అడవి జంతువులకు బోర్లేస్తరు.. మేమంతకన్నా హీనమా?

16 Mar, 2022 04:12 IST|Sakshi

నిర్మల్‌ జిల్లా చాకిరేవు గ్రామవాసుల ఆవేదన 

నీళ్లు రాక.. కరెంటు లేక.. రోడ్లెయ్యక అవస్థలు

సమస్యలు తీర్చాలంటూ ఊరు ఊరంతా కలెక్టరేట్‌కు 

75 కి.మీ. కాలినడకన పిల్లాపాపలతో పట్టణానికి 

మా కష్టాలు చెప్పడానికే నడిచొచ్చినం.. తీర్చే దాకా పోయేది లేదని స్పష్టీకరణ

అన్నం తిన్నంక బిడ్డ నీళ్లడిగితే ఏం చెప్పాల్నో తెలుస్తలేదు. ఫారెస్టు వాళ్లు జంతువులకు బోర్లేస్తరు. మేం అంతకన్నా హీనమా? ఆన్‌లైన్‌ క్లాసులని పిల్లలంటే కరెంటు లేక, సిగ్నల్‌ రాక పిల్లలకు ఏం చెప్పమంటారు? మా ఊరికి రోడ్డు, బోరు, కరెంటు, ఆశ వర్కరు వచ్చే దాకా ఇక్కడ్నుంచి పోం. ఈడనే అటుకులు తింటం. బియ్యం వండుకుంటం. మేమేం జాబులు అడుగుతలేం. పైసలియ్యమంటలేం. ఊరి సమస్యలు తీర్చమంటున్నం. అందుకే ఇంత దూరం నడుసుకుంట వచ్చినం’అంటూ తమ పల్లె గోసను నీళ్లు తిరుగుతున్న కళ్లతో జిల్లా అధికారుల ముందు వెళ్లబోసుకుంది ఆదివాసీ బిడ్డ నిర్మల. 

నిర్మల్‌: తమ గ్రామ సమస్యలు తీర్చాలంటూ ఊరు ఊరే కదిలొచ్చింది. నిర్మల్‌ జిల్లా పెంబి మండలం చాకిరేవు గ్రామవాసులంతా పిల్లాపాపలతో కలిసి 75 కిలోమీటర్లు నడిచి జిల్లా కలెక్టరేట్‌కు వచ్చారు. కాళ్లకు చెప్పుల్లేకున్నా చిన్నారులు, మహిళలు వడివడిగా నడుస్తూ వచ్చేశారు. ఏడాది కిందే సమస్యలను విన్నవించినా పరిష్కరించలేదని  ఇద్దరు అడిషనల్‌ కలెక్టర్ల ముందు తమ గోడు చెప్పుకున్నారు.

ఇలా ఒక్క చాకిరేవే కాదు.. నిర్మల్‌ జిల్లాలోని పలు అటవీ గ్రామాలు ఇంకా కరెంటును చూడకుండా.. బీటీ రోడ్డు ఎక్కకుండా.. చెలిమల నీళ్లే దిక్కుగా బతుకీడుస్తున్నాయి. రాకెట్లు నింగికి పంపుతున్న ఈ కాలంలో, మిగులు విద్యుత్‌ మూటగట్టుకుంటున్న మన రాష్ట్రంలో ఇంకా గుడ్డి వెలుగురులోనే ముందుకు సాగుతున్నాయి.  


చెలిమల నీళ్లు తోడుకుంటున్న చాకిరేవు గ్రామస్తులు 

రాత్రిపూట ఏం కష్టమొచ్చినా ఇబ్బందే.. 
నిర్మల్‌ జిల్లా కేంద్రం నుంచి 75 కిలోమీటర్లు వెళ్తే పెంబి మండలంలోని అటవీ గ్రామం చాకిరేవు వస్తుంది. పెంబి నుంచి 4 కిలోమీటర్ల వరకు మట్టిరోడ్డుంది. మధ్యలో దొత్తివాగు వస్తుంది. దీనిపైన వంతెన లేదు. వాగు దాటాక దాదాపు 10 కిలోమీటర్లు ఆ ఊరి వరకు రోడ్డు లేదు. కరెంటు పోతే క్షణం ఉండలేని ఈరోజుల్లో అక్కడ అనాదిగా విద్యుత్‌ను చూడని కుటుంబాలున్నాయి. చీకటి పడితే ఇప్పటికీ నూనెలో వత్తి వేసుకుంటున్నాయి.

25–30 కుటుంబాలు ఉండే ఈ పల్లెలో పొద్దంతా వ్యవసాయం చేస్తూ చీకటి వేళకు ఇళ్లకు చేరుకుంటున్నారు. కరెంటుతో పాటు తాగు నీళ్లూ ఆ ఊరికి అందట్లేదు. కిలోమీటర్ల దూరంలోని వాగులు, చెలిమెలే దిక్కవుతున్నాయి. రాత్రిపూట ఏ కష్టం వచ్చినా ఇబ్బందే. ఊరంతా కలిసి టార్చిలైట్లు పట్టుకుని పరిష్కరించుకోవాల్సిందే. ప్రసవానికైనా, ప్రమాదం జరిగినా ఊరికి అంబులెన్స్‌ వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎడ్లబండ్లపైనే తీసుకురావాలి. ఈ కష్టాలను తీర్చాలంటూ ఊరు ఊరంతా నిర్మల్‌ కలెక్టరేట్‌ వరకు నడిచి వచ్చింది. ఇలా నడిచి వచ్చిన వారిలో పిల్లలు, వృద్ధులతో పాటు ఓ గర్భిణి ఉన్నారు. 


పెంబి నుంచి చాకిరేవుకు వెళ్లే మార్గం 

ఎన్నో గ్రామాల్లో నూనె దీపాలే.. 
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని పలు ఆదివాసుల గూడేల్లో ఇంకా విద్యుత్, రోడ్డు, తాగునీటి సౌకర్యాల్లేవు. నిర్మల్‌ జిల్లా పెంబి మండలం సోముగూడ, చాకిరేవు, రాగిదుబ్బ.. కడెం మండలంలోని మిద్దెచింత, రాంపూర్, వస్‌పల్లి పంచాయతీ పరిధిలోని పలు గూడేలకు కరెంటు లేదు. చాలా కుటుం బాలు కిరోసిన్, మంచి నూనెతో దీపాలు పెట్టుకుంటు న్నాయి. గతంలో ఐటీడీఏ కొన్ని గ్రామాలకు సోలార్‌ లైట్లను పంపినా  చాలావరకు పనిచేయట్లేదు. రోడ్లు లేక కాలినడకనే  జనం నడుస్తున్నారు. అటవీ చట్టాలు, అనుమతుల పేరిట పెడుతున్న నిబంధనలే వీరికి శాపంగా మారుతున్నాయి. 


దీపం వెలుతురులో బియ్యం ఏరుతున్న యువతి 

ఊర్ల ఉంటే ఎవుసం చేసుకొనైనా బతుకుతం 
కరెంటు, మంచి నీళ్లు లేకుండా ఆ ఊర్లో ఎట్లుంటున్నరు? ఇన్ని కష్టాల మధ్య అడవిలో ఉండే కంటే వేరే దగ్గరికి పోవచ్చు కదా’అని ఆదివాసీ మహిళ లక్ష్మీబాయిని అడిగితే.. ‘ఎటుపోతం సారూ.. తాతల కాలం నుంచి మేం నమ్ముకు న్న భూములను ఇడిసి యాడికి పోవాల? ఏం పని చేసుకుని బతకాల? ఊర్ల ఉంటే ఇంత ఎవుసం చేసుకునైనా బతుకుతం’అని చెప్పింది. కలెక్టరేట్‌లో అడిషనల్‌ కలెక్టర్లు రాంబాబు, హేమంత్‌ బోర్కడేలకు ఊరివాళ్లంతా కలిసి వినతిపత్రం ఇచ్చారు. తర్వాత కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించారు. వీరి పాదయాత్రకు తెలంగాణ ఆదివాసీ సంఘం, బీజేపీ, వైఎస్‌ఆర్‌టీపీ నాయకులు మద్దతు తెలిపారు.   

మరిన్ని వార్తలు