-

Video: ఎల్లలు దాటిన అనురాగం.. దాయాది దేశంలో హైదరాబాద్‌ వ్యక్తికి ఊహించని ఆతిథ్యం 

24 Nov, 2022 13:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మణికొండ పరిధిలోని పుప్పాలగూడలో నివసించే శ్యాంసన్‌ వృత్తిరీత్యా ఆటోడ్రైవర్‌. కుమార్తె తానియా సరాయ్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి. ఈ నెల ప్రథమార్థంలో ఐటీఎఫ్‌–జే 5 టోర్నమెంట్‌ కోసం మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్‌కు చెందిన సత్తయ్య, ఆయన కుమార్తె ప్రిన్సీతో కలిసి పాకిస్తాన్‌ వెళ్లారు. అక్కడి వారిని కలిసే వరకు మనసు నిండా ఎన్నో సందేహాలు, సంకోచాలు.. భయాలు. కాగా.. అక్కడ పర్యటించిన పక్షం రోజుల్లోనే వారి అభిప్రాయాన్ని మార్చేసుకున్నారు. పాకిస్థానీల వెలకట్ట లేని ప్రేమాభిమానాలతో ఉబ్బితబ్బిబ్బయ్యామని.. ఆ అనుభవాలను శ్యాంసన్‌ ‘సాక్షి’తో పంచుకున్నారు.  ఆయన మాటల్లోనే..  

అనుమానాలతో అడుగుపెట్టాం..  
పాక్‌లో జరిగిన రెండు టోర్నమెంట్లలో తానియా, ప్రిన్సీ పాల్గొనాల్సి ఉండటంతో ఈ నెల 4న అక్కడకు చేరుకున్నాం. వాఘా సరిహద్దులో దౌత్య అధికారులు మాకు ధైర్యం చెప్పారు. అయినా మనసులో తెలియని భయం. అక్కడి వాళ్లు ఎలా ఉంటారో? వారి ప్రవర్తన ఎలా ఉంటుందో? మైండ్‌ సెట్స్‌ ఏమిటి? భారతీయులు అనగానే ఎలా రిసీవ్‌ చేసుకుంటారో? ఇలా మనసులో అనేక సందేహాలతో బోర్డర్‌ దాటాం. ఇస్లామాబాద్‌లోని ఓ హోటల్‌లో బస చేశాం. అక్కడకు దాదాపు 20 కి.మీ దూరంలోని అడవిలో జిన్నా స్టేడియంలో టోర్నమెంట్‌. దీంతో ప్రతి రోజూ వెళ్లి రావాల్సి వచ్చేది.  

తాహెర్‌ ఖాన్‌తో అనుభవాలు మర్చిపోలేం... 
ఈ నెల 10న గేమ్‌ పూర్తయిన తర్వాత హోటల్‌కు తిరిగి వెళ్లడానికి క్యాబ్‌ కోసం ప్రయత్నించినా దొరకలేదు. దీంతో నిర్మానుష్యంగా ఉండే షకర్‌పరియర్‌ మీదుగా నడుచుకుంటూ వెళ్తున్నాం. అదే సమయంలో ఇస్లామాబాద్‌కు చెందిన తాహెర్‌ ఖాన్‌ తన వాహనంలో వస్తుండగా లిఫ్ట్‌ అడిగాం. వెంటనే ఆపి మా నలుగరినీ ఆయన తన కారులో ఎక్కించుకున్నారు. మేం భారతీయులం అని తెలిసిన వెంటనే ఆయన నోటి నుంచి వచ్చిన మొదటి మాట ‘వారె వాహ్‌’. హోటల్‌ దగ్గర దింపడానికి ముందు తన ఆతిథ్యం స్వీకరించాలని కోరారు. కరాచీ, ఇస్లామాబా ద్, లాహోర్‌ల్లో ఎనిమిది రెస్టారెంట్లకు యజమాని అయిన తాహెర్‌ యూట్యూబర్, బ్లాగర్‌ కూడా.   
చదవండి: ఐస్‌క్రీం ఇవ్వకుండా చిన్నారిని ఏడిపించిన వ్యక్తి.. పిల్లలతో ఆటలేంటి?

విమర్శనూ పాజిటివ్‌గా..  
పేదరికంలో ఉండీ పిల్లల భవిష్యత్తు కోసం అక్కడి వరకు వచ్చిన మమ్మల్ని చూసి  మంత్రముగ్ధుడయ్యారు తాహెర్‌ ఖాన్‌. ఇస్లామాబాద్‌లోని తన రెస్టారెంట్‌కు తీసుకువెళ్లి పాకిస్తానీ వంటకాలతో పాటు హైదరాబాద్‌ బిర్యానీ వడ్డించారు. భోజనం చేస్తున్నప్పుడే తాహెర్‌ మా పిల్లల్ని ఉద్దేశించి ఏ దేశ క్రీడాకారులతో తలపడుతున్నారని అడిగారు. పాకిస్థానీయులతోనే అని చెప్పగా... ఎవరు గెలుస్తారంటూ ప్రశ్నించారు. చివరకు గెలుపు మా చిన్నారులదే అయింది. భోజనం ముగిసిన తర్వాత హైదరాబాద్‌ బిర్యానీ రుచి వివరాలను ఆయన అడిగారు. మా దగ్గర లభించే దానికి ఏమాత్రం సరిపోదన్నాం.   

సగం మంది డబ్బు తీసుకోలేదు.. 
ఇస్లామాబాద్‌లో ఆటోలు లేకపోవడంతో 15 రోజుల టూర్‌లో భాగంగా అనేక క్యాబ్‌లు ఎక్కాం. వాటి డ్రైవర్లతో మాటల సందర్భంలో మేం భారతీయులమని చెప్పాం. దాదాపు సగం మంది డబ్బులు తీసుకోలేదు.

మరిన్ని వార్తలు