దేవుడా.. ఇదేమి అన్యాయం.. గుండెకోత మిగిల్చావ్‌

27 Oct, 2022 18:22 IST|Sakshi
గుళ్లపెల్లి పావని (ఫైల్‌)

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. గిర్మాజీపేట యువతి మృతి

తల్లిదండ్రులకు గుండెకోత.. 

వరంగల్‌ చౌరస్తా: వారిది మధ్య తరగతి కుటుంబం. ఇద్దరూ ఆడపిల్లలే. పిల్లలను బాగా చదివించాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే పిల్లలు కూడా కష్టపడి చదివారు. పెద్దకూతురు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి, కాగా, చిన్నకూతురును ఉన్నత విద్యాభ్యాసానికి అమెరికా పంపాడు. కానీ ఆ తల్లిదండ్రుల ఆశలు.. మధ్యలోనే ఆరిపోయాయి. అమెరికాలో స్నేహితులతో కలిసి వ్యాన్‌లో వెళ్తున్న ఆమె.. పొగమంచు కారణంగా జరిగిన ప్రమాదంలో చనిపోయింది. ఆ తల్లిదండ్రులకు గుండెకోత మిగిల్చింది. ఇక్కడ మరో విషాద ఏమిటంటే.. కూతురు చనిపోయిన విషయం తల్లికి తెలియజేయలేని పరిస్థితి. 

వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌ నగరంలోని గిర్మాజీపేటకు చెందిన గుళ్లపెల్లి రమేష్, కల్పన దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అతను ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో అడ్తి దుకాణాల్లో అకౌంటెంట్‌గా పనిచేస్తుండగా, తల్లి కల్పన ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్‌. పెద్ద కుమార్తె వాసవి ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోంది. చిన్నకూతురు పావని (22)ని అమెరికా పంపించాలనుకున్నారు. అందుకోసం రూపాయి.. రూపాయి కూడబెట్టారు. గత ఏడాది బీటెక్‌ పూర్తికాగా, ఎంఎస్‌ కోసం రెండు నెలల క్రితం అమెరికా వెళ్లింది. 

స్నేహితులతో వెళ్తుండగా..
అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 5 నుంచి 7 గంటల సమయంలో కనెక్టికట్‌ రాష్ట్రంలో 8 మంది స్నేహితులు మినీ వ్యానులో ప్రయాణిస్తున్నారు. వీరి వాహనం పొగమంచు కారణంగా ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు చనిపోగా, అందులో పావని ఒకరు. మిగతా ఇద్దరు ఏపీకి చెందిన వారు ఉన్నారు. మరికొంతమంది గాయపడ్డారు. 

గుండెలవిసేలా..
కూతురు చనిపోయిన విషయం తెలుసుకున్న తండ్రి రమేష్‌ గుండెలవిసేలా రోదిస్తున్నాడు. తల్లికి అనారోగ్యం కారణంగా విషయం చెప్పకుండా దాస్తున్నట్లు తెలిసింది. బంధువులు, ఇతరులు కూడా విషయం తెలిసినా మిన్నకుండిపోతున్నారు. ఆదివారం పావని మృతదేహం నగరానికి చేరుతుందని సమాచారం అందించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. (క్లిక్ చేయండి: ఉన్నత చదువుకు అమెరికా వెళ్లి.. మృత్యుఒడికి..)

దేవుడు అన్యాయం చేసిండు
‘ఇద్దరు కూతుళ్లు అని ఎప్పుడూ బాధ పడలేదు. ఉన్నత చదువులు చదివించాలనేది మా లక్ష్యం. అందుకోసం నేను, నా భార్య అహర్నిశలు కష్టపడ్డాం. మా కలలకు తగ్గట్టుగా పెద్ద పాప ఇక్కడే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోంది. చిన్న పాపను అమెరికాను పంపాలనుకున్నాం. రెండు నెలల కిందట పంపించాం. మొన్న దసరా, దీపావళి పర్వదినాల సందర్భంగా వీడియో కాల్‌లో మాతో మాట్లాడింది. అంతా బాగానే ఉందని ఓదార్చింది. అంతలోనే ఏం జరిగిందో తెలియదు. చనిపోయినట్లు అమెరికా నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. ఇది నమ్మలేకపోతున్నాను. దేవుడా.. ఇదేమి అన్యాయం’
- దగ్గర బంధువుల వద్ద పావని తండ్రి ఆవేదన

మరిన్ని వార్తలు