21న భూమిపూజ: ఓరుగల్లు ఒడిలో అత్యాధునిక వైద్యం..

17 Jun, 2021 02:00 IST|Sakshi

మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి 21న సీఎం కేసీఆర్‌ భూమి పూజ

దేశంలో ఎక్కడా లేని విధంగా సకల సదుపాయాలతో నిర్మాణం

59 ఎకరాల విస్తీర్ణం.. 24 అంతస్తులు.. 24వ అంతస్తుపై హెలీప్యాడ్‌

2,000 పడకలు, 34 విభాగాలు, 500 మంది వరకు వైద్యులు,వెయ్యి మంది వరకు నర్సులు

రూ.వెయ్యి కోట్లతో నిర్మాణం

  • హైదరాబాద్‌ నుంచి కూడా రోగులు వైద్యం కోసం వరంగల్‌కు వెళ్లే పరిస్థితి ఉండేలా ఈ ఆస్పత్రిలో ఏర్పాట్లు చేయనున్నారు.
  • సీజనల్‌ వ్యాధుల కాలంలో ఖమ్మం, వరంగల్‌ జిల్లాలు, పక్క రాష్ట్రాల గిరిజన ప్రాంతాలు, ఇతరచోట్ల నుంచి ఎయిర్‌ అంబులెన్సుల్లో రోగులను ఇక్కడకు తరలించేలా హెలీప్యాడ్‌ ఏర్పాటు
  • ఎలాంటి వైరస్‌లు వచ్చినా వాటికి దీటుగా చికిత్స అందించేలా, పరీక్షలు నిర్వహించేలా సదుపాయాలు

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ఎక్కడా లేని విధంగా, ఎయిమ్స్‌ ఆస్పత్రులను సైతం తలదన్నేలా.. వరంగల్‌లో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ప్రభుత్వ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని నెలకొల్పేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 21న ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీనికి భూమిపూజ చేయనున్నారు. దీనిని తన కలల ప్రాజెక్టుగా భావిస్తున్న సీఎం.. ఉత్తర తెలంగాణకే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు వైద్య సేవలు అందించేలా ఈ ఆస్పత్రిని తీర్చిదిద్దాలని యోచిస్తున్నారు. దీని కోసం ఏకంగా 24 అంతస్తుల భవనం నిర్మించాలని, చివరి అంతస్తు పైభాగంలో హెలీప్యాడ్‌ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. ఇలాంటి ఆసుపత్రి దేశంలో ఎక్కడా లేదని, కెనడాలో ఉన్న ఒక ఆసుపత్రిని మోడల్‌గా తీసుకొని దీన్ని తీర్చిదిద్దాలని సీఎం అధికారులను ఆదేశించారు. కెనడా వెళ్లి ఆ ఆసుపత్రిని పరిశీలించి రావాలని సూచించారు. ముఖ్యమంత్రే వైద్య ఆరోగ్యశాఖ బాధ్యతలు చూస్తున్నందున ఈ ప్రాజెక్టు శరవేగంగా రూపుదిద్దుకుంటుందని అధికారులు అంటున్నారు. మొత్తం ఈ ఆసుపత్రి నిర్మాణానికి, అందులో అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటుకు దాదాపు రూ.1,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.

పది సూపర్‌ స్పెషాలిటీ విభాగాలు
వరంగల్‌లోని సెంట్రల్‌ జైలు స్థానంలో, 59 ఎకరాల విస్తీర్ణంలో ఈ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తారు. రెండు వేల పడకల సామర్థ్యంతో తీర్చిదిద్దనున్నారు. ఇందులో సుమారు 34 వరకు విభాగాలు ఉంటాయి. దాదాపు 500 మంది వరకు వైద్యులు, వెయ్యి మంది వరకు నర్సులు, ఇతర పారామెడికల్‌ సిబ్బంది పనిచేస్తారు. మొత్తం పది సూపర్‌ స్పెషాలిటీ విభాగాలు రోగులకు సేవలందించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ఎండోక్రై నాలజీ, కార్డియో థొరాసిక్‌ సర్జరీ, న్యూరో సర్జరీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ వంటి మొత్తం పది సూపర్‌ స్పెషాలిటీ విభాగాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు దాదాపు ఐదు అంతస్తుల్లో ప్రత్యేకంగా అత్యాధునిక ఆపరేషన్‌ థియేటర్లు ఏర్పాట్లు చేస్తారు. ఆక్సిజన్, వెంటిటేటర్‌ సౌకర్యం ఏర్పాటు చేస్తారు. ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆసుపత్రులను తలదన్నేలా విదేశాల నుంచి వైద్య పరికరాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఆస్పత్రి భవన నిర్మాణం పూర్తిగా పర్యావరణ హితంగా నిర్మిస్తామని అధికారులు చెబుతున్నారు. ఆసుపత్రిలో రోగులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా, ప్రతి అంతస్తులోనూ బాగా గాలీ వెలుతురు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు