Vijayashanthi: టీడీపీతో పొత్తు ఉంటుందా?

31 Dec, 2022 04:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో టీడీపీతో బీజేపీ పొత్తుపై వస్తున్న ఊహాగానాలపై స్పష్టత ఇవ్వాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పార్టీ నాయకత్వాన్ని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో టీడీపీ–బీజేపీ పొత్తు అంశం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తోందని వారు జాతీయ నేతల దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిసింది.

శామీర్‌పేటలోని ఓ రిస్టార్‌లో జరిగిన బీజేపీ ముఖ్య నాయకుల సమావేశంలో విజయశాంతి, అర్వింద్‌లు ఈ విషయం ప్రస్తావించడం చర్చనీయాంశం అయింది. రాష్ట్రంలో ఇటీవల బల ప్రదర్శన చేయడం ద్వారా తన ఉనికిని చాటుకునేందుకు టీడీపీ ప్రయత్నించిన నేపథ్యంలో ఈ అంశం హాట్‌ టాపిగ్గా మారిందని వారు చెప్పినట్లు తెలిసింది.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్‌ సంతోష్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్, సంస్థాగత ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌ సమక్షంలో.. విజయశాంతి ఈ విషయం లేవనెత్తారని, అర్వింద్‌ కూడా పొత్తులపై స్పష్టత ఇవ్వాలని కోరారని తెలిసింది. కాగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కారణంగా కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా నష్టపోయిన విషయం తనకు ప్రత్యక్షంగా తెలుసునని విజయశాంతి పేర్కొన్నట్టు సమాచారం.  

స్పందించని  జాతీయ నాయకత్వం
ఆకస్మికంగా పొత్తుల అంశం చర్చకు రావడంతో సమావేశంలో కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది. అయితే తెలంగాణలో టీడీపీతో ఎలాంటి పొత్తు ఉండదని బండి సంజయ్‌ స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని కార్యకర్తలకు కూడా తెలియజేయాలని ఆయన సూచించారు.

వేదికపై జాతీయ నాయకులున్నా, పొత్తులపై వారు ఎలాంటి వ్యాఖ్యలూ చేయకపోయినా.. సంజయ్‌ మాత్రం కల్పించుకుని పొత్తు ప్రసక్తే లేదని చెప్పినట్లు సమాచారం. ఇదే విషయాన్ని గతంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ కూడా ప్రకటించిన సంగతి విదితమే. కాగా తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఇదివరకే నాయకత్వం స్పష్టం చేసిన విషయాన్ని సంజయ్‌ గుర్తు చేసినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.    

మరిన్ని వార్తలు