విషాదం: తల్లిదండ్రుల ఇంట్లో నిద్ర.. ఎంగేజ్‌మెంట్‌కు కొన్ని గంటలముందే..

24 Jul, 2022 17:07 IST|Sakshi
ఘటనా స్థలం వద్ద మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యేలు

వరంగల్‌/ఎంజీఎం: ఎంగేజ్‌మెంట్‌కు ఆహ్వానించేందుకు వచ్చిన ఓ యువకుడు పాత భవనం గోడ కూలడంతో మృత్యువాతపడ్డాడు. ఇదే ఘటనలో మరో వ్యక్తి సైతం ప్రాణాలు కోల్పోగా, మహిళకు తీవ్రగాయాలయ్యాయి. వరంగల్‌ మండిబజార్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇంతేజార్‌గంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ డి.మల్లేష్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం రేబల్లె గ్రామానికి చెందిన తిప్పారపు పైడి (55), ఖమ్మం జిల్లా కేంద్రంలోని వైఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన సమ్మక్క అలియాస్‌ సలీమా మండిబజార్‌లో నిర్మిస్తున్న భవనం వద్ద వాచ్‌మెన్‌గా చేరారు. ఈ క్రమంలో పక్కనే తడకలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. సలీమా కొడుకు ఫిరోజ్‌(24) తొర్రూరులో నివాసం ఉంటుండగా, రంగశాయిపేటకు చెందిన యువతితో పెళ్లి కుదిరింది. ఈ నెల 24న(ఆదివారం) ఎంగేజ్‌మెంట్‌ ఉండడంతో తల్లి సలీమాను ఆహ్వానించేందుకు శుక్రవారం అన్నావదినతో కలిసి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో ఖమ్మం నుంచి వరంగల్‌కు వచ్చాడు.
చదవండి👉క్లౌడ్ బరస్ట్, పోలవరం ఎత్తు టీఆర్‌ఎస్‌కు కొత్త ఆయుధాలా!

ఫిరోజ్‌ అన్నావదిన రంగశాయిపేటలోని బంధువుల ఇంటికి వెళ్లగా, ఫిరోజ్‌ తన తల్లి సలీమా వద్దకు వెళ్లాడు. రాత్రి పైడి, సలీమాతోనే నిద్రించాడు. ఈ క్రమంలో పక్కనే శిథిలావస్థలో ఉన్న మూడు పోర్షన్ల పాత భవనం గోడ కూలి నిద్రిస్తున్న ముగ్గురిపై పడింది. ఈ ఘటనలో పైడి, ఫిరోజ్‌ అక్కడికక్కడే మృతి చెందగా, సలీమాకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.

సమాచారం అందుకున్న ఏసీపీ కలకోట గిరికుమార్, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. బాధితురాలు సమ్మక్క అలియాస్‌ సలీమా ఫిర్యాదు మేరకు శిథిలభవనం యజమానులు జిజియ భాయి, గుండా సంతోష్‌కుమార్, కుస్రు ఫయిజల్‌లతోపాటు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్న కందకట్ల రాంప్రసాద్‌పై కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ మల్లేష్‌ తెలిపారు. 
చదవండి👉అంగట్లో జూనియర్‌ లైన్‌మన్‌ పోస్టులు రూ.5 లక్షలకు బేరం!

మంత్రి, ఎమ్మెల్యేల పరామర్శ
ఎంజీఎం మార్చురీలో ఉన్న పైడి, ఫిరోజ్‌ మృతదేహాలను మంత్రి దయాకరరావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వర్ధన్నపేట, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్‌ పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. అలాగే, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఎంజీఎంలో మృతదేహాలను సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. రూ.20లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 
చదవండి👉పాలేరు వరద మధ్యలో బిక్కుబిక్కుమంటూ 21 మంది కూలీలు!

మరిన్ని వార్తలు