స్తంభానికి కట్టేసి.. కళ్లలో కారం పెట్టి

5 Apr, 2022 03:30 IST|Sakshi
కుమారుడిని స్తంభానికి కట్టేసి కళ్లలో కారం పెడుతున్న తల్లి  

గంజాయికి అలవాటు పడిన కుమారుడిని దండించిన తల్లి 

సూర్యాపేట జిల్లా కోదాడలో ఘటన 

బాలుడిని కొట్టినందుకు తల్లిపై కేసు 

సాక్షి, కోదాడ: చెడుమార్గంలో వెళ్తున్న కుమారుడిని దారిలో పెట్టేందుకు ఆ తల్లి కఠినంగా వ్యవహరిం చింది. గంజాయికి అలవాటుపడి పది రోజులుగా ఇంటికి రాకుండా తిరుగుతున్న కొడుకును పట్టు కుని కరెంటు స్తంభానికి కట్టేసింది. కళ్లలో కారం పెట్టి నాలుగు దెబ్బలు వేసింది. సూర్యాపేట జిల్లా కోదాడలో సోమవారం ఈ ఘటన జరిగింది పట్టణానికి చెందిన వెంకయ్య– రమణమ్మ దంపతులది పేద కుటుంబం.

వెంకయ్య రిక్షా తొక్కుతుండగా, రమణమ్మ కూలి పనులు చేస్తోంది. వారికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. బిడ్డ పెళ్లి అయింది. 15 ఏళ్ల కుమారుడు కరోనా లాక్‌డౌన్‌కు ముందు (రెండేళ్ల క్రితం) వరకు బడికి వెళ్లేవాడు. 8వ తరగతితోనే బడి మానేసి చెడు వ్యసనాలకు అలవాటుపడ్డాడు. బాలుడు గంజాయికి బానిసైన విషయాన్ని తల్లిదండ్రులు ఏడాది క్రితం గుర్తించి మందలించారు. అయినా మానుకోకుండా.. పలుమార్లు గంజాయి తాగి రోడ్ల మీద పడిపోవడం, తల్లిదండ్రులు వెతికి ఇంటికి తీసుకురావడం జరిగింది.

అదే తరహాలో ఇటీవల ఇంట్లోంచి వెళ్లిన బాలుడు పది రోజుల తర్వాత సోమవారం ఉదయం తిరిగి వచ్చాడు. అది కూడా గంజాయి మత్తులో ఉండటం చూసిన తల్లి.. తీవ్రమైన బాధ, ఆగ్రహంతో కుమారుడిని ఇంటి ముందు ఉన్న విద్యుత్‌ స్తంభానికి కట్టేసింది. తర్వా త కళ్లలో కారం పెట్టి దండించింది. దీన్ని కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టగా వైరల్‌గా మారింది. పదిహేనేళ్ల బాలుడిని కట్టేసి, కొట్టినం దుకు పోలీసులు తల్లి మీద కేసు నమోదు చేశారు. 

ఇప్పటికైనా మారుతాడనే.. 
కరోనా మొదలైనప్పటి నుంచి నా కుమారుడు బడికి పోవడం మానేశాడు. ఏడాది నుంచి గంజా యికి అలవాటు పడ్డాడు. గంజాయి తాగి ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద పడిపోతుంటే.. రాత్రివేళ నేను, నా భర్త వెతికి ఇంటికి తీసుకువస్తున్నాం. ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా మారుతాడనే ఆశతో తప్పనిసరి పరిస్థితుల్లో కఠినంగా శిక్షించాను. – బాలుడి తల్లి 

చదవండి: బంజారాహిల్స్‌ పబ్‌ డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు..

మరిన్ని వార్తలు