వాటిని కట్టకున్నా.. నిధులు కొట్టేశారు

8 Jul, 2021 22:23 IST|Sakshi

మరుగుదొడ్ల నిర్మాణం లేకున్నా బిల్లులు

కార్యదర్శిపైనే ఆరోపణలు

 ఫోర్జరీ అంటూ సర్పంచ్, ఉపసర్పంచ్‌ల ఫిర్యాదు 

సాక్షి, వరంగల్‌: ఖానాపురం మండలంలోని మంగళవారంపేట గ్రామ పంచాయతీ పరిధిలో అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడని కార్యదర్శిని సస్పెండ్‌ చేశారు. పూర్తి విచారణ, వివరాలు తెలియకముందే అతడికి ఆత్మకూరు మండలంలో పోస్టింగ్‌ సైతం ఇచ్చేశారు. ఈ క్రమంలో మరోసారి గ్రామంలో నిధుల గోల్‌మాల్‌పై దుమారం రేగింది. మరుగుదొడ్లు నిర్మించుకోకుండానే బిల్లులు కాజేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై ఫోర్జరీ సంతకాలతో బిల్లులు కాజేసిన కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని పంచాయతీ పాలకులు అధికారులకు ఫిర్యాదు చేశారు.

నిర్మించకున్నా బిల్లులు..
గతంలో మంగళవారిపేట పంచాయతీ కార్యదర్శిగా శ్రీధర్‌ పని చేశారు. అయితే, పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశాడనే ఆరోపణలతో మే 4న ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్‌ చేశారు. ఇదే క్రమంలో పంచాయతీ పరిధిలో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టకుండానే బిల్లులు కొట్టేశారనే ఆరోపణలు గత రెండు రోజులుగా వెల్లువెత్తుతున్నాయి. మరుగుదొడ్ల నిర్మాణాలు చేయకున్నా బిల్లులు ఎలా సాధ్యమయ్యాయని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తుండగా.. తమకేమీ తెలియకుండానే ఇలా జరిగిందంటూ ప్రజాప్రతినిధులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇదిలా ఉంటే గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 50 మరుగుదొడ్లు మంజూరు కాగా, ఇందులో అసలు నిర్మించుకోని వారికి బిల్లులు వచ్చాయి. నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి మాత్రం సగం బిల్లులు, కొంత మందికి రెండుసార్లు బిల్లులు మంజూరయ్యాయి. పూర్తిగా కట్టుకున్న వారిలో కొంత మందికి మాత్రమే బిల్లులు రావడంతో ఇందులో ఎవరి హస్తం ఉందని, బిల్లులు ఎవరు కాజేసారో తెలియాల్సిందేననంటూ పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. 
రూ.6 లక్షలు డ్రా..
బిల్లుల విషయమై పాలకవర్గ సభ్యులు మాత్రం గతంలో పని చేసిన కార్యదర్శిపైనే ఆరోపణలు చేస్తున్నారు. నిధుల గోల్‌మాల్‌ విషయంలో అసలేం జరిగిందనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇన్‌చార్జ్‌ కార్యదర్శి ఆధ్వర్యంలో బ్యాంకుకు వెళ్లి వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఇందులో పాత కార్యదర్శి తమ సంతకాలు ఫోర్జరీ చేసి సుమారు రూ.6 లక్షలు కాజేసి నర్సంపేటకు చెందిన నలుగురి ఖాతాల్లో జమచేసినట్లు సర్పంచ్‌ లావుడ్య రమేష్‌నాయక్, ఉప సర్పంచ్‌ ఉపేందర్‌ గుర్తించారు. ఈ మేరకు ఫోర్జరీగా గుర్తించిన చెక్కులను జిరాక్స్‌ తీయించి ఎంపీడీఓ సుమణవాణికి ఫిర్యాదు చేసి విచారణ చేపట్టాలని కోరారు. అలాగే, సంతకాలు ఫోర్జరీ చేసి డబ్బులు కాజేసిన కార్యదర్శిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సైకి సైతం ఫిర్యాదు చేశారు. కాగా, మరుగుదొడ్ల బిల్లులపై విచారణ జరిపి కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు