ముక్కలేనిదే ముద్ద దిగదు.. నీటుగా ఉండే ‘నాటు కోడి’ రుచి ఆస్వాదించాల్సిందే

24 Nov, 2021 10:59 IST|Sakshi

 దేశవాళీ కోళ్లకు పెరుగుతున్న ఆదరణ

రుచి, ఆరోగ్య ప్రయోజనాలెన్నో

నగర చుట్టుపక్కల గ్రామాల్లో విరివిగా పెంపకం

ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ముక్కలేనిదే ముద్ద దిగదు. సండే వచ్చిందంటే చాలు మెనూలో మాంసాహారం ఉండాల్సిందే! అందుకే వారాంతాల్లో రెస్టారెంట్లు కిటకిటలాడుతాయి. చికెన్, మటన్‌ సెంటర్లు కళకళలాడుతాయి. ఈ నేపథ్యంలో నగర ప్రజలు కొత్తదారి పడుతున్నారు. రుచి, ఆరోగ్యాన్ని వెతుక్కుంటూ పల్లె బాట పడుతున్నారు. నాటు కోళ్లను కొనుగోలు చేస్తున్నారు. నీటుగా ఉండే ‘నాటు కోడి’ రుచిని ఆస్వాదిస్తున్నారు. మాంసాహార ప్రియుల నోరూరిస్తున్న నాటు కోడి మాంసంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
– ఖిలా వరంగల్‌

పౌల్ట్రీ విప్లవం తరుముకొచ్చింది. వీధికో చికెన్‌ సెంటర్‌. పల్లెకో(మినీ) పౌల్ట్రీ పరిశ్రమ. ప్రజల నుంచి డిమాండ్‌ ఉండడాన్ని కొందరు క్యాష్‌ చేసుకుంటున్నారు. బాయిలర్‌ కోళ్లు వేగంగా పెరగడానికి ఇంజక్షన్లు, స్టెరాయిడ్స్‌ ఇస్తున్నారు. మూడు నెలలు పెరగాల్సిన కోడి కేవలం నలభై రోజుల్లోనే మూడు కిలోల బరువు వరకు పెరుగుతోంది. ప్రజల డిమాండ్‌కు అనుకూలంగా రసాయనాలు వాడి కోళ్లను సరఫరా చేస్తున్నారు. దీంతో అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పౌష్టిక విలువలున్న నాటు కోళ్లవైపు మాంసాహార ప్రియుల చూపు మళ్లింది.  

నాటుకే మాంసాహార ప్రియుల ఓటు
రసాయనాలతో పని లేకుండా నాటుకోళ్లు పెరుగుతున్నాయి. ప్రకృతి సిద్ధంగా లభించే తౌడు, మొక్కజొన్నలు, సజ్జలు, బియ్యం, నూకలు, రాగులు వంటి తృణధాన్యాలు తిని పెరుగుతున్నాయి. దీంతో వీటిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణాలు అధికంగా ఉన్నాయి. మంచి రుచి కూడా ఉండటంతో నాటుకోడి చికెన్‌కు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. గ్రామాల్లో సహజంగా కనిపించే కోళ్లతో పాటు దేశవాలీ కోళ్లలోనూ గిరి రాజు, వనరాజు వంటి అనేక జాతులు ఉన్నాయి. నగరం చుట్టుపక్కల గ్రామాల్లో వీటిని పెంచి అనేకమంది జీవనోపాధి కూడా పొందుతున్నారు. 

నోరూరించే కోడి కూర
నాటుకోడికి మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. ‘నాటుకోడి చికెన్‌ లభించును’ అని కొన్ని రెస్టారెంట్లు వినియోగదారుల్ని ఆకర్షిస్తూ బోర్డులు పెడుతున్నాయి. యువత పార్టీలు చేసుకునే సమయంలో నాటుకోడికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నది.

పెరిగిన డిమాండ్‌ ..
వరంగల్‌ నగరవాసులకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. బాయిలర్‌ కోళ్లు తినడానికి చాలామంది ఇష్టపడట్లేదు. ఈ క్రమంలో నాటు కోళ్లకు డిమాండ్‌ బాగా పెరిగింది. ఇవి పల్లెల్లో ఎక్కువగా లభిస్తున్నాయి. దీంతో ప్రత్యేకంగా వీటికోసం వారాంతాల్లో పల్లెబాట పడుతున్నారు. నాటుకోడి కిలో ధర రూ.400 పలుకుతోంది. అయినప్పటికీ  మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది.

నాటు కోళ్లతో రుచి, ఆరోగ్యం
ఇతరకోళ్ల కంటే నాటుకోడి మాంసం రుచిగా ఉంటుంది. ఇంటిళ్లిపాది నాటుకోడినే ఇష్టపడుతున్నాం. ధర కాస్త ఎక్కువైనా కూడా నాటుకోడి మాంసమే తింటున్నాం. ఆదివారం వస్తే దేశవాళీ కోళ్ల పెంపకం దారుల వద్ద నాటు కోడిని కొని తెచ్చుకుంటున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా పల్లెబాట పడుతున్నాం. ఆరోగ్యం, రుచి అన్నింటా సహజంగా పెరిగిన నాటుకోళ్లే నయం. 
– ఎం. శశికాంత్, ఫోర్ట్‌రోడ్డు వరంగల్‌   

మరిన్ని వార్తలు