అవినీతిలో ఆమెకు ఆమే సాటి

12 Dec, 2020 09:31 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హన్మకొండ : ఆర్టీసీలో అవినీతికి పాల్పడంలో ఆమెదీ అందె వేసిన చేయి. అధికారులను ప్రసన్నం చేసుకోవడంలోనూ దిట్ట! ఇదీ అసిస్టెంట్‌ మేనేజర్‌(మెకానిక్‌) తీరుపై ఆర్టీసీ ఉద్యోగ వర్గాల్లో సాగుతున్న చర్చ. ఆమె ఉద్యోగంలో చేరిన నాటి నుంచి కొద్ది రోజులు మినహా మొత్తం జిల్లా కేంద్రంలోని డిపోలోనే విధులు నిర్వర్తించింది. వరంగల్‌–2 డిపోలో పనిచేసిన కాలంలో ఓ డ్రైవర్‌ నడిపినప్పుడు బస్సు కొద్దిగా డ్యామేజీ అయితే రూ.10 వేలు జరిమానా విధించడమే కాకుండా ఆ డబ్బును సొంతానికి వాడుకుంది. దీనిపై అప్పట్లో ‘సాక్షి’లో కథనం ప్రచురితం కాగా స్పందించిన అధికారులు నర్సంపేట డిపోకు బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. ఆర్టీసీలో రూపాయి అవినీతకి పాల్పడినట్లు తేలితే కండక్టర్లు, ఇతర చిన్న ఉద్యోగులను వెంటనే సస్పెండ్‌ లేదా రిమూవల్‌ చేయడమో ఆనవాయితీ. కానీ ఈ అధికారి రూ.10 వేలు కాజేసిన అధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా కేవలం బదిలీతో సరిపెట్టారు. ఫలితంగా ఆమె ఇప్పుడు ఏకంగా రూ.3,03.823కు ఎసరు పెట్టింది. ఇంటికి పనికి వచ్చే విడిభాగాలను డిపో నుంచి తీసుకెళ్లడంతో పాటు సంస్థ ఉద్యోగులను సొంత పనులకు వాడుకున్నారనే విమర్శలు కూడా ఆమెపై ఉన్నాయి.

అంతా నేనే చూసుకుంటా...
ఆర్టీసీ ఉద్యోగులు గతేడాది దీర్ఘకాలిక సమ్మె చేపట్టగా సదరు ఉద్యోగికి కలిసి వచ్చింది. ఇదే అదునుగా అక్రమాలు, అవకతవకలకు పాల్పడినట్లు సమాచారం. అక్టోబర్‌లో సమ్మె ప్రారంభం కాగా సెప్టెంబర్‌లో మెకానికల్‌ విభాగంలో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిన ఐదుగురిని నియమించారు. అయితే, వీరు ఎప్పుడూ విధులకు హాజరుకానున్న హాజరు నమోదు, వేతనాల బిల్లు సిద్ధం చేయగా, రెండింటికీ పొంతన కుదరకపోవడంతో అధికారులు ఇటీవల కూపీ లాగగా వాస్తవం బయటపడింది. వరంగల్‌ – 1 డిపో మేనేజర్‌ అస్వస్థతకు గురై సెలవులో వెళ్లగా జూలై, ఆగస్టులో అసిస్టెంట్‌ మేనేజర్‌(మెకానిక్‌) అయిన మహిళా అధికారికి ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. అప్పటికే ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాల బిల్లులు సిద్ధమైనా డీఎంకు అనుమానం రావడంతో పక్కన పెట్టారు. ఆ తర్వాత ఆయన సెలవులో వెళ్లడంతో ఇన్‌చార్జ్‌గా నియమితులైన మహిళా ధికారి పక్కకు పడేసిన బిల్లులు తీసి వరంగల్‌ రీజినల్‌ మేనేజర్‌ కార్యాలయానికి పంపారు. అక్కడి అకౌంట్స్‌ సెక్షన్‌ వారు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ లేదని అభ్యంతరం చెబుతూ వెనక్కి పంపించారు.

దీంతో సమ్మె కారణంగా ఈఎస్‌ఐ, పీఎఫ్‌ చెల్లించలేదని సమాధానం రాసి తిరిగి బిల్లులు ఆర్‌ఎం కార్యాలయానికి పంపించగా, రూ.3,03,823 ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీకి మంజూరు చేశారు. కానీ ఉద్యోగుల నియామకం కాగితాలపైనే జరిగినందున ఆ నిధులను తనకు ఇవ్వాలని సూచించడంతో ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ బాధ్యులు ఆమె ఖాతాలో రూ.2.50 లక్షలు జమ చేశారు. ఈ వ్యవహారమంతా విజిలెన్స్‌ విచారణలో బయటపడింది. ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీని తనకు మెకానికల్‌ సెక్షన్‌లో ఉద్యోగులు కావాలని కోరితే లేరని చెప్పినా వినకుండా ఒప్పందం చేయించినట్లు సమాచారం. ఆ తర్వాత కాగితాలపైనే ఉద్యోగుల నియామకం చేపట్టి వేతనాల బిల్లులు చేయించి డబ్బు స్వాహా చేసినట్లు తేలింది. దీనిపై విజిలెన్స్‌ విచారణ కొనసాగుతుండగా, సంబంధిత డిపో మేనేజర్‌ శాఖాపరమైన విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు సమాచారం. ఇక విజిలెన్స్‌ అధికారులు సైతం వచ్చే మంగళవారం కరీనంగర్‌లో జరిగే విచారణకు హాజరుకావాలని సదరు మహిళా అధి కారితో పాటు సెక్షన్‌ ఉద్యోగులకు సమాచారం ఇచ్చారు.

బాధ్యులపై చర్యలు 
ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల పేరిట రూ.3లక్షలకు పైగా స్వాహా చేసిన విషయమై ఆర్‌ఎం అంచూరి శ్రీధర్‌ స్పందిచారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోందని తెలిపారు. విచారణ అనంతరం తప్పు చేసిన వారు ఎవరైనా చర్యలు ఉంటాయని వెల్లడించారు.  

మరిన్ని వార్తలు