ఇటుక అండగా.. ఇల్లు చల్లన! కూల్‌ బ్రిక్స్‌ తయారీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

14 Mar, 2022 13:59 IST|Sakshi

పేటెంట్‌ అందజేసిన భారత ప్రభుత్వం

వేసవిని జయించేందుకు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ఎవరి స్థోమతకు తగ్గట్టు వాళ్లు పరికరాల్ని అమర్చుకుంటున్నారు. ఇవేమీ అవసరం లేకుండా.. ఇంట్లో వేడిని తగ్గించే ప్రయత్నం చేశారు నిట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌. ఇంటి నిర్మాణం కోసం కూల్‌ బ్రిక్స్‌ను తయారు చేశారు. వీటి వాడకం వల్ల ఏడాదంతా ఇంటి లోపల చల్లని వాతావరణం ఉంటుంది. ఈ బ్రిక్స్‌ తయారీకి ఇటీవలే డాక్టర్‌ శశిరాం భారత ప్రభుత్వం నుంచి పేటెంట్‌ కూడా పొందారు. ఆ చల్లని ఇటుకల విశేషాలేంటంటే.. 
 – కాజీపేట అర్బన్‌ 

వ్యర్థానికో అర్థం చూపాలనుకున్నారు. డంపింగ్‌ యార్డులో పడేసిన బూడిదకు ఓ ఆకృతిని చ్చారు డాక్టర్‌ శశిరాం. ఆమె మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో 2017లో ‘కో ఫైర్డ్‌ బ్లెండెడ్‌ యాష్‌ బ్రిక్స్‌’ అనే అంశంపై పరిశోధన చేశారు. ఆ సమయంలో వివిధ రకాల బాయిలర్లను వేడి చేసేందుకు బయోమాస్, కోల్‌(బొగ్గు)ను ఉపయోగించడం గమనించారు. బొగ్గు వేడి చేసిన అనంతరం బూడిదగా మారిపోవడం, డంపింగ్‌ యార్డ్‌లో పడవేయడం చూశారు. ఆ వ్యర్థాలను ఉపయోగించి వేడిని తట్టుకునే ఇంటి నిర్మాణానికి ఇటుకలను రూపొందించాలనుకున్నారు. బొగ్గు, బయోగ్యాస్‌ బూడిద, సిమెంట్, ఇసుక, నీటిని ఉపయోగించి కూల్‌ బ్రిక్స్‌ తయారీకి ఉపక్రమించారు డాక్టర్‌ శశిరాం.

చల్లగా ఎందుకంటే..
ఇంటి నిర్మాణంలో ఉపయోగించే ఎరుపు రంగు మట్టి ఇటుకలను బట్టీల్లో వేడి కాలుస్తారు. సిమెంట్‌ ఇటుకలను హీటింగ్‌ చేస్తారు. దీంతో ఇటుకలు వేడిని స్వీకరించి వేడిని విడుదల చేస్తాయి. శశిరాం తయారు చేసిన కూల్‌ బ్రిక్స్‌ సాంచా(మోల్డింగ్‌)లో బొగ్గు, బయోగ్యాస్‌ బూడిద, ఇసుక, సిమెంట్‌ను ఒక మిశ్రమంగా ఏర్పాటు చేసి ఇటుక ఆకారాన్ని తీసుకొస్తారు. వారంపాటు నీటిని ఇటుకలపై చల్ల డం ద్వారా ఇటుకలు గట్టిపడ్తాయి. ఇటుకలను బట్టీల్లో కాల్చని కారణంగా ఇవి పూర్తి చల్లదనాన్ని స్తాయి. మట్టి, సిమెంట్‌ ఇటుకలు 1.5 మెట్రిక్‌ కెల్విన్‌వాట్‌ ఉష్ణోగ్రతను కలిగి ఉండగా.. కూల్‌ బ్రిక్స్‌ కేవలం 0.5 ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. కూల్‌బ్రిక్స్‌ 230 ఎంఎం పొడవు, 100 ఎంఎం వెడల్పు ఉంటాయి. 90 ఎంఎం ఎత్తుతో 3.3 కేజీల బరువుతో ఎరుపు మట్టి, సిమెంట్‌ ఇటుకకు దీటుగా ధృడంగా ఉంటాయి.

నవంబర్‌లో పేటెంట్‌..
డాక్టర్‌ శశిరాం 2017లో పీహెచ్‌డీ పరిశోధనను ప్రారంభించి 2019లో పేటెంట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. భారత ప్రభుత్వం 2021 నవంబర్‌లో పేటెంట్‌ను అందజేసింది. కాగా.. త్వరలోనే ఈ ఇటుకలు అందుబాటులోకి రానున్నాయి. 

కూల్‌ ఓరుగల్లు కోసం..
భవిష్యత్‌లో ఓరుగల్లు ఉష్ణోగ్రతకు అనుగుణంగా బిల్డింగ్స్‌ డిజైన్స్, మోడల్స్‌ రూపొందిస్తున్నా. కూల్‌ ఓరుగల్లుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా. 
– శశిరాం, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, నిట్‌

కూల్‌ బ్రిక్స్‌ తయారు చేస్తున్న శశిరాం 

మరిన్ని వార్తలు