మేం చెప్పిందే వేదం.. మా మాటే శాసనం

19 May, 2021 11:35 IST|Sakshi
రైతులు తీసుకొచ్చిన మామిడి కాయల వాహనాలు  

సాక్షి, వరంగల్‌ : వరంగల్‌ లక్ష్మీపురం పండ్ల మార్కెట్‌లో కమీషన్‌ వ్యాపారులు ఒకరిద్దరే దశాబ్దాల కాలంగా శాసిస్తున్నారు. మార్కెట్‌లో బడా వ్యాపారులుగా పేరు ఉండడంతో వీరు చెప్పిందే ధర.. కాదు కూడదంటే సదరు రైతు, దళారులకు సంబంధించిన మామిడి కాయలను ఎవరు కొనుగోలు చేసేందుకే సాహసం చేయరు. ఈ విషయాన్ని మార్కెట్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తామేం చేయలేమన్న సమాధానం వస్తుంది. అంతెందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు సైతం ఒకరిద్దరి కనుసన్నల్లోనే లావాదేవీలు జరుపుతుంటారు.

ఇక ఓ వ్యాపారి అయితే పండ్ల మార్కెట్‌లో తనతో పాటు తన కుటుంబ సభ్యుల పేరిట నాలుగైదు మడిగెలను సొంతం చేసుకున్నారు. కరోనా సాకుతో పండ్ల మార్కెట్‌ను నగర శివార్లలోకి మార్చడం వెనుక కూడా సదరు వ్యాపారి ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. గత సంవత్సరం సుమారు రూ.కోటి మేర వ్యాపారులు కట్టాల్సిన మార్కెట్‌ ఫీజుకు ఎగనామం పెట్టేందుకు శతవిధాలుగా ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. చివరకు వాయిదాల వారీగా చెల్లించక తప్పలేదు. ప్రతీ టన్నుకు క్వింటా తరుగు, కమీషన్‌ 4శాతానికి బదులు 10శాతం తీసుకుంటున్నా అధికారులు చూస్తున్నారే తప్ప సదరు వ్యాపారిపై చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

టన్నుకు క్వింటా దోపిడీ
మామిడి కొనుగోలు చేస్తున్న కమీషన్‌ వ్యాపారులు టన్నుకు క్వింటాను తరుగుగా తీసివేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు మార్కెట్‌ అధికారిక లెక్కల ప్రకారం 2,57,046 కింటాళ్ల మామిడి కొనుగోలు చేయగా తరుగు కింద 25వేల క్వింటాళ్లకు పైగా వ్యాపారులు రైతుల వద్ద తరుగు పేరుతో దోచేశారు. క్వింటాకు మోడల్‌ ధరగా రూ.2,500 చొప్పున వేసుకున్నా సుమారు రూ.కోటికి పైగా రైతులు తమ ఆదాయాన్ని కమీషన్‌ వ్యాపారుల వల్ల కోల్పోయినట్లే. ఖమ్మంతో పాటు ఇతర మార్కెట్లలో టన్నుకు 40కిలోలు తరుగు కింద తీసివేస్తారని తెలిసింది.

కానీ ఇక్కడ క్వింటా తీస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని మార్కెట్‌ అధికారులను ప్రశ్నిస్తే కమీసన్‌ ‘వ్యాపారుల లీడర్‌ నుంచి మా ఇష్టం.. అమ్మితే అమ్మండి లేకుంటే లేదు’ అనే సమాధానం వస్తోందని చెబుతున్నారట. తరుగు, కమీషన్లపై తాము ఎక్కువగా ఒత్తిడి చేస్తే కొనుగోళ్లు మొత్తం ఆపివేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నందున ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని అధికారులు చెబుతుండడం గమనార్హం.

చదవండి: ‘ఆర్‌ఎఫ్‌సీఎల్‌’లో లీకవుతున్న గ్యాస్‌

మరిన్ని వార్తలు