వంగపండుకు విరసం నివాళి

5 Aug, 2020 09:25 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ విప్లవ కవి, కళాకారుడు వంగపండు ప్రసాద్‌ మృతి పట్ల విప్లవ రచయితల సంఘం ఒక ప్రకటనలో తీవ్ర సంతాపం తెలియజేసింది. ఉత్తరాంధ్ర జన జీవిత సౌందర్యాన్ని, శ్రీకాకుళం ఆదివాసీ పోరాట పరిమళాన్ని కళా రంగంలో ఒడుపుగా పట్టుకున్న వాగ్గేయకారుడనీ, విప్లవ సాహిత్య సాంస్కృతికోద్యమాన్ని శిఖర స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన తొలి దశ పాత్ర చెరిగిపోనిదని విరసం అధ్యక్షులు అరసవెల్లి కృష్ణ, ఉపాధ్యక్షులు బాసిత్, సహాయ కార్యదర్శి రివేరా పేర్కొన్నారు. ఆయన తొలి దశ పాటలు, కళారూపాలు, ప్రదర్శనలు ప్రజా పోరాటాల్లో, విప్లవ సాహిత్య సాంస్కృతికోద్యమంలో శాశ్వతంగా ఉంటాయని, ఆయనకు విరసం నివాళులర్పిస్తోందని  చెప్పారు. విప్లవోద్యమం ఏ జీనవ క్షేత్రాల్లో కి విస్తరించిందో, ఏ ప్రజా సమూహాల్లోకి వెళ్లిందో ఆ ప్రజల జీవితాన్ని, ప్రత్యేక సమస్యలను, నిర్దిష్ట సాంస్కృతిక విశిష్టతలను పట్టుకొని ఉద్యమ వైఖరిని ప్రతిబింబిస్తూ వంగపండు వందలాది పాటలు రాశారని, ‘వంగపండు ఉరుములు’, ‘వంగపండు ఉప్పెన’ పేర్లతో ఆయన పాటల క్యాసెట్లు వేలాది గ్రామాలకు చేరాయని గుర్తు చేశారు. 

ప్రజా ఉద్యమాలకు తీరని లోటు
ప్రజా వాగ్గేయకారుడు వంగపండు ప్రసాద్‌ మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని అరుణోదయ సాంస్కృతిక సంస్థ అధ్యక్షురాలు విమలక్క అన్నారు. మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ..జన నాట్యమండలితో కలిసి తమ సంస్థ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు గుర్తు చేశారు. జనం దరువు పేరుతో తెలుగు రాష్ట్రాల్లో  వంగపండుతో కలిసి ప్రదర్శనలు ఇచ్చినట్లు  చెప్పారు. అలాగే భూ బాగోతం ప్రదర్శనల్లోనూ అరుణోదయ పాల్గొన్నదని, వంగపండు కూతురు ఉష కూడా అరుణోదయ సంస్థతో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. జీవితమంతా ప్రజలకు, ప్రజా ఉద్యమాలకు అంకితం చేసిన వంగపండు ప్రసాద్‌కు అరుణోదయ సంస్థ పక్షాన ఘన నివాళులర్పిస్తున్నట్లు  చెప్పారు. 

ప్రజల నుంచి ప్రజలకు ... 
ప్రజా కళలను వెలికి తీసి వాటిని పదునెక్కించి తిరిగి ప్రజల వద్దకు వెళ్లాడు వంగపండు. ప్రజలను చైతన్యవంతం చేశాడు. విప్లవోద్యమం వైపు నడిపించాడు. ఆయనకు నా నివాళి.  – ఏబీకే ప్రసాద్, సీనియర్‌ సంపాదకులు 

విప్లవోద్యమ గొంతుక... 
ప్రజాకవి, వాగ్గేయకారుడు, విప్లవోద్యమ గొంతుక అయిన వంగపండు ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన మరణం సాంస్కృతిక ఉద్యమానికి తీరని లోటు. – చిక్కుడు ప్రభాకర్,  తెలంగాణ ప్రజాస్వామిక వేదిక 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా