ఆ 2 గ్రామాల్లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌

22 Jul, 2021 04:41 IST|Sakshi

జగిత్యాల జిల్లా ఎండపల్లి, మద్దుట్లలో కఠినంగా అమలు 

జగిత్యాల: జగిత్యాల జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండడంతో గ్రామాలు మరోసారి స్వచ్ఛంద లాక్‌డౌన్‌ వైపు కదులుతున్నాయి. వెల్గటూర్‌ మండలం ఎండపల్లి (జనాభా 4,200) గ్రామంలో జూలై 18 నుంచి ఆగస్టు 1 వరకు లాక్‌డౌన్‌ విధించారు. తాజాగా మల్యాల మండలం మద్దుట్ల (జనాభా 2,000)లోనూ లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. జిల్లాలో ఇటీవల రోజూ వందకుపైనే కేసులు నమోదవుతున్నాయి.

మద్దుట్లలో రెండ్రోజుల్లో 32, ఎండపల్లిలో 12 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రెండు గ్రామాల సర్పంచ్‌లు గ్రామాల్లో లాక్‌డౌన్‌ విధిస్తూ తీర్మానాలు చేశారు. మద్దుట్లలో ఉదయం 6 నుంచి 8 వరకు, సాయంత్రం 7 నుంచి 8 వరకు సడలింపులనిచ్చారు. ఇతర సమయాల్లో బయటకు వెళ్తే రూ.5 వేల జరిమానా విధిస్తున్నారు. ఎండపల్లిలో ఉదయం 7 నుంచి 9 వరకు మాత్రమే సడలింపు అమల్లో ఉంది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.2 వేల జరిమానా విధిస్తున్నారు. మాస్క్‌ ధరించకుండా బయట తిరిగితే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నారు.   

మరిన్ని వార్తలు