సీఎం ఇచ్చిన హామీ నెరవేర్చాలి

18 Aug, 2022 01:27 IST|Sakshi
సదస్సులో మాట్లాడుతున్న జేఏసీ చైర్మన్‌ రాజయ్య  

వీఆర్‌ఏల జేఏసీ డిమాండ్‌ 

ఈ నెల 18 నుంచి మూడ్రోజులపాటు వీఆర్‌ఏల పే స్కేల్‌ జాతర, భారీ ప్రదర్శనలు 

సుందరయ్య విజ్ఞాన కేంద్రం(హైదరాబాద్‌): అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని వీఆర్‌ఏ జేఏసీ చైర్మన్‌ ఎం.రాజయ్య డిమాండ్‌ చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం జరిగిన వీఆర్‌ఏ జేఏసీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ..వీఆర్‌ఏలంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారమేనని, తమపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులు రోడ్డున పడకుండా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని విజ్ఞప్తి చేశారు.

ఈ నెల 18, 19, 20వ తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా 23 వేల వీఆర్‌ఏలు అన్ని జిల్లా కేంద్రాల్లో పే స్కేల్‌ జాతర (ధూం ధాం), భారీ ప్రదర్శనలు, ర్యాలీలు, బోనాలు, బతుకమ్మ తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 22న మండల కేంద్రాల్లో ఉద్యోగ సంఘాలు, సామాజిక సంఘాలు, కార్మిక సంఘాలతో కలిసి మానవహారాలు చేపడుతున్నట్లు చెప్పారు. సమావేశంలో జేఏసీ కో కన్వీనర్లు వై.వెంకటేశ్‌ యాదవ్, వంగూరి రాములు, సెక్రటరీ జనరల్‌ ఎస్‌కే దాదేమియా, కన్వీనర్‌ సాయన్న, ఎస్‌కె.రఫీ, ఎన్‌.గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు