వీఆర్‌ఏలపై లాఠీచార్జ్‌.. ఉద్రిక్తత 

12 Oct, 2022 01:11 IST|Sakshi
ఆందోళన చేస్తున్న వీఆర్‌ఏలు. లాక్కెళుతున్న పోలీసులు 

వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలింపు...రాత్రి వరకు స్టేషన్లలోనే..

సాక్షి, హైదరాబాద్‌: డిమాండ్ల సాధన కోసం 79 రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ నిరసన వ్యక్తం చేసేందుకు హైదరాబాద్‌కు తరలి వచ్చిన వీఆర్‌ఏలపై పోలీ సులు లాఠీలు ఝళిపించారు. రాష్ట్రం నలుమూ లల నుంచి వీఆర్‌ఏలు ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ దగ్గర నిరసన తెలిపేందుకు మంగళవారం పెద్ద ఎత్తున తరలి వస్తుండగా...అనుమతి లేదంటూ  పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు.

కొంత మంది వీఆర్‌ఏలు పోలీసులను దాటుకుని వెళ్లి ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ధర్నాకు దిగారు. భారీగా ట్రాఫిక్‌ జాం కావడంతో లాఠీచార్జ్‌ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది, ఎట్టకేలకు నిరసనకారు లను అరెస్టు చేసి నగరంలోని వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. మరో వైపు సుందరయ్య విజ్ఞానకేంద్రం వద్ద బతుకమ్మ ఆడుతూ నిరసన వ్యక్తం చేసేందుకు ప్రయత్నించిన వీఆర్‌ఏలను అదుపులోకి తీసుకోని పోలీసు స్టేషన్లకు తరలించారు. కాగా అదుపులోకి తీసుకున్న మహిళా వీఆర్‌ఏలను సైతం రాత్రి వరకు పోలీసులు విడుదల చేయలేదు. పలు పోలీస్‌స్టేషన్లు తిప్పి చివరకు ముషీరాబాద్‌కు తరలించారు.

నిర్ధాక్షిణ్యంగా  వ్యవహరించారు
మహిళా వీఆర్‌ఏలు శాంతియుతంగా బతుకమ్మ ఆటతో నిరసన వ్యక్తం చేసేందుకు వస్తే పోలీసులు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడాన్ని వీఆర్‌ఓ జేఏసీ కో కన్వీనర్‌ ఎం.గోవిందు తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర వీఆర్‌ఏల జేఏసీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం దురదృష్టకరమన్నారు. రాత్రి వరకు మహిళా వీఆర్‌ఏలను వివిధ పోలీస్‌ స్టేషన్లో ఉంచడం విచారకరమని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు