Hyderabad Rains: నగరాన్ని ముంచెత్తిన జోరు వాన..  వరద నీటిలో చిన్నారుల ఈత

27 Sep, 2022 09:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హోరెత్తిన వాన నగరాన్ని వణికించింది. చినుకులా రాలి వరదలా మారి జడిపించింది. ఉరుములు, మెరుపులతో హడలెత్తించింది. వరుణుడు విరుచుకుపడ్డాడు. సాయంత్రం మొదలైన వర్ష బీభత్సం అర్ధరాత్రి వరకూ తన ప్రతాపం చూపించింది. ఈ సీజన్‌లోనే అతి భారీగా కురిసి సిటీజనుల్ని గడగడలాడించింది. రహదారులపై వరద వెల్లువలా పారింది. ఎక్కడి వాహనాలు అక్కడే కిలోమీటర్ల మేర నిలిచిపోయి నరకాన్ని తలపించింది. సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో  సుమారు గంట వ్యవధిలో పలు చోట్ల 5 సెంటీ మీటర్ల మేర కురిసిన జడివానతో నగరం చిగురుటాకులా వణికిపోయింది.


గోల్కొండ కోట పరిసరాల్లో కురుస్తున్న వర్షం 

జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌ విభాగాలు హైఅలర్ట్‌ ప్రకటించాయి. అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని హెచ్చరికలు జారీ చేశాయి. ముంపు సమస్యలపై బల్దియా కాల్‌సెంటర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వరద నీరు వెళ్లేందుకు మ్యాన్‌హోల్‌ మూతలను తెరవరాదని జలమండలి సూచించింది. సాయంత్రం వేళ వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు,విద్యాసంస్థల నుంచి బయటకు వెళ్లిన వారు సుమారు నాలుగు గంటల పాటు ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో చిక్కుకున్నారు. సోమవారం రాత్రి 10 గంటల వరకు గోషామహల్‌ సర్కిల్‌ నాంపల్లిలో అత్యధికంగా 9.5, కార్వాన్‌ పరిధిలోని టోలిచౌకీలో అత్యల్పంగా 3.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

చిన్నారుల ఈత
హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎక్కడ చూసిన వరద నీరే కనిపించింది. మల్లేపల్లి వద్ద రోడ్డుపై భారీగా వరద నీరు చేరడంతో ఇద్దరు చిన్నారులు అందులోనే ఈతకొట్టారు. రోడ్డుపై వాహనాలు వెళ్తున్న చిన్నారులు ఈత కొట్టడం విశేషం.. ఈ వీడియో తాజాగా వైరల్‌గా మారింది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మునిగిన సెల్లార్లు..   
మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్, జేబీఎస్‌– ఎంజీబీఎస్, నాగోల్‌– రాయదుర్గం మూడు మెట్రో రూట్లలోనూ ట్రాఫిక్‌ రద్దీ కనిపించింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వందలాది బస్తీలు నీటమునిగాయి. ఇళ్లలోకి చేరిన వరదనీటిని తొలగించేందుకు బస్తీల వాసులు నానా అవస్థలు పడ్డారు. పలు అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి వరదనీరు చేరడంతో స్థానికులు బెంబేలెత్తారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి అత్యవసర విభాగాలు రంగంలోకి దిగి వరద నీటిని తోడాయి. వరద నీటి చేరికతో నగరంలోని సుమారు 1500 కి.మీ మార్గంలో ఉన్న ప్రధాన నాలాలు ఉద్ధృతంగా ప్రవహించాయి.  రానున్న 24 గంటల్లో నగరంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. 


మెహిదీపట్నం ఎన్‌ఎండీసీ వద్ద ట్రాఫిక్‌జాం 

ఈ ప్రాంతాల్లో బీభత్సం.. 
నగరంలో జడివాన పలు చోట్ల బీభత్సం సృష్టించింది. ప్రధానంగా నాంపల్లి, పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లక్డీకాపూల్, నాంపల్లి, ట్యాంక్‌బండ్, రాజేంద్రనగర్, శంషాబాద్, గండిపేట్, కిస్మత్‌పూర్, అత్తాపూర్, మణికొండ, నార్సింగి, కాటేదాన్, లంగర్‌హౌజ్, గోల్కొండ, కార్వాన్, మెహిదీపట్నం, జియాగూడ ప్రాంతాల్లో జడివాన కారణంగా ప్రధాన రహదారులు, కాలనీలు, బస్తీలు చెరువులను తలపించాయి. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, భోలక్‌పూర్, కవాడీగూడ, గాంధీనగర్, జవహర్‌నగర్, రాంనగర్, దోమలగూడ, చార్మినార్, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, బార్కాస్, ఫలక్‌నుమా, ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్‌ ప్రాంతాల్లోనూ జడివాన సాధారణ జనజీవనాన్ని స్తంభింపజేసింది.  


మూసారంబాగ్‌ బ్రిడ్జిని ముంచెత్తిన వరద

మూసారంబాగ్‌ బ్రిడ్జిపై నిలిచిన వరదనీరు 
మలక్‌పేట: భారీ వర్షం కారణంగా మూసారంబాగ్‌ బ్రిడ్జిపై వరదనీరు చేరింది. ట్రాఫిక్‌జాం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది, మలక్‌పేట ట్రాఫిక్‌ పోలీసులు వాహనదారులకు ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు చేపట్టారు. గోల్నాక వాహేద్‌నగర్‌ బ్రిడ్జి నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ వైపు వచ్చే వాహనాల రాకపోకల రద్దీ పెరగడంతో ట్రాఫిక్‌కు ఇక్కట్లు తప్పలేదు.  


బేగంపేట్‌ ఫ్లైఓవర్‌పై నిలిచిన వరదనీరు

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం 
నగరంలో ఈదురు గాలితో కూడిన భారీ వర్షానికి గ్రేటర్‌ పరిధిలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. హబ్సిగూడ, సరూర్‌నగర్, బంజారాహిల్స్‌ సర్కిళ్ల పరిధిలో 100కు పైగా పీడర్లు ట్రిప్‌ అయ్యాయి. మలక్‌పేట్, హబ్సిగూడలో చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడటంతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కొన్ని చోట్ల 30 నుంచి 40 నిమిషాల్లో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించగా మరికొన్ని చోట్ల అర్ధరాత్రి తర్వాత కూడా సరఫరా లేకపొవడంతో ఆయా ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది. వీధుల్లో కరెంట్‌ లైట్లు వెలగకపోవడంతో నీరు నిలిచిన లోతట్టు ప్రాంతాల్లో వెళ్లే వాహనదారులు మ్యాన్‌హోళ్లలో చిక్కుకుని ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కరెంటు లేకపోవడంతో మరోవైపు  దోమలు కంటి మీద నిద్ర లేకుండా చేశాయి. 


గోల్కొండ కోటలో బతుకమ్మ పేర్చిన ప్లేట్లను తలలపై పెట్టుకున్న మహిళలు

మెట్రో రైళ్లు కిక్కిరిసి 
మరోవైపు క్యాబ్‌లు, ఆటోలు బుక్‌ కాకపోవడంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో అందరూ మెట్రోను ఆశ్రయించడంతో మెట్రో రైళ్లు కిక్కిరిసిపోయాయి.  

మరిన్ని వార్తలు