కేయూ క్యాజువల్‌ ఉద్యోగిపై హాస్టళ్ల డైరెక్టర్‌ ఆగ్రహం!

18 Apr, 2022 13:33 IST|Sakshi
క్యాజువల్‌ ఉద్యోగిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హాస్టళ్ల డైరెక్టర్‌ మంజుల

సాక్షి, కేయూ క్యాంపస్‌(వరంగల్‌): కాకతీయ యూనివర్సిటీలోని కామన్‌మెస్‌లో క్యాజువల్‌ ఉద్యోగి (సూపర్‌వైజర్‌) నిరంజన్‌రెడ్డిపై హాస్టళ్ల డైరెక్టర్‌ డాక్టర్‌ మంజుల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈనెల 16న కామన్‌మెస్‌కు వచ్చిన మంజుల ‘నిన్ను లా కళాశాల హాస్టల్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేశాను. ఇక్కడ్నుంచి వెళ్లు గెటవుట్‌’ అంటూ నిరంజన్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘నేను ఏం తప్పుచేశానో చెప్పాలి, నిరూపించాలి’ అని సూపర్‌వైజర్‌ నిరంజన్‌రెడ్డి హాస్టళ్ల డైరెక్టర్‌తో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. కాకతీయ యూనివర్సిటీ హాస్టల్‌లో క్యాజువల్‌ ఉద్యోగి కామన్‌మెస్‌ సూపర్‌వైజర్‌గా నిరంజన్‌రెడ్డి కొన్నేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల కామన్‌మెస్‌కు సంబంధించిన పలు విషయాలను హాస్టళ్ల సూపరింటెండెంట్, హాస్టళ్ల డైరెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. కేయూలోని ఓ నాన్‌బోర్డర్‌కు నిరంజన్‌రెడ్డికి మధ్య గతంలో కొన్ని విబేధాలున్నాయి. నాన్‌బోర్డర్లను కామన్‌ మెస్‌లోకి రాకుండా నిరంజన్‌రెడ్డి అడ్డుకుంటున్నట్లు, దీంతో ఓ నాన్‌బోర్డర్‌ కామన్‌మెస్‌ విధుల నుంచి నిరంజన్‌రెడ్డిని తొలగించాలని డైరెక్టర్‌తో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతటితో ఆ నాన్‌బోర్డర్‌ ఆగకుండా.. నీతో కామన్‌మెస్‌ విధుల నుంచి తొలగించి చిప్పలు కడిగిస్తానని అని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే డైరెక్టర్‌ మంజుల కామన్‌ మెస్‌కు వచ్చి నిరంజన్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేయడం, లా కళాశాల హాస్టల్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేశామని చెప్పడం, ఆ తర్వాత నిరంజన్‌రెడ్డి విధులకు హాజరవకపోవడం ప్రస్తుతం యూనివర్సిటీలో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు