Warangal Central Jail: కాలగర్భంలోకి  135 ఏళ్ల చరిత్ర!

2 Jun, 2021 13:05 IST|Sakshi

వరంగల్‌: నిజాం పాలనా సమయంలో నిర్మించిన వరంగల్‌ సెంట్రల్‌ జైలుది 135 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర. నిజాం హయాంలో స్వాతంత్య్ర సమరయోధుల నుంచి స్వాతంత్య్రం వచ్చాక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, పీపుల్స్‌వార్, మావోయిస్టు అగ్రనేతల దాకా ఎందరో ఈ జైలులో ఖైదీలుగా గడిపారు. ఇంతటి చరిత్ర ఉన్న జైలు భవనాలు త్వరలోనే కాలగర్భంలో కలిసిపోనున్నాయి.

ప్రజలకు విస్తృతమైన వైద్యసేవలు అందించడం కోసం.. వరంగల్‌ నడిబొడ్డున ఉన్న ఈ జైలు స్థానంలో రీజనల్‌ కార్డియాక్‌ సెంటర్‌ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నగర శివార్లలోని మామునూరులో కొత్త జైలు నిర్మాణానికి స్థలం కేటాయించింది. కొత్త నిర్మాణాలు పూర్తయ్యే వరకు ఖైదీలను ఇతర జైళ్లలో ఉంచనున్నారు. ఈ మేరకు ఖైదీల తరలింపును జైళ్ల శాఖ డీజీ రాజీవ్‌ త్రివేది మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వరంగల్‌లోని సెంట్రల్‌ జైలు ప్రత్యేకతలపై కథనం.. 

1886లో నిర్మాణం 
స్వాతంత్య్రానికి ముందు దేశం మొత్తం బ్రిటిష్‌ పాలనలో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రాంతం నిజాం పాలనలో కొనసాగింది. అప్పట్లో శిక్ష పడిన ఖైదీలను ఉంచడానికి హైదరాబాద్‌లో చంచల్‌గూడ, ముషీరాబాద్‌ సెంట్రల్‌ జైళ్లు ఉండగా.. ఉత్తర తెలంగాణ ప్రాంత ఖైదీల కోసం 1886లో వరంగల్‌లో సెంట్రల్‌ జైలును నిర్మించారు. మొత్తం 66 ఎకరాల్లో ఈ జైలు ఉండగా.. రెండేళ్ల క్రితం కాళోజీ నారాయణరావు మెడికల్‌ యూనివర్సిటీకి ఆరు ఎకరాలు ఇవ్వడంతో అరవై ఎకరాలు మిగిలాయి. సుమారు 30 ఎకరాల్లో పరిపాలనా భవనం, ఖైదీల బ్యారెక్‌లు, హై సెక్యూరిటీ బ్యారెక్‌లు, ఖైదీల ఉపాధి కోసం ఏర్పాటు చేసిన కర్మాగారాలు, ఆస్పత్రి ఉన్నాయి.

నిజాం పాలనలో ఉన్నప్పటికీ జైలు నిర్మాణం మొత్తం బ్రిటిష్‌ ఇంజనీర్ల పర్యవేక్షణలో జరిగింది. డంగు సున్నం, ఇంగ్లండ్‌ నుంచి తెప్పించిన ఇనుమును వాడారు. ఇప్పటికీ లాకప్‌ ఇనుప కడ్డీలపై మేడిన్‌ ఇంగ్లండ్‌ అని ఉండటం చూడొచ్చు. జైలు నిర్మించిన సమయంలో 51 బ్యారెక్‌లు నిర్మించారు. భద్రత కోసం ఎత్తయిన ప్రహరీ, ఐదు వాచ్‌ టవర్లు, పరిపాలనా సౌలభ్యం కోసం మరో టవర్‌ కట్టారు. 2010లో కేంద్రం నుంచి రూ.22 కోట్లు మంజూరు కాగా.. రెండు కొత్త బ్యారెక్‌లు, హై సెక్యూరిటీ ప్రహరీ, నాలుగు కొత్త వాచ్‌ టవర్లను నిర్మించారు. 

పోరాట యోధులు, విప్లవ ఖైదీలకు అడ్డా 
స్వాతంత్య్రం వచ్చాక తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్న విప్లవ యోధులు పలువురు వరంగల్‌ సెంట్రల్‌ జైలులోనే శిక్ష అనుభవించారు. 80వ దశకం నుంచి అప్పటి పీపుల్స్‌వార్, ఇప్పటి మావోయిస్టులతోపాటు సీపీఐ (ఎంఎల్‌) చండ్ర పుల్లారెడ్డి, రవూఫ్‌ తదితర వర్గాలకు చెందిన నక్సల్స్‌ ఇక్కడే ఖైదీలుగా గడిపారు. ఇక్కడ నక్సల్స్‌ కోసం ప్రత్యేకంగా నక్సల్స్‌ బ్యారెక్‌ (ఎన్‌ఎక్స్‌ఎల్‌) ఏర్పాటు చేశారు. ఈ బ్యారెక్స్‌లో ఉండే నక్సల్స్‌కు జైలు అధికారులు నిత్యావసరాలు ఇస్తే.. వారే స్వయంగా వండుకొని తినేవారు.

తర్వాత మావోయిస్టు కార్యకలాపాలు తగ్గడంతో ఈ బ్యారెక్‌ను సాధారణ ఖైదీలకు కేటాయించారు. పీపుల్స్‌వార్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన కేజీ సత్యమూర్తి, మావోయిస్టు కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు కోబాడ్‌ గాంధీ, శాఖమూరి అప్పారావు, విరసం నేత వరవరరావు, సీపీఐఎంఎల్‌ (జనశక్తి) వర్గ నాయకుడు కూర రాజన్న, ఆర్‌ఓసీ రవూఫ్, నూడెమోక్రసీ గడ్డం వెంకట్రామయ్య అలియాస్‌ దొరన్న, బోగా శ్రీరాములు అలియాస్‌ మాధవ్, ధనసరి సమ్మన్న అలియాస్‌ గోపి, మధుతోపాటు దళ కమాండర్, సభ్యుల స్థాయి వారు ఇక్కడ ఖైదీలుగా గడిపారు.


ఇంకా దూరమైపోతున్నారా? 
‘ఇప్పటికే మాకు దూరంగా ఉన్నారు. దగ్గరుంటే అప్పుడో, ఇప్పుడో చూసుకునేటోళ్లం. ఇప్పుడు ఇంకా దూరమైపోతున్నారా..’అంటూ వరంగల్‌ సెంట్రల్‌ జైలు వద్ద ఖైదీల బంధువులు కన్నీళ్లు పెట్టుకున్నారు. జైలు నుంచి ఖైదీలను తరలిస్తున్న విషయం తెలిసి పలువురి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. తమవారిని చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ ఖైదీ సెంట్రల్‌ జైలులో ఉండేవాడు.

ఆయన భార్య, చిన్నపిల్లలు అప్పుడప్పుడు వచ్చి ములాఖత్‌లో కలిసి వెళ్లేవారు. కానీ ఇప్పుడు అతడిని చర్లపల్లి జైలుకు తరలిస్తుండడంతో.. అంత దూరం రావడం ఎలా, చూసుకోవడం ఎలా అంటూ ఆయన తల్లి, భార్యాపిల్లలు కన్నీళ్లు పెట్టుకున్నారు. వారు జైలు నుంచి బయటికి వచ్చిన వాహనం వెంట గుండెలు బాదుకుంటూ కొంత దూరం వెళ్లడం.. ఆ ఖైదీ వాహనం నుంచి చూస్తూ రోదించడం కలచివేసింది. 

భద్రత ఎంతో పటిష్టం 
దేశంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లున్న జైలుగా తీహార్‌ జైలుకు పేరుంది. దీనిని మించిన భద్రతతో వరంగల్‌ సెంట్రల్‌ జైలును తీర్చిదిద్దారు. కమాండ్‌ కంట్రోల్‌ రూం, హైసెక్యూరిటీ బ్యారక్స్, నిరంతర పర్యవేక్షణతోపాటు ఖైదీలకు ఉపాధి కల్పించే కార్యక్రమాల్లోనూ వరంగల్‌ జైలు మొదటి స్థానంలో ఉంది. హైసెక్యూరిటీ బ్యారక్స్‌లో 48 సెల్స్‌ ఉన్నాయి. వీటికి ప్రత్యేక లాకింగ్‌ సిస్టం, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంటుంది. కరుడుగట్టిన, ప్రమాదకర ఖైదీలను ఇందులో ఉంచేవారు. ప్రస్తుతం వీటిలో 40 మంది వరకు ఉన్నారని సమాచారం. ఇక ఈ జైల్లోని కమాండ్‌ కంట్రోల్‌ రూం నుంచి 24 గంటల పాటు సిబ్బంది నిఘా ఉంటుంది. భద్రతా చర్యల్లో భాగంగా 154 శక్తివంతమైన హైరిజల్యూషన్‌ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 


ఖైదీలకు ఉపాధి కోసం.. 
వరంగల్‌ సెంట్రల్‌ జైలులో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేశారు. ఏటా 20 లక్షల మొక్కలను పెంచి జిల్లా యంత్రాంగానికి అందజేస్తున్నారు. జైలు ఆవరణలో రెండు పెట్రోల్‌ పంపులను ఖైదీలతో నిర్వహిస్తున్నారు. దర్రీస్, సబ్బులు, ఫినాయిల్, స్టీల్‌ బీరువాలు, బెంచీలు తయారు చేసే పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడి ఉత్పత్తులను ‘మై నేషన్‌’బ్రాండ్‌ పేరిట విక్రయిస్తున్నారు. వాటి నుంచి సగటున ఏటా రూ.3 కోట్ల వరకు ఆదాయం అందుతోంది. తరచూ నేరాలు చేసేవారి మనస్తత్వం మార్చేందుకు ‘ఉన్నతి’పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చదువుకోవాలనే ఆసక్తి ఉన్న వారి కోసం అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ, పీజీ కోర్సులను జైలులోనే అందిస్తున్నారు. 

రెండేళ్లలో అత్యాధునిక జైలు 
వరంగల్‌: సెంట్రల్‌ జైలు స్థలంలో రీజనల్‌ కార్డియాక్‌ సెంటర్‌ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. వైద్య శాఖకు ఈ స్థలం అప్పగించడం కోసం ఖైదీలను ఇతర జైళ్లకు తరలిస్తున్నామని జైళ్ల శాఖ డీజీ రాజీవ్‌ త్రివేది తెలిపారు. మంగళవారం వరంగల్‌ సెంట్రల్‌ జైలు నుంచి ఖైదీల తరలింపు ప్రక్రియ మొదలైంది. దీనిని ఆయన పరిశీలించి, మీడియాతో మాట్లాడారు. మామునూరులో కేటాయించిన స్థలంలో అత్యాధునిక హంగులతో కూడిన సెంట్రల్‌ జైలును రెండేళ్లలో నిర్మిస్తామని రాజీవ్‌ త్రివేది తెలిపారు. ప్రస్తుతం జైల్లో 956 ఖైదీలు ఉన్నారని.. అందులో తొలివిడతగా మంగళవారం 119 మంది ఖైదీలను భారీ బందోబస్తుతో హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలుకు తరలించామని వివరించారు.

చదవండి: 
ముందు పోలీస్‌ వాహనం..వెనుకే ఆమె పరుగు.. 

Telangana: ఇంటర్‌ ఫైనల్‌ పరీక్షలు రద్దు?!

మరిన్ని వార్తలు