సగం ఆస్తి పన్ను మాఫీ

16 Nov, 2020 03:13 IST|Sakshi

2020–21 సంవత్సర ఆస్తిపన్నుల్లో 50% మాఫీ..

ఇప్పటికే చెల్లించినా వచ్చే ఏడాది సర్దుబాటు

ఇంకా వరద సహాయం అందని వారి నుంచి మీ–సేవ ద్వారా దరఖాస్తుల స్వీకరణ

గ్రేటర్‌ హైదరాబాద్‌ పారిశుధ్య సిబ్బంది వేతనాలు రూ.3 వేలు పెంపు

దీపావళి కానుకగా ప్రకటించిన మంత్రి కే తారకరామారావు

గ్రేటర్‌ ఎన్నికలకు ఫిబ్రవరి 10 వరకు టైం ఉందన్న మంత్రి

సాక్షి, హైదరాబాద్‌ : గృహ యజమానులు, వరద బాధితులు, జీహెచ్‌ఎంసీ పారిశుధ్య సిబ్బందికి పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు దీపావళి రోజు పండుగ కానుకలు ప్రకటించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో రూ.15 వేలలోపు వార్షిక ఆస్తిపన్ను ఉన్న ఇళ్ల యజమానులకు 2020–21 సంవత్సరానికి సంబంధించి 50 శాతం ఆస్తిపన్ను మాఫీ చేస్తున్నట్టు చెప్పారు. అలాగే, రాష్ట్రంలోని మిగిలిన 140 మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో సైతం రూ.10 వేలలోపు ఆస్తిపన్ను ఉన్న వారికీ ఆస్తిపన్నులో 50 శాతం మాఫీ చేస్తున్నామని తెలిపారు.

ఈ నిర్ణయం ద్వారా జీహెచ్‌ఎంసీ పరిధిలో 13.72 లక్షల ఇళ్ల యజమానులకు రూ.196.48 కోట్లు, ఇతర మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో 31.40 లక్షల ఇళ్ల యజమానులకు రూ.326.48 కోట్ల రాయితీ లభిస్తుందన్నారు. ఇప్పటికే 2020–21కి సంబంధించిన ఆస్తిపన్నులను చెల్లించిన వారికి సైతం ఈ మాఫీ వర్తిస్తుందని, వచ్చే ఏడాది (2021–22)కి సంబంధించిన వీరి ఆస్తిపన్నులను ఆ మేరకు సర్దుబాటు చేస్తామన్నారు. రాష్ట్ర మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో మంత్రి కేటీఆర్‌ శనివారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో సమావేశమయ్యారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.

కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, దీనికి తోడు ఇటీవల భారీ వర్షాలు, వరదలతో జీహెచ్‌ఎంసీతో పాటు చుట్టుపక్కలున్న 15 పురపాలికల ప్రజలు సర్వం కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్నారని, వారి కోసం ఇంకేమైనా చేస్తే బాగుంటుందని గత శుక్రవారం జరి గిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోమంత్రులందరూ సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారని కేటీఆర్‌ తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో శనివారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో సమావేశమై ఈ మేరకు ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకున్నామన్నారు. కాగా, మంత్రి కేటీఆర్‌ ప్రకటన మేరకు 50 శాతం ఆస్తిపన్నును మాఫీచేస్తూ అదేరోజు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. మాఫీచేసిన ఆస్తిపన్నును సంబంధిత పురపాలికలకు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మీ–సేవ ద్వారా ‘వరద సాయం’
ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో హైదరాబాద్‌ నగరం, దాని చుట్టుపక్కల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మోకాల్లోతు నీళ్లున్న ముంపు కాలనీల్లో పర్యటించి ప్రజలకు అండగా నిలిచారని, ఎవరూ అడగక ముందే మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించి ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించడానికి రూ.530 కోట్లను విడుదల చేశారని గుర్తుచేశారు. శనివారం నాటికి 4,75,871 కుటుంబాలకు రూ.475 కోట్ల సహాయం పంపిణీ చేశామన్నారు.

ఇంకా ప్రభుత్వ సహాయం అందని బాధిత కుటుంబాలు మీ–సేవ కేంద్రాల ద్వారా సహాయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తులపై విచారణ జరిపి అర్హుల బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సహాయాన్ని జమ చేస్తామన్నారు. పేరు, ఇంటి నంబర్, ప్రాంతం, మొబైల్, ఆధార్‌ నంబర్, పిన్‌కోడ్, బ్యాంకు ఖాతా నంబర్‌ వివరాలను దరఖాస్తుతో పాటు అందజేస్తే సరిపోతుందన్నారు. ఈ మేరకు మీ–సేవ కేంద్రాల ద్వారా వరద బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, అర్హుల బ్యాంకు ఖాతాల్లో సహాయాన్ని జమ చేయాలని ఆదేశిస్తూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ ప్రత్యేక మెమో జారీచేశారు.

గ్రేటర్‌ పారిశుద్ధ్య సిబ్బంది వేతనాలు పెంపు
జీహెచ్‌ఎంసీ పారిశుధ్య, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది వేతనాలను రూ.14 వేల నుంచి రూ.17 వేలకు, శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు/ఎంటమాలజీ ఫీల్డ్‌ అసిస్టెంట్ల వేతనాలను రూ.14,500 నుంచి రూ.17,500కు పెంచుతున్నట్టు మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. దీపావళి కానుకగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కరోనా వచ్చినా పారిశుధ్య, వైద్య సిబ్బంది ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజలకు సేవలందిస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఈ మేరకు వేతనాలను పెంచుతూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌ కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. అదనపు ఈపీఎఫ్, ఈఎస్‌ఐ కలిపి రూ.3 వేల పెంపు వర్తిస్తుందన్నారు.

ఫిబ్రవరి 10 వరకు టైం ఉంది..
‘తొందరేం ఉంది.. ఫిబ్రవరి 10 వరకు మాకు టైం ఉంది.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం.. మీరెందుకు తొందర పడుతున్నారు’అని మంత్రి కేటీఆర్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణపై విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితాలను ప్రకటించడంతో ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశాలున్నాయని ఊహాగానాలున్న సమయంలో మంత్రి కేటీఆర్‌ ఇలా పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. ముందే అనుకున్నట్టు ప్రస్తుత నవంబర్‌లోషెడ్యూల్‌ జారీచేస్తారా? లేక కొంత కాలం వేచిచూస్తారా? అన్న అంశంపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  

>
మరిన్ని వార్తలు