పోలీస్‌స్టేషన్‌ పైనుంచి దూకిన వ్యక్తి మృతి.. పోలీసులు చెప్తున్నదేంటి?

12 Aug, 2022 02:24 IST|Sakshi

నిమ్స్‌లో చికిత్స పొందుతూ చనిపోయిన కోమాండ్ల కుమార్‌ 

ఖిలా వరంగల్‌: వరంగల్‌ నగరంలోని మిల్స్‌ కాలనీ పోలీస్‌స్టేషన్‌ పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించిన కోమాండ్ల కుమార్‌(40) అనే వ్యక్తి హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి.. వరంగల్‌ గరీబ్‌ కాలనీకి చెందిన కోమాండ్ల కుమార్‌ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

ఈ నెల 6న ఉదయం అబ్బనికుంటకు చెందిన సాయిని లక్ష్మి ఇంట్లో సామగ్రి సర్దేందుకు కుమార్‌తోపాటు శివరాత్రి కుమార్, కిషన్, వీరు(వీరన్న) కూలీకి వచ్చారు. ఇల్లు సర్దే క్రమంలో రూ.5వేల విలువైన ముత్యాల గొలుసు, రూ.35 వేల విలువైన బంగారు గొలుసు మాయమయ్యాయని ఇంటి యజమాని లక్ష్మి తన సోదరుడు శ్రీనివాస్‌కు చెప్పగా అతను అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆదివారం ఉదయం నలుగురిని పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించారు. భవనంపై అంతస్తులో విచారిస్తుండగానే కుమార్‌ కిందికి దూకాడు.

స్థానికంగా వైద్యమందించిన పోలీసులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున అతను మృతి చెందాడు. కాగా.. కోమండ్ల కుమార్, శివరాత్రి కుమార్‌ మధ్య వాగ్వాదం జరిగిందని.. తన పేరు చెబితే చంపుతానని శివరాత్రి కుమార్‌ బెదిరించడం వల్లే కోమండ్ల కుమార్‌ భవనంపై నుంచి కిందకు దూకాడని పోలీసులు వివరణ ఇచ్చారు. తాము కొట్టడం వల్లే దూకాడన్న విషయం అవాస్తవమని పేర్కొన్నారు.

పోలీసుల దెబ్బలు భరించలేకే..
మా నాన్నను పోలీసులు తీసుకొచ్చారని తెలిసి వెంటనే మేం స్టేషన్‌కు చేరుకున్నాం. అప్పటికే భవనంపై నుంచి నాన్న అరుపులు వినిపించాయి. క్షణాల్లోనే భవ నంపై నుంచి మాకళ్లెదుటే కిందకు దూకాడు. పోలీసుల దెబ్బలు భరించలేకే మా నాన్న దూకాడు. బా«ధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.    
– సంధ్య, మృతుడి కుమార్తె

మరిన్ని వార్తలు