Warangal: రన్‌వే చివరన ఉందని.. హైవే కోసం భారీ సొరంగం! 

6 Jul, 2021 08:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  పెద్ద ఎయిర్‌పోర్టు.. రన్‌వే చివరన ఓ రోడ్డు ఉంది.. విమానాలు ల్యాండ్‌ అయ్యేటప్పుడు ఆ రోడ్డుపై వాహనాలకు తగులుతాయా అన్నంత కిందగా వస్తుంటాయి.. ఇది వినడానికి బాగానే ఉన్నా చాలా ప్రమాదకరమని, భద్రతా సమస్యలు వస్తాయని పౌర విమానయాన శాఖ అంటోంది. వరంగల్‌లో ప్రతిపాదించిన ఎయిర్‌పోర్టు రన్‌వే చివరన హైవే ఉందని.. ఆ హైవేను అక్కడి నుంచి దూరంగా మళ్లించాలని, లేకుంటే ఆ రన్‌వే ప్రాంతం మొదలై, ముగిసే దాకా సొరంగం నిర్మించి వాహనాలను అందులోంచి పంపాలని స్పష్టం చేస్తోంది. ఈ మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.  

రన్‌వే చివరన.. 
వరంగల్‌ శివార్లలోని మామునూరులో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించనున్న విషయం తెలిసిందే. ఆ విమానాశ్రయం రన్‌వే ముగిసి ప్రహరీ నిర్మించే చోటుకు కేవలం 500–700 మీటర్ల దూరంలో వరంగల్‌–ఖమ్మం జాతీయ రహదారి ఉంది. ఆ హైవేను మళ్లించాలంటే.. భారీగా భూసేకరణ చెయ్యాల్సి వస్తుంది, నిర్మాణ ఖర్చు భారీగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో రన్‌వే చివరిలో కిలోమీటర్‌ పొడవున ప్రత్యేక సొరంగాన్ని నిర్మించి జాతీయ రహదారిని దాని గుండా మళ్లించాలని.. ఆ సొరంగం పైభాగాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించాలని పౌర విమానయాన శాఖ ప్రతిపాదించింది. 

ఖర్చు వివరాలు చెప్పాల్సిందిగా లేఖ 
కొత్త విమానాశ్రయాల నిర్మాణం, భూసేకరణ బాధ్యత యావత్తూ రాష్ట్ర ప్రభుత్వానిదే. ఎయిర్‌పోర్టుకు అవసరమైన భూమి, నిర్మాణ ఖర్చు వివరాలను పౌర విమానయాన శాఖ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి వివరించింది. ఫేజ్‌–1 (డొమెస్టిక్‌) విమానాశ్రయానికి 724 ఎకరాల భూమి, రూ.248 కోట్లు.. ఫేజ్‌ –2 (అంతర్జాతీయ స్థాయి)కు 1,053 ఎకరాల భూమి, రూ.345 కోట్లు నిర్మాణ వ్యయం అవుతుందని టెక్నో ఎకనమిక్‌ ఫీజిబిలిటీ రిపోర్టులో వెల్లడించింది. తాజాగా కిలోమీటర్‌ పొడవున సొరంగమార్గం నిర్మించేందుకు అయ్యే ఖర్చు అదనం కానుంది. దీనికి ఖర్చు ఎంతవుతుందో తెలపాలని రాష్ట్ర అధికారులు పౌరవిమానయాన శాఖకు లేఖ రాయాలని నిర్ణయించారు.

ఇక ప్రస్తుతానికి ఖర్చు తగ్గించుకునేందుకు ఫేజ్‌–1 పద్ధతిలోనే విమానాశ్రయం నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. అవసరమైన భూమిని కూడా వంద ఎకరాల మేర తగ్గించేలా చూడాలని, సొరంగ మార్గం కూడా అర కిలోమీటరు పొడవుతో సరిపెట్టాలని కోరనున్నట్టు సమాచారం. కాగా.. త్వరలో నిర్వహించే సమావేశంలో రన్‌వే చివరన రోడ్డుకు ప్రత్యామ్నయ ఏర్పాట్లఫై చర్చించనున్నారు. పరిష్కారమేదీ లభించకపోతే సొరంగం నిర్మాణమే ఫైనల్‌ కానుంది.   

మరిన్ని వార్తలు