ఇంజనీరింగ్‌ విద్యార్థులకు వీఎల్‌ఎస్‌ఐ శిక్షణ

26 Jul, 2021 00:51 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

టీ–శాట్‌ ద్వారా నేటి నుంచి మొదటి విడతగా 15 రోజులు ప్రసారాలు 

ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: ఇప్పటివరకు ప్రాథమిక, ఉన్నత   పాఠశాల, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా పాఠ్యాంశాల ప్రసారాలు అందించిన టీ–శాట్‌ ఇక     ఇంజనీరింగ్‌ విద్యార్థులకు కూడా ప్రత్యేక శిక్షణా ప్రసారాలను అందుబాటులోకి తేనుంది. టాస్క్, పీవీసీ (ఫోటానిక్స్‌ వాలి కార్పొరేషన్‌), వేద ఐఐటీ సంయుక్తంగా      వెరీ లార్జ్‌స్కేల్‌ ఇంటిగ్రేషన్‌ (వీఎల్‌ఎస్‌ఐ) ఎలక్ట్రానిక్‌ సెమీ కండక్టర్లపై టీ–శాట్‌ చానళ్ల ద్వారా ఈనెల 26 నుంచి పాఠాలను బోధించనున్నట్టు ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ ఆదివారం ఒక ప్రకటనలో   వెల్లడించారు. టీ–శాట్‌ ద్వారా అందించే ఎక్స్‌పోజర్‌ ట్రైనింగ్‌తో ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

పరిశ్రమల పురోగతి, మెరుగైన నైపుణ్యం, ఉద్యోగాల కల్పన, వివిధ సంస్థల సాంకేతికత తదితర అంశాలపై ప్రసారమయ్యే ప్రత్యేక బోధనను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

ఉదయం 8:15 గంటల నుంచి 
నేటి ఉదయం 8:15 గంటల నుంచి 10:30 గంటల వరకు టీ–శాట్‌ నిపుణ చానల్‌లో ఈ ప్రత్యేక శిక్షణ ప్రసారాలు ఉంటాయని టీ–శాట్‌ నెట్‌వర్క్‌ చానళ్ల సీఈవో ఆర్‌.శైలేశ్‌రెడ్డి తెలిపారు. 15 రోజులపాటు 30 గంటలు ఈ ప్రసారాలు కొనసాగుతాయని, సాయంత్రం 7 గంటల నుంచి 9 వరకు పునఃప్రసారమవుతాయని వెల్లడించారు. టీ–శాట్‌ నిపుణ చానల్‌తోపాటు టీశాట్‌ ఫేస్‌బుక్, యూట్యూబ్‌ లైవ్‌లోనూ  ఈ ప్రసారాలు అందుబాటులో ఉంటాయి. సందేహాల నివృత్తి కోసం 040–23540326, 23540726, టోల్‌ఫ్రీ నంబర్‌ 18004254039లను సంప్రదించాలని శైలేశ్‌రెడ్డి చెప్పారు.   

మరిన్ని వార్తలు