రాష్ట్రంలో గోదాములు ఖాళీ!

22 Nov, 2022 03:17 IST|Sakshi

దేశంలో తగ్గుతున్న ఆహార ధాన్యాల నిల్వలు 

రాష్ట్రంలోని గోదాముల నుంచి ఇతర ప్రాంతాలకు తరలింపు 

ఎఫ్‌సీఐకి కస్టమ్‌ మిల్లింగ్‌ బియ్యం అందడంలో జాప్యం 

దీంతో రాష్ట్రంలోని సగం గోడౌన్లు ఖాళీనే.. 

‘గోదాములు కిరాయికి ఇవ్వబడును’అంటూ బ్యానర్లు 

పనిలేక ఖాళీగా ఉంటున్న హమాలీలు 

సాక్షి, హైదరాబాద్‌: ఎప్పుడూ బియ్యం బస్తాలతో నిండుగా కనిపించే గోదాములు స్టాక్‌ లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. వాటి ముందు ‘గోదాములు కిరాయికి ఇవ్వబడును’అనే బ్యానర్లు వెలుస్తున్నాయి. దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు తగ్గిపోతున్న నేపథ్యంలో.. ఎఫ్‌సీఐ రాష్ట్రంలోని గోడౌన్లలో ఉన్న బియ్యాన్ని అవసరమైన రాష్ట్రాలకు పంపుతోంది.

ఇదే సమయంలో రాష్ట్రంలో ఎఫ్‌సీఐ గోదాములకు చేరాల్సిన కస్టమ్‌ మిల్లింగ్‌ బియ్యం దాదాపు నాలుగు నెలలుగా సరిగా రావడం లేదు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అప్పగించాల్సిన మిల్లర్లు.. వివిధ కారణాలతో మిల్లింగ్‌ ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో గోడౌన్లు ఖాళీగా ఉంటున్నాయి. వీటిని అవసరమైన వ్యాపారులు, సంస్థలకు అద్దెకు ఇచ్చేందుకు వేర్‌ హౌజింగ్‌ కార్పొరేషన్లు ప్రయత్నాలు చేస్తున్నాయి. 

గోదాముల్లో స్టాక్‌ 43 శాతమే..
భారత ఆహార సంస్థ లెక్కల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్‌సీఐ, సీడబ్ల్య్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ గోడౌన్లతోపాటు ప్రైవేటు వ్యక్తులకు చెందిన గోదాములు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అందులో ఎఫ్‌సీఐ తన సొంత గోదాములతోపాటు రాష్ట్ర, కేంద్ర వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్ల పరిధిలోనివి, ప్రైవేటుకు చెందినవి కలిపి 43 ప్రాంతాల్లోని గోదాములను లీజుకు తీసుకొని నిర్వహిస్తోంది.

ఎఫ్‌సీఐ లెక్కల ప్రకారం 13.58 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యమున్న ఈ గోదాములలో ప్రస్తుతం 5.83 లక్షల టన్నుల స్టాక్‌ మాత్రమే ఉంది. ఇది పూర్తి సామర్థ్యంలో 42.94 శాతం మాత్రమే. ఇవికాకుండా ప్రైవేటు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ కింద కొన్ని, ప్రైవేటు వ్యక్తులు నిర్వహించే మరికొన్ని గోదాములు కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. మిల్లుల నుంచి బియ్యం రాకపోవడంతో ఎఫ్‌సీఐ ఖాళీచేసిన గోదాములను ఇతర వ్యాపారులకు, సంస్థలకు అద్దెకు ఇచ్చేందుకు సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు పని లేకపోవడంతో ఈ గోదాముల్లోని హమాలీలు ఇబ్బందిపడుతున్నారు. 

ఇక్కడి గోదాములు బియ్యానికే పరిమితం
రాష్ట్రంలో ఎఫ్‌సీఐ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన గోదాములన్నీ బియ్యం నిల్వ చేయడానికి ఉద్దేశించినవే. ఎఫ్‌సీఐ అప్పుడప్పుడూ గోధుమలను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి గోదాముల్లో నిల్వ చేస్తుంది. ప్రస్తుతం గోదాముల్లో ఉన్న నిల్వల్లో గోధుమలు, ఇతర ఆహార పదార్థాలు కలిపి అంతా 5 శాతంలోపేనని.. మిగతా 95 శాతం బియ్యమేనని ఎఫ్‌సీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ బియ్యాన్ని కూడా ఎప్పటికప్పుడు సెంట్రల్‌ పూల్‌ కింద ఇతర రాష్ట్రాలకు పంపిస్తుండడంతో ఖాళీలు ఏర్పడుతున్నాయని వివరించారు. 

మిల్లుల్లోనే 65 లక్షల టన్నుల ధాన్యం
రాష్ట్రంలో సుమారు ఆరు నెలలుగా కస్టమ్‌ మిల్లింగ్‌ సజావుగా సాగడం లేదని అధికారవర్గాలు చెప్తున్నాయి. మిల్లర్లు తమ సొంత అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎఫ్‌సీఐకి అప్పగించాల్సిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారనే విమర్శలున్నాయి. ఎఫ్‌సీఐ చర్యలకు దిగినప్పుడు మాత్రమే సీఎంఆర్‌ అప్పగిస్తున్నట్టు హడావుడి చేస్తున్న మిల్లర్లు.. తర్వాత తమ సొంత అవసరాల మేరకే మిల్లింగ్‌ జరుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

గత ఏడాది వానాకాలం ధాన్యం ఇప్పటికీ 15 లక్షల టన్నుల వరకు మిల్లర్ల వద్ద ఉండగా.. గత యాసంగికి సంబంధించిన 50లక్షల టన్నులు టార్పాలిన్ల కింద మగ్గిపోతోంది. అంటే 65 లక్షల టన్నుల ధాన్యం ఇంకా మిల్లర్ల వద్దే ఉంది. దీన్ని మిల్లింగ్‌ చేస్తే 40 లక్షల టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి అందుతుంది. ఆ బియ్యాన్ని గోడౌన్లకు తరలించి నిల్వ చేయనున్నారు. 

మరిన్ని వార్తలు