33 అంతస్తులు, 2000 పడకలు.. త్వరలో వరంగల్‌లో మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి  

25 Nov, 2021 03:22 IST|Sakshi

హెలీ అంబులెన్స్‌ సేవలు, ఇతర అన్ని హంగులతో ఏడాదిన్నరలో పూర్తిచేయడమే లక్ష్యం  

కెనడా తరహా సౌకర్యాలతో నిర్మాణం 

ముఖ్యమంత్రి దృష్టికి మ్యాప్, ప్లాన్‌ 

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా టి.హరీశ్‌రావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత వరంగల్‌ పెద్దాసుపత్రి నిర్మాణం అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. దేశంలోనే ఆదర్శంగా ఉండేలా, అత్యాధునికంగా రూపుదిద్దుకునేలా çసరికొత్త నమూనా, సీఎం కేసీఆర్‌ బొమ్మ ఉన్న ప్రోమో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. పేదలకు పెద్దరోగమొస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పట్నంబాట పట్టే వరంగల్‌ ప్రాంతవాసుల కష్టాలకు త్వరలో తెరపడనుంది.

59 ఎకరాల విస్తీర్ణంలో రూ.2,180 కోట్ల వ్యయంతో 33 అంతస్తుల మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏడాదిన్నరలో అందుబాటులోకి రానుంది. వరంగల్‌ను హెల్త్‌హబ్‌గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో సీఎం భారీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రి ఆవరణలో హెలికాప్టర్‌ ల్యాండ్‌ అయ్యే విధంగాహెలీ అంబులెన్స్‌ సేవలు అందుబాటులోకిరానున్నాయి. ఈ ఆసుపత్రి నిర్మాణానికి వరంగల్‌ సెంట్రల్‌ జైలు ఆవరణలో జూన్‌ 21న సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. 

రెండు వేల పడకలు.. 36 విభాగాలు... 
రెండువేల పడకల సామర్థ్యంతో తీర్చిదిద్దనున్న ఈ ఆ స్పత్రిలో 36 విభాగాలు పనిచేయనున్నట్లు వైద్య, ఆరో గ్య శాఖ ఉన్నతాధికారులు గతంలోనే వెల్లడించారు. సుమారు 500 మంది వైద్యులు, వెయ్యి మందికిపైగా నర్సులు, పారామెడికల్‌ సిబ్బందితోపాటు ఇతర సిబ్బంది ఇక్కడ పనిచేస్తారు. పది సూపర్‌ స్పెషాలిటీ విభాగాలతో రోగులకు సేవలందించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ఎండోక్రైనాలజీ, కార్డియోథొరాసిక్‌ సర్జరీ, న్యూరో సర్జరీతోపాటు, పిడియాట్రిక్‌ సర్జరీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ తదితర సూపర్‌ స్పెషాలిటీ విభా గాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. కొత్తది అందుబాటులోకి వస్తే అన్నిరకాల వైద్య సేవలు, శస్త్రచికిత్సలు ఇక్కడే అందుతాయి.  

పర్యావరణహితంగా నిర్మాణం 
భారీ నిర్మాణం పూర్తిగా పర్యావరణహితంగా సాగనుంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే జీవ వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేస్తారు. పచ్చదనం వెల్లివిరిసేలా భవన నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయాలని శంకుస్థాపన సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. కెనడా తరహా వైద్య విధానాలు, సౌకర్యాలతో ఆస్పత్రి నిర్మించాలని ఆయన అధికారులకు సూచించగా ఈ మేరకు భవనం మ్యాప్, ప్లాన్‌ను సీఎం దృష్టికి తెచ్చారు. కేసీఆర్‌ ఆదేశాలతో కెనడా వైద్య విధానాలపై అధ్యయనానికి తెలంగాణ వైద్య నిపుణులు బృందం త్వరలో ఆ దేశానికి వెళ్లనుంది.  

 
 

మరిన్ని వార్తలు