అత్యంత విషమంగా మెడికో ప్రీతి ఆరోగ్యం.. హెల్త్‌ బులెటిన్ విడుదల

24 Feb, 2023 11:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వరంగల్‌ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్‌ విడుదల చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని వైద్యులు ప్రకటించారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రీతి కిడ్నీ, గుండె పనితీరు కొంచెం మెరుగవుతుందని, నిపుణులైన వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని తెలిపారు. ఆమెను కాపాడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోన్నామని బులిటెన్‌లో పేర్కొన్నారు.

మరోవైపు మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై విచారణ కొనసాగుతోంది. వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్‌ విద్యార్థి సైఫ్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. ఫోన్‌ చాటింగ్‌తోపాటు పలు కీలక ఆధారాలు సేకరించారు. సైఫ్‌పై ఎస్సీ,ఎస్టీ, అట్రాసిటీ, ర్యాగింగ్‌ కేసులు నమోదు చేశారు.

అసలేం జరిగిందంటే..
వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న పీజీ వైద్యవిద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది. జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన ప్రీతి కేఎంసీలో పీజీ (అనస్థీషియా) మొదటి సంవత్సరం చదువుతోంది. శిక్షణలో భాగంగా ఎంజీఎంలో విధులు నిర్వహిస్తోంది. జనవరి 22న పాయిజన్‌ ఇంజిక్షన్‌ తీసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది.

అపస్మారక స్తితిలోకి వెళ్లి యువతి ఒక్కసారిగా కుప్పకూలంతో సహచర విద్యా‍ర్థులు, డాక్టర్లు ఆమెను వెంటనే ఎమర్జెన్సీ వార్డులోకి తరలించి, అత్యవసర వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హూటాహుటిన హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.  ప్రస్తుతం ప్రీతి ప్రాణాల కోసం పోరాడుతోంది. ప్రీతిని కాపాడేందుకు నిమ్స్ వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 

అయితే కాలేజీలో సీనియర్‌ వేధింపులతోక ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  సీనియర్‌ విద్యార్థి సైఫ్‌పై కాలేజీ యజమాన్యానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆమె తండ్రి నరేందర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన యువతి అంటూ అవమానపరుస్తూ వేధింపులకు గురిచేశారని ఆరోపించారు.సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు