యాదాద్రి ప్రధానాలయం అత్యద్భుతం 

13 Apr, 2022 03:44 IST|Sakshi

దేశ స్వాతంత్య్రానంతరం రాతితో ఇంత పెద్ద గుడిని ఎక్కడా కట్టలేదు

హిందూ నాయకులు ఎందరున్నా చరిత్రలో చిరస్థాయిగా సీఎం కేసీఆర్‌ పేరు

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ప్రశంసలు

తొలిసారి యాదాద్రికి రాక.. స్వయంభూల దర్శనం.. ఆలయ శైలి పరిశీలన  

యాదగిరిగుట్ట: యాదాద్రిలో పునర్నిర్మితమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం అత్యద్భుత కట్టడమని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ కొనియాడారు. దేశ స్వాతంత్య్రానంతరం పూర్తిగా రాతితో ఇంత పెద్ద ఆలయం ఎక్కడా నిర్మితం కాలేదని చెప్పారు. మంగళవారం తొలిసారి యాదాద్రికి విచ్చేసిన ఆయన శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ మూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వరూపానందేంద్ర సరస్వతికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రధానాలయ పునర్నిర్మాణ శైలిని పరిశీలించారు. ఆ తర్వాత యాదాద్రి కొండ కింద తులసీ కాటేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్తరాధికారి స్మాత్మానందేంద్ర స్వామీజీతో కలసి మాట్లాడారు. 

తిరుమల అంత గొప్పగా కావాలి... 
దేశంలో హిందూ నాయకులమని చెప్పుకొనే వారు ఎందరున్నా యాదాద్రి ప్రధానాలయాన్ని పునర్నిర్మించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేరు మాత్రమే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. అహోబిలం, తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి దేవాలయం సహా మరెన్నో మండపాలను శ్రీకృష్ణదేవరాయల హయాంలో అభివృద్ధి చేయగా ఇప్పుడు ఇంత గొప్పగా ఈ దేవాలయాన్ని పునర్నిర్మించి సీఎం కేసీఆర్‌ ప్రజలకు అందించడం సంతోషకరమన్నారు.

యావత్‌ దేశంలో శక్తివంతమైన, అద్భుతమైన క్షేత్రంగా, తిరుమల తిరుపతి దేవస్థానం అంత గొప్పగా యాదాద్రి కావాలని మనసారా కోరుకుంటున్నానని చెప్పారు. విశాఖ శారదా పీఠానికి వచ్చే భక్తులు యాదాద్రి నిర్మాణం గురించి చెప్పడంతో చూసేందుకు వచ్చానని తెలిపారు. ఇటీవలే ప్రధానాలయ నిర్మాణం జరిగినందున ఇంకా లోటుపాట్లు ఉన్నాయని, అవి తొలగిపోవాలంటే ఆలయ అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసి బోర్డు సమావేశాలు నిర్వహించాలని సూచించారు. 

దేవాలయాలు ఎవరి సొత్తూ కాదు.. 
హిందూ దేవాలయాలు ఏ ఒక్కరి సొత్తు కావని... అవి సనాతన ధర్మాల సొత్తు అని స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. అలా ఎవరైనా అనుకుంటే పొరపాటని చెప్పారు. అలాగే ఏ ఆలయాన్నీ వైష్ణవులకో లేక శైవులకో పరిమితం చేయరాదన్నారు. వైష్ణవులు, శైవుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తిన రోజుల్లో జగద్గురు ఆదిశంకరాచార్యులు సకల దేవతలను కీర్తిస్తూ స్తోత్రా లు రాశారని స్వరూపానందేంద్ర గుర్తుచేశారు. ఆదిశంకరాచార్యులు రాసిన ‘ఉగ్రం వీరం మహా విష్ణువు జ్వలంతం సర్వతో ముఖం’ స్తోత్రాన్ని యాదాద్రిలోనూ పఠిస్తున్నారన్నారు. 

మరిన్ని వార్తలు