యువతి కిడ్నాప్‌ కేసు.. రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు

13 Dec, 2022 17:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడ యువతి వైశాలి కిడ్నాప్‌ కేసులో పోలీసులు తాజాగా రిమాండ్‌ రిపోర్టును విడుదల చేశారు. ఈ రిపోర్టులో పలు కీలక అంశాలు వెలుగు చూశాయి. 

సాక్షి చేతికి అందిన వైశాలి కేసు రిమాండ్‌ రిపోర్టులో.. ‘గతేడాది బొంగులూరులోని ఆర్డీ స్పోర్ట్స్‌ అకాడమీలో ఇద్దరి మధ్య​ పరిచయం. వైశాలి మొబైల్‌ నెంబర్‌ తీసుకున్న నవీన్‌ రెడ్డి తరుచూ ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లు చేశాడు. పరిచయాన్ని అ‍డ్డుగా పెట్టుకొని వైశాలితో కలిసి ఫోటోలు తీసుకున్నాడు. మధ్యలో పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. దీంతో వైశాలి తల్లిదండ్రులు ఒప్పుకుంటే వివాహం చేసుకుంటానని చెప్పింది. వైశాలి తల్లిదండ్రులను ఒప్పించేందుకు ప్రయత్నించాడు. వారు పెళ్లికి అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకున్నాడు.


వైశాలి ఇంటి వద్ద దాడికి పాల్పడుతున్న నవీన్‌ గ్యాంగ్‌

వైశాలి పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ తెరిచి ఇద్దరు దిగిన ఫోటోలను వైరల్‌ చేశాడు. అయిదు నెలల కిత్రం వైశాలి ఇంటి ముందు స్థలం లీజుకు తీసుకుని షెడ్డు వేశాడు. ఆగస్టు 31న గణేష్‌ నిమజ్జనం సందర్భంగా న్యూసెన్స్‌ చేశాడు. వైశాలి ఫిర్యాదుతో నవీన్‌ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈనెల 9న వైశాలికి నిశ్చితార్థం జరుగుతున్నట్లు తెలుసుకున్నాడు. యువతిని కిడ్నాప్‌ చేసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. 


దాడిలో ధ్వంసమైన ఇంట్లోని సామాగ్రి

వారం ముందు నుంచే వైశాలి కిడ్నాప్‌కు ప్లాన్‌ చేశాడు. దీనికోసం తన అనుచరులతో పాటు మిస్టర్ టీ స్టాళ్లలో పనిచేసే సిబ్బందిని ఉపయోగించుకున్నాడు. కిడ్నాప్‌లో ఆరుగురు కీలకంగా వ్యవహరించారు. నవీన్‌రెడ్డి, రుమాన్‌, చందూ, సిద్ధూ, సాయినాథ్‌, భాను ప్రకాష్‌తో కలిసి వైశాలి కిడ్నాప్‌కు ప్లాన్‌ వేశారు. వైశాలితోపాటు చుట్టుపక్కల వారిని భయభ్రాంతులకు గురిచేసేలా పథకం రచించారు.
చదవండి: ముగిసిన మైత్రీ మూవీ మేకర్స్‌ ఐటీ రైడ్స్‌​, కీలక పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం

డిసెంబర్‌ 9వ మధ్యాహ్నం 12 గంటల సమయంలో 40 మందితో కలిసి వైశాలిని కిడ్నాప్‌ చేశాడు. ఇంటి వద్ద పార్క్‌ చేసిన అయిదు కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. యువతి ఇంటిపై దాడి చేసి వస్తువులను సీసీటీవీ కెమెరాలను నాశనం చేశారు. డీవీఆర్‌లు ఎత్తుకెళ్లారు. వైశాలిని కిడ్నాప్‌ చేసి కారులో నల్గొండ వైపు తీసుకెళ్లారు.తమ కోసం పోలీసులు వెతుకుతున్నారనే విషయాన్ని నవీన్‌ రెడ్డి సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకొని ఫోన్లు స్విచ్ఛాఫ్‌ పెట్టుకున్నారు. అనంతరం నల్గొండ వద్ద అతని స్నేహితులు కారు నుంచి దిగి పారిపోయారు.

నవీన్‌ మరో స్నేహితుడు రుమాన్‌ వోల్పో కారులో వైశాలిని హైదరాబాద్‌ తీసుకొచ్చారు. కిడ్నాప్‌ జరిగిన సాయంత్రానికి తాను క్షేమంగా ఉన్నట్లు వైశాలి.. తండ్రికి కాల్‌ చేసి చెప్పింది. రాత్రి 8.37 నిమిషాలకు మన్నెగూడలో ఉన్నట్లు చెప్పడంతో అక్కడికి వెళ్లి వైశాలిని ఇంటికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసున నమోదు చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో 32 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు నవీన్‌ రెడ్డి, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నట్లు రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

మరోవైపు  వైశాలి కిడ్నాప్‌ కేసులో నిందితులను కస్టడీ కోరుతూ ఇబ్రహీంపట్నం కోర్టులో పిటిషన్‌ దాఖలు అయ్యింది. నిందితులను 5 రోజుల కస్టడీ కోరుతూ ఆదిభట్ల పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఏ3 భాను ప్రకాశ్‌, ఏ4 సాయినాథ్‌, ఏ8 ప్రసాద్‌, ఏ9 హరి, ఏ30 విశ్వేశ్వర్‌ను కస్టడీ కోరుతూ పిటిషన్‌ దాఖలైంది. 
 

మరిన్ని వార్తలు