశ్నించారు.

ఈ చిత్రానికి సంబంధించి నిర్మాతలతో చేసుకున్న ఒప్పంద పత్రాలను విజయ్‌ నుంచి తీసుకున్నారు. ఈ చిత్రానికి పెట్టుబడులు పెట్టిన వారిలో హైదరాబాద్‌కు చెందిన కొందరు రాజకీయ నేతలు ఉన్నారన్నది ఈడీ అనుమానం. ఈ విషయంపై అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఆయన.. నటించడం మాత్రమే తన బాధ్యతని, ఆర్థిక లావాదేవీల్లో కలగజేసుకోలేదని చెప్పారని సమాచారం.

తాను ఎక్కువగా దర్శకుడితోనే సంప్రదింపులు జరిపానని, తమ మధ్య పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలపై ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ చిత్రం నిర్మాణంలో ఉన్నప్పుడు, వివిధ ఫంక్షన్ల సమయంలోనూ రాకపోకలు సాగించిన, హాజరైన వారి జాబితాలను అధికారులు సేకరిస్తున్నారు. వీరికి నిర్మాతలతో ఉన్న సంబంధాలపై ఆరా తీయనున్నారు.

అధికారులు త్వరలో మరికొందరు సినీ, రాజకీయ ప్రముఖులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. లైగర్‌ నిర్మాతల్లో పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్‌తోపాటు బాలీవుడ్‌ ప్రముఖుడు కరణ్‌ జోహార్, అపూర్వ మెహతా సైతం ఉన్నారు. వీరికీ నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రంలో నటించిన మైక్‌ టైసన్‌ రెమ్యునరేషన్‌ అంశాన్నీ ఈడీ అధికారులు పరిగణనలోకి తీసుకుంటున్నారని సమాచారం. ఈ కేసుకు సంబంధించి మరికొందరి విచారణ పూర్తయిన తర్వాత అవసరమైతే విజయ్‌ను మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది.  

వారికి కావాల్సిన జవాబులిచ్చా.. 
ఈడీ విచారణ అనంతరం విజయ్‌ దేవరకొండ మీడియాతో మాట్లాడారు. విచారణ నేపథ్యంలో అధికారులు తన రెమ్యునరేషన్‌ వివరాలు అడిగారని, తాను చెప్పానని పేర్కొన్నారు. ‘మీరందరూ ఎలా ఉన్నారు. (మీడియా వాళ్లను ఉద్దేశించి) చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు... దాదాపు రోజంతా కదా!! నేను లోపల (ఈడీ కార్యాలయంలో) 12 గంటలు ఉన్నా. ఈడీ వాళ్లు కొన్ని క్లారిఫికేషన్స్‌ అడిగారు. వాళ్ల డ్యూటీ వాళ్లు చేస్తున్నారు. వారికి కావాల్సిన జవాబులు ఇచ్చాను.

మీరు ఎంతగానో ప్రేమిస్తారు... ఆ పాపులారిటీ వల్ల కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందులో ఇదీ ఒకటి. నన్ను ఈడీ వాళ్లు పిలిచినప్పుడు వచ్చి నా డ్యూటీ నేను చేశాను. గురువారం రమ్మని పిలవలేదు’అని విజయ్‌ అన్నారు. ఏ కేసుపై మిమ్మల్ని విచారించారు అన్న మీడియా ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా గుడ్‌నైట్‌ అంటూ వెళ్లిపోయారు.    

మరిన్ని వార్తలు