50 రకాల కొత్త ఉత్పత్తులతో వస్తున్న ‘విజయ డెయిరీ’ 

19 Aug, 2021 01:02 IST|Sakshi

ఇప్పటికే దూద్‌పేడా, మిల్క్‌ కేక్, బాసుందిల అమ్మకాలు 

నేడే రేపో మార్కెట్లోకి జొన్న, రాగి, మిల్లెట్‌ లడ్డూలు, సోన్‌ పాపిడీ, చిక్కీలు 

గులాబ్‌జామ్, రస్‌మలాయ్, మిక్చర్‌ కూడా.. 

తక్కువ ధరల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు 

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ మార్కెట్లోకి 50కిపైగా కొత్త ఉత్పత్తులతో దూసుకురానుంది. ఇప్పటివరకు పాలు, పాల సంబంధిత ఉత్పత్తులకే పరిమితంకాగా.. త్వరలో తృణధాన్యాల లడ్డూలు, చిక్కీలు, చాక్లెట్లు, బూందీ ఇతర మిక్చర్లను అందుబాటులోకి తేనుంది. ఒకట్రెండు రోజుల్లో 12 వెరైటీలను, 10 రోజుల్లో మరో 10 రకాల ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని డెయిరీ అధికారులు చెప్తున్నారు. దసరా నాటికి మరో 20, దీపావళి నాటికి ఇంకో 10 ఉత్పత్తులను తమ ఔట్‌లెట్ల ద్వారా విక్రయిస్తామని పేర్కొంటున్నారు. 

డెయిరీ ఉత్పత్తులకు ఆదరణ 
విజయ డెయిరీ ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి ఆదరణ ఉంది. దూద్‌పేడా, మిల్క్‌కేక్‌లతోపాటు ఇటీవల అందుబాటులోకి తెచ్చిన నెయ్యి మైసూర్‌పాక్‌కు కూడా మంచి గిరాకీ ఉంది. కరోనా నేపథ్యంలో రోగ నిరోధక శక్తి పెంచే ఉత్పత్తులను మార్కెట్లోకి తేవాలని విజయ డెయిరీ గతంలోనే నిర్ణయించింది. ఈ మేరకు ఫైబర్, ప్రోటీన్‌లు ఎక్కువగా ఉన్న పదార్థాలతో కూడిన స్వీట్లను అందుబాటులోకి తెస్తోంది. జొన్న, రాగి, మిల్లెట్‌ లడ్డూలతోపాటు బేసిన్‌ లడ్డూలను తయారు చేస్తోంది. ఇతర డెయిరీలకు దీటుగా సున్నుండలు, మలాయి లడ్డూ, బాదం హల్వా తయారుచేసి ఔట్‌లెట్లలో విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 

వేరుశనగతో పాటు కాజు, బాదం చిక్కీలు, గులాబ్‌జామ్, రస్‌మలాయ్‌ మిక్స్‌ల తయారీపై విజయ డెయిరీ అధికారులు ఇప్పటికే ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారు. నీళ్లలో కలుపుకొని తాగేలా బాదం మిక్స్‌ పొడిని తయారు చేస్తున్నారు. 
కొత్త ఉత్పత్తులన్నింటినీ మార్కెట్లో ఉన్న ఇతర సంస్థల కంటే తక్కువ ధరలకే అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
ఇక అమూల్‌ డెయిరీకి దీటుగా చాక్లెట్ల తయారీ, కారం బూందీ, మిక్చర్‌ లాంటి స్నాక్స్‌ను కూడా అందుబాటులోకి తేవడంపైనా దృష్టిపెట్టారు. 
విస్తృతంగా మార్కెట్లోకి ప్రవేశించే ఏర్పాట్లలో భాగంగా ఈ నెలలోనే భారీ డెయిరీకి శంకుస్థాపన చేయనున్నట్టు తెలిసింది.   

మరిన్ని వార్తలు