పక్షం రోజులు.. 127 టీఎంసీలు  

29 Sep, 2020 06:02 IST|Sakshi
ప్రాజెక్టు గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి వరద నీటిని వదులుతున్న దృశ్యం  

గోదావరి పాలైన ఎస్సారెస్పీ మిగులు జలాలు 

ఇప్పటి వరకు 234 టీఎంసీల రాక 

ఐదు జిల్లాల్లో రెండో పంటకు భరోసా

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు ఈ సారి భారీ వరద పోటెత్తింది. పక్షం రోజుల్లోనే ఏకంగా 127 టీఎంసీల మిగులు జలాలు వృథాగా గోదావరిలోకి వెళ్లిపోయాయి. ప్రాజెక్టు ఎగువన ఉన్న మహారాష్ట్రలోని సాగునీటి ప్రాజెక్టుల నుంచి 15 రోజులుగా రోజూ లక్ష నుంచి లక్షన్నర క్యూసెక్కుల వరద జలాలు తరలివస్తున్నాయి. దీంతో ఎస్సీరెస్పీ ప్రాజెక్టు వరద గేట్లను ఎత్తి అదే స్థాయిలో నీటిని నదిలోకి వదులుతున్నారు. ఈ ఏడాది వర్షాకాలం సీజన్‌ ప్రారంభమైన జూన్‌ 1 నుంచి ప్రాజెక్టులోకి సుమారు 234 టీఎంసీల నీరు వచ్చినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు నిండిపోగా, మిగిలిన జలాలను గోదావరిలోకి వదిలి పెడుతున్నారు. వరద కాలువ ద్వారా మిడ్‌మానేరు జలాశయానికి తరలిస్తున్నారు. అలాగే, కాకతీయ, సరస్వతి, లక్ష్మీకాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. కాగా, అక్టోబర్‌ 28 వరకు మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తే ఉంచుతారు. దీంతో అక్టోబర్‌లో కూడా ప్రాజెక్టుకు వరద జలాల రాక కొనసాగుతుందని అధికారులు తెలిపారు. మొదట 112 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులోకి భారీగా సిల్ట్‌ చేరడంతో నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకు పడిపోయింది.  

ఐదేళ్లలో ఇన్‌ఫ్లో ఇలా..  
ఇదిలా ఉండగా గత ఐదేళ్లలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వచ్చిన ప్రవాహాలను పరిశీలిస్తే.. 2014–15లో కేవలం 14.77 టీఎంసీలు మాత్రమే ఇన్‌ఫ్లో వచ్చింది. 2015–16లో మరీ తక్కువగా 4.42 టీఎంసీల ఇన్‌ఫ్లో మాత్రమే వచ్చి చేరింది. ఇక 2016–17లో 254 టీఎంసీలు రాగా, 2017–18లో 85 టీఎంసీల వరద మాత్రమే వచ్చింది. 2019–20లో 87 టీఎంసీల ఇన్‌ఫ్లో వచ్చింది. ఈసారి ఇప్పటికే 234 టీఎంసీల వరద జలాలు వచ్చాయి.  

రబీ పంటలకు భరోసా
నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలో ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఆయకట్టు ఉంది. స్టేజ్‌ –1 పరిధిలో 9.68 లక్షల ఆయకట్టు ఉండగా, స్టేజ్‌–2లో మరో ఐదు లక్షల     ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో ఖరీఫ్‌ పంటలతో పాటు రబీ పంటలకు కూడా సాగునీరందనుంది. దీంతో ఆయకట్టు రైతులకు భరోసా ఏర్పడింది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా