ఇలాంటి ఫ్యామిలీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్

22 Oct, 2020 19:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని దుర్గం చెరువుపై నిర్మించిన తీగల వంతెన సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వారంతంలో పెద్ద ఎత్తున నగర వాసులు వస్తుండటంతో ప్రభుత్వం వారి కోసం ప్రత్యేక అనుమతులు సైతం ఇచ్చింది. శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు వాహనాలను నిషేధించిన అధికారులు.. కేవలం పర్యట‍కులను మాత్రమే అవకాశం కల్పించారు. అయినప్పటికీ వంతెనపై రద్దీ ఏమాత్రం తగ్గడంలేదు. ట్రాఫిక్‌కి అంతరాయం కలుగుతున్నా.. అవేవీ పట్టించుకోకుండా వంతెనపైనే వాహనాలు ఆపి ఫోటోలు దిగుతున్నారు. దీంతో చర్యలకు ఉపక్రమించిన పోలీసులు.. వంతెనపై పెద్ద ఎత్తున సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బ్రిడ్జ్‌పై వాహనాలు ఆపితే.. భారీగా జరిమానాలు విధిస్తున్నారు. అయితే తామేమీ తక్కువ కాదన్నట్లు సందర్శకులు అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు.

ఇటీవల పిల్లలతో వచ్చిన ఓ కుటుంబం వంతెనపై బైక్‌ ఆపి ఫోటోలకు ఫోజులిచ్చింది. సీసీ కెమెరాలను గమనించిన భర్త.. బైక్‌ నెంబర్‌ ప్లేట్‌ కనిపించకుండా భార్య మెడలోని చున్నీని తీసి దానిని కవర్‌ చేశాడు. ఇది కూడా అక్కడి కెమెరాలో రికార్డు అయ్యింది. వీరి ఘనకార్యం కాస్తా పోలీసుల కంటపడంతో అలర్ట్‌ అయ్యారు. ఇది గమనించి వారు బైక్‌ తీసుకుని అక్కడి నుంచి పరార్‌ అ‍య్యారు. అయినప్పటికీ జరిమానా నుంచి తప్పించుకోలేదు. దీనికి సంబంధించిన వీడియోను సైబరాబాద్‌ పోలీసులు అబ్బబ్బబ్బా.. ఇలాంటి ఫ్యామిలీ నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్.. అనే క్యాప్షన్‌తో సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇది కాస్తా వైరల్‌గా మారింది. పెద్ద ఎత్తున కామెంట్స్‌ పెడుతున్నారు. బిగ్‌బాస్‌ (సీసీ కెమెరా) చూస్తున్నాడు, ఇలాంటి తెలివైన భార్య ఉండటం గ్రేట్‌ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్‌ చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా