సామాన్యులకు సుప్రీంకోర్టు అందుబాటులో లేదు 

21 Nov, 2021 02:06 IST|Sakshi

రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్‌ వినోద్‌ కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌: సామాన్యులకు సుప్రీంకోర్టు అందుబాటులో లేకుండా పోయిందని, ప్రజలకు సుప్రీంకోర్టు సేవలు అందుబాటులో ఉండాలంటే ప్రాంతీయ బెంచ్‌ల ఏర్పాటు ఒక్కటే పరిష్కారం అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్‌ వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. శనివారం ఎల్బీనగర్‌లోని మహాత్మాగాంధీ లా కాలేజీలో ‘నీడ్‌ ఆఫ్‌ రీజనల్‌ సుప్రీంకోర్టు బెంచెస్‌ ఇన్‌ ఇండియా’అనే అంశంపై జరిగిన సెమినార్‌లో వినోద్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రాంతీయ బెంచ్‌లను ఏర్పాటు చేయాలని, హైదరాబాద్, ముంబై, కోల్‌కతాలో ప్రాంతీయ బెంచ్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టంచేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో జడ్జిల నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు జడ్జిల నియామకాల్లో తీరని అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు.

సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు ఒక్క ఎస్టీ జడ్జి కూడా లేరన్నారు. దేశంలోని హైకోర్టుల్లో 44 లక్షల కేసులు పెండింగులో ఉన్నాయని, సుప్రీంకోర్టులో 59,211, దేశవ్యాప్తంగా జిల్లా, సబార్డినేట్‌ కోర్టుల్లో 3,10,72,000 కేసులు పెండింగులో ఉన్నాయని వివరించారు. 

>
మరిన్ని వార్తలు