వర్గల్‌ క్షేత్రానికి నవరాత్రి శోభ

26 Sep, 2022 02:24 IST|Sakshi
వర్గల్‌ శ్రీవిద్యా సరస్వతీ క్షేత్రం 

నేటి నుంచి శ్రీవిద్యాసరస్వతి శరన్నవరాత్రోత్సవాలు 

రోజుకో అలంకరణలో అమ్మవారి దర్శనం

వర్గల్‌(గజ్వేల్‌): వర్గల్‌ శంభునికొండపై కొలువుదీరిన శ్రీవిద్యా సరస్వతీ క్షేత్రం సోమవారం నుంచి అక్టోబర్‌ 4వ తేదీ నవమి వరకు జరిగే శరన్నవరాత్రి మహోత్సవాలకు ముస్తాబైంది. వర్గల్‌ క్షేత్రానికి సికింద్రాబాద్‌ నుంచి ఉదయం 8 గంటలకు, 10 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. ఇవే కాకుండా సికింద్రాబాద్‌ నుంచి గజ్వేల్, సిద్దిపేట, కరీంనగర్‌ రూట్‌లో వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో వర్గల్‌ క్రాస్‌రోడ్డు వరకు వచ్చి, అక్కడి నుంచి ఆటోలో  క్షేత్రానికి చేరుకోవచ్చు. 

నేటి నుంచి నవరాత్రోత్సవాలు 
సోమవారం అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభ వం అవుతాయి. వచ్చే నెల 2వ తేదీన  లక్ష పుష్పార్చన, పల్లకీసేవ, పుస్తక రూపిణి సరస్వతీ పూజ, 4న మంగళవారం మహార్నవమి, అమ్మవారికి అష్టో త్తర కలశాభిషేకం, పూర్ణాహుతి, 5న బుధవారం కలశోద్వాసన, విజయదశమి వేళ అమ్మవారి విజ య దర్శనం, శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీవెంకటేశ్వరస్వామికి విశేష అభిషేకం జరుగుతుంది. 

తొమ్మిది రోజులు.. 
ఉత్సవాల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. మొదటి రోజు బాలాత్రిపుర సుందరీదేవిగా, రెండో రోజు గాయత్రీదేవిగా, మూడో రోజు లలితాదేవిగా, నాలుగోరోజు అన్నపూర్ణాదేవిగా, ఐదో రోజు మహాలక్ష్మీదేవిగా, ఆరో రోజు రాజరాజేశ్వరిదేవిగా, ఏడో రోజు విద్యాసరస్వతిదేవిగా, ఎనిమిదో రోజు దుర్గాదేవిగా, తొమ్మిదో రోజు మహిషాసుర మర్ధినిగా దర్శనం ఇస్తారని నిర్వాహకులు తెలిపారు. 

ఏర్పాట్లు పూర్తి
వర్గల్‌ క్షేత్రంలో త్రిశక్తి స్వరూపిణి శ్రీవిద్యాసరస్వతిమాత శరన్నవ నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఉత్సవాలకు పీఠాధిపతులు శ్రీవిద్యాశంకర భారతీస్వామి, శ్రీమాధవానందస్వామి, శ్రీమధుసూదనానందస్వామి హాజరవుతున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. పార్కింగ్‌ సదుపాయం, అన్నదానం ఉంటుంది.  
– చంద్రశేఖరశర్మ సిద్ధాంతి, ఆలయ వ్యవస్థాపక చైర్మన్‌

మరిన్ని వార్తలు