విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తే అనుమానిస్తారా?

15 Sep, 2021 01:11 IST|Sakshi

రఘురామకృష్ణరాజు బదిలీ పిటిషన్‌పై హైకోర్టు జడ్జి వ్యాఖ్య 

అభ్యంతరం ఉంటే అప్పీలు చేసుకోవచ్చు 

అలాకాకుండా ప్రత్యేకకోర్టు ఆదేశాలను ఎలా ప్రస్తావిస్తారని నిలదీత 

రఘురామ పిటిషన్‌ సహేతుకం కాదన్న సీబీఐ 

తీర్పు నేటికి వాయిదా 

సాక్షి, హైదరాబాద్‌:  ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చినందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిపై అనుమానం వ్యక్తం చేస్తారా అని ఏపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాదిని హైకోర్టు నిలదీసింది. ఆ అనుమతులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అప్పీలు చేయలేదని.. అలాంటప్పుడు ఆ ఆదేశాలను ప్రస్తావిస్తూ, అనుమానాలు ఎలా వ్యక్తం చేస్తారని న్యాయమూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ప్రశ్నించారు. తాను కూడా ఇలాంటి కేసుల్లో నిందితులు విదేశాలకు వెళ్లేందుకు అనుమతించానని చెప్పారు. ఇది సహేతుక కారణం కాదని.. సదరు కోర్టు ఎదుట ఉన్న పిటిషన్లను మరో కోర్టుకు బదిలీ చేయాలని కోరడం సరికాదని స్పష్టం చేశారు. 

అత్యవసర విచారణలో.. 
పెట్టుబడుల కేసులో బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ ప్రత్యేక కోర్టులో తాను వేసిన పిటిషన్‌ను మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ట్రాన్స్‌ఫర్‌ పిటిషన్‌పై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ మంగళవారం భోజన విరామం తర్వాత అత్యవసర విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. గత నెల 26న తాము దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టివేసిందంటూ సాక్షి వెబ్‌సైట్లో కథనాన్ని ఉంచిందని కోర్టుకు వివరించారు.

ఇదే కేసులో రెండో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి రెండు వారాలపాటు దుబాయ్, మాల్దీవులు, ఇండోనేషియా దేశాల్లో పర్యటించేందుకు ప్రత్యేక కోర్టు అనుమతించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో తమకు ప్రత్యేక కోర్టుపై అనుమానాలు ఉన్నాయని, అందువల్ల తమ పిటిషన్‌ను మరో కోర్టుకు బదిలీ చేసి విచారించేలా ఆదేశించాలని కోరారు. అయితే.. జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఎప్పుడు పిటిషన్‌ దాఖలు చేశారని న్యాయమూర్తి ప్రశ్నించగా.. ఏప్రిల్‌ నెలలో వేశామని న్యాయవాది బదులిచ్చారు.

ఆగస్టు 25న తమ పిటిషన్‌పై ఆదేశాలు రావాల్సి ఉందని, అయితే విజయసాయిరెడ్డి బెయిల్‌ను కూడా రద్దు చేయాలంటూ తాము పిటిషన్‌ వేయడంతో.. రెండు పిటిషన్లపై ఈ నెల 15న ఆదేశాలు ఇస్తామని ప్రత్యేక కోర్టు పేర్కొన్నదని వివరించారు. 

అప్పీలు చేయకుండానే.. 
విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంపై అభ్యంతరం ఉన్నట్లయితే.. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీల్‌ చేశారా అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. అప్పీల్‌ చేయలేదని రఘురామ తరఫు న్యాయవాది బదులిచ్చారు. అలాంటప్పుడు ప్రత్యేక కోర్టు ఆదేశాలను ఎలా ప్రస్తావిస్తున్నారని న్యాయమూర్తి నిలదీశారు. గతంలోనూ విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు ప్రత్యేక కోర్టు అనుమతించిందని గుర్తు చేశారు.

అప్పుడు ప్రత్యేక కోర్టు విధించిన షరతులను విజయసాయిరెడ్డి ఏమైనా ఉల్లంఘించారా అని సీబీఐ స్పెషల్‌ పీపీ సురేందర్‌ను ప్రశ్నించారు. అలాంటిదేమీ లేదని స్పెషల్‌ పీపీ తెలిపారు. అంతేగాకుండా మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు.

సహేతుక కారణాలేవీ చూపకుండానే, బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు వెలువరించనున్న తరుణంలో ఇలా పిటిషన్‌ను మరో కోర్టుకు బదిలీ చేయాలని కోరడం సరికాదని స్పష్టం చేశారు. నిందితులు విదేశాల్లో పర్యటించేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనేక సార్లు ఆదేశాలు ఇస్తూ ఉంటుందని.. అంత మాత్రాన పిటిషన్‌ మరో కోర్టుకు బదిలీ చేయాలని కోరడం సరికాదని పేర్కొన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును బుధవారానికి వాయిదా వేశారు.   

మరిన్ని వార్తలు