ప్రాణాలతో పోరాడుతున్న ప్రీతి.. అత్యంత విషమంగా పీజీ వైద్య విద్యార్థిని పరిస్థితి

23 Feb, 2023 10:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వరంగల్‌ మెడికల్‌ కాలేజీ పీజీ స్టూడెంట్‌ ప్రీతి ప్రాణాలతో పోరాడుతోంది. ప్రస్తుతం నిమ్స్‌లోని ఏఆర్సీయూలో వెంటిలేటర్‌పైనే ఆమెకు చికిత్స కొనసాగుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు. అవయవాలు దెబ్బతినడంతో పాటు బ్రెయిన్ డ్యామేజ్ అయినట్లు వైద్యులు చెబుతున్నారు. మత్తు ఇంజక్షన్‌ వల్లే ప్రీతి అపస్మారక స్థితిలోకి వెళ్లిందని వెల్లడించారు. ఆమెను కాపాడేందుకు డాక్టర్‌ పద్మజా నేతృత్వంలోని అయిదుగురు వైద్యుల బృందం తీవ్రంగా శ్రమిస్తుంది.

అనస్తేషియా, కార్డియాలజీ, న్యూరాలజీ, జనరల్ ఫిజిషియన్‌ డాక్టర్లు ప్రీతికి వైద్య చికిత్స అందిస్తున్నారు. చికిత్సకు ప్రీతి శరీరం సహకరించడం లేదని, బీపీ, పల్స్‌ రేట్‌ నమోదు కానీ పరిస్థితి వచ్చిందన్నారు. వరంగల్‌ నుంచి నిమ్స్‌కు తీసుకువచ్చే సమయంలో రెండుసార్లు గుండె ఆగిపోయిందని.. వైద్యులు సీపీఆర్‌ చేసి మళ్లీ గుండె కొట్టుకునేలా చేశారని తెలిపారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడే ఏమి చెప్పలేమని నిమ్స్‌ వైద్యులు చెబుతున్నారు. 

కాగా వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్‌లో సీనియర్‌ వేధింపులతోక వైద్య విద్యార్థిని ప్రీతి బుధవారం మత్తు ఇంజక్షన్ వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. వెంటనే అప్రమత్తమైన సహా విద్యార్థులు, వైద్య సిబ్బంది వరంగల్‌లోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం ఎంజీఎంకు మార్చారు. బాధితురాలి ఆరోగ్యం విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హూటాహుటిన వరంగల్ నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం నిమ్స్‌లో ప్రీతికి చికిత్స అందిస్తున్నారు.

సైఫ్‌ వేధింపుల వల్లే..
కాలేజీలో సీనియర్‌ ర్యాగింగ్ వల్లే తన కుమార్తె ఆత్మహత్యాయత్నం చేసిందని బాధితురాలి తల్లిదండ్రులు చెబుతున్నారు. నవంబర్‌లో ప్రీతి కేఎంసీలో చేరిందని, డిసెంబర్‌ నుంచి ఆమెకు వేధింపులు ప్రారంభమయ్యాయని తెలిపారు. దీనిపై కాలేజీ యజమాన్యానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆమె తండ్రి నరేందర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన యువతి అంటూ అవమానపరుస్తూ వేధింపులకు గురిచేశారని ఆరోపించారు.

‘జనవరి 20వ తేదీనకాలేజీ దగ్గరికి వెళ్లానని, ఉన్నతాధికారులకు వేధింపుల గురించి తెలియజేశాను. కానీ ఎవరూ పట్టించుకోలేదు. సీనియర్లు కదా మామూలుగా ర్యాగింగ్ ఉంటుంది అనుకున్నాం. వేధింపులకు పాల్పడుతున్న సైఫ్‌తో మాట్లాడుతానని ప్రీతికి చెప్పా. వద్దు, మళ్ళీ ఇబ్బందులు ఉంటాయి. మార్కులు తక్కువ వేస్తారు అని భయపడింది. ఎంతో ధైర్యంగా ఉండేది. కరోనాలో కూడా విధులు నిర్వర్తించింది.  అలాంటి ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిందంటే సైఫ్ ఎంతగా వేధించాడో. 

కాలేజీకి చెడ్డ పేరు ఎక్కడో వస్తుందోనని నిమ్స్‌కు తీసుకువచ్చారు. వరంగల్‌లో గొడవ అవుతుందని కావాలని హైదరాబాద్ తరలించారు. మాకు న్యాయం చేయాలి. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపుల వల్ల నా బిడ్డ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలి. మా బిడ్డ ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. వాడికి శిక్ష పడాలి. చాలా దారుణంగా వేధించాడు. మా బిడ్డ పూర్తిగా ఆరోగ్యంగా ఉంది. ప్రీతికి ఎటువంటి ఆనారోగ్యం లేదు. చదువుల్లో నంబర్ వన్.  పోలీసు ఫిర్యాదు తర్వాత సైఫ్ వేధింపులు తీవ్రతరమయ్యాయి. సైఫ్‌ను కఠినంగా శిక్షించాలి’ అని డిమాండ్‌ చేశారు. 

తప్పుడు ఆరోపణలు సరికావు: జూనియర్‌ డాక్టర్లు
ఆధారాలు లేకుండా సీనియర్‌ విద్యార్థిపై ఆరోపణలు చేయడం సరికాదని జూనియర్‌ డాక్టర్లు చెబుతున్నారు. ఘటనపై ప్రస్తుతం అధికారుల విచారణ జరుగుతోందని, విచారణపూర్తయ్యే వరకు తప్పుడు ఆరోపణలు చేయవద్దని పేర్కొన్నారు. అయితే ర్యాంగింగ్‌ లాంటిదేమి జరగలేదని కేఎంసీ ప్రిన్సిపాల్‌ వెల్లడించారు. ఇదిలా ఉండగా ప్రీతి ర్యాగింగ్ కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ప్రీతిని వేధించిన సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సైఫ్‌ను పోలీసులు విచారించనున్నారు. సైఫ్ స్వస్థలం హనుమకొండ జిల్లా కాజీపేట.

మరిన్ని వార్తలు