నిజాయితీ అధికారికి బదిలీ బహుమానమా?.. కారణం అదేనా!

11 Feb, 2023 15:07 IST|Sakshi
బదిలీపై వెళ్లిన డీఎఫ్‌ఓ వెంకటేశ్వర్‌రెడ్డి 

సాక్షి, వికారాబాద్‌: అధికారులు అవకాశవాదులుగా మారి.. ప్రజాప్రతినిధులు, బడా వ్యక్తుల అడుగులకు మడుగులొత్తుతున్న సమయంలో నిజాయితీగా ఉండటం   సవాలే.. నిజాయితీగా వ్యవహరిస్తే అవార్డులు, రివార్డులు ఏమో గానీ బదిలీ.. లేక సస్పెన్షన్‌ వేటో తప్పదన్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.  ప్రస్తుతం డీఎఫ్‌ఓ విషయంలో కూడా ఇదే రుజువయ్యింది. అయిన వచ్చీ రాగానే అక్రమార్కులకు సింహస్వప్నమయ్యారు. వారి గుండెల్లే రైళ్లు పరిగెత్తేలా చేశారు.

కానీ వచ్చిన అనతికాలంలోనే అనేక మార్పులకు నాంది పలికిన ఆయన అక్రమార్కులకు కొరకరాని కొయ్యగా మారారు. ఎవరు చెప్పినా... హెచ్చరించిన లెక్క చేయకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. అలాంటి జిల్లా ఫారెస్టు అధికారి జిల్లా డీఎఫ్‌ఓగా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్‌రెడ్డి ఐదు నెలల్లోనే బదిలీ కాకా తప్పలేదు. 

సంస్కరణలకు శ్రీకారం 
డీఎఫ్‌ఓ వెంకటేశ్వర్‌రెడ్డి అనేక మార్పులకు, సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఏళ్లుగా ఆక్రమణలకు నోచుకున్న వాటిని బయటకు తీసి రుజువులతో సహా కోర్టు ముందుంచారు. వికారాబాద్, తాండూరు సమీపంలో కాంట్రాక్టర్లు ఫారెస్టు భూముల్లో తవ్వకాలు జరిపి రూ. వందల కోట్ల విలువగల ఖనిజ సంపద తరలిస్తున్నారని గుర్తించి అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ఫారెస్టు భూములు కబ్జా చేసిన వారిపై కేసులు నమోదు చేయించారు. వారు కోర్టులకు వెళ్తే కౌంటర్‌ ఫైల్‌ వేశారు.

అనుమితి లేని సా మిల్లులపై ఉక్కుపాదం మోపారు. అక్రమ కలప రవాణాను అడ్డుకోవటం, అక్రమ కలప కొనుగోలు దారులకు రూ.లక్షల్లో ఫైన్లు వేయటం, అనుమతిలేకుండా ఫారెస్టు భూముల్లోంచి రోడ్లు వేసిన కాంట్రాక్టర్లకు ఫైన్లు వేయటం లాంటి అనేక విషయాల్లో ఆయన ఉక్కుపాదం మోపారు. ఇక వారి ఆటలు సాగవని భావించి కొందరు  ప్రజా ప్రతినిధులపై వత్తిడి తెస్తూ వచ్చారు. ఎట్టకేలకు  నిజాయితీగా వ్యవహరించిన అధికారిని సాగనంపారు.  

మరిన్ని వార్తలు