నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నుంచి లీకవుతున్న నీరు

14 Aug, 2022 03:46 IST|Sakshi
కుడికాల్వ తూముల వద్ద నాన్‌ ఓవర్‌ఫ్లో సెక్షన్‌ నుంచి కారుతున్న నీరు  

నాగార్జునసాగర్‌: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నుంచి నీరు లీకవుతోంది. డ్యామ్‌ నాన్‌ ఓవర్‌ఫ్లో సెక్షన్‌లో కొన్ని బ్లాకుల నుంచి పూర్తిగా రెండో వైపునకు నీటి ఊట వస్తోంది. దీనిని అరికట్టడానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సమస్య చిన్నదే అయినా ప్రారంభదశలో ఉన్నప్పుడే మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. లేనిపక్షంలో డ్యామ్‌ మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 

జాయింట్‌ లేయర్స్‌ నుంచి వస్తున్న నీరు 
1955 నుంచి 1967 మధ్య కాలంలో సాగర్‌ డ్యామ్‌ నిర్మాణం జరిగింది. ప్రధాన డ్యామ్‌లో 1 నుంచి 23వ బ్లాకు వరకు ఎడమ వైపు నాన్‌ ఓవర్‌ఫ్లో పోర్షన్‌ ఉండగా, 24 నుంచి 50వ బ్లాకు వరకు 26 రేడియల్‌ క్రస్ట్‌గేట్లు అమర్చి ఉన్న ఓవర్‌ఫ్లో పోర్షన్లు ఉన్నాయి. స్పిల్‌వేకు కుడివైపున 51వ బ్లాకు నుంచి 76 వరకు బ్లాకులు ఉన్నాయి. స్పిల్‌వేకు ఎడమవైపున లిఫ్టుకు కుడివైపున స్లూయీస్‌గేట్‌కు పక్కవెంట 22, 23 బ్లాకు వద్ద 510 అడుగులకు దిగువనుంచి నీటి లీకేజీలు వస్తున్నాయి.

స్లూయీస్‌ గేటుకు ఎడమవైపున 51, 52 పోర్షన్లలో నీటిలీకేజీలు ఆగడంలేదు. కుడికాల్వ వైపునగల 73వ బ్లాకులో అదే పరిస్థితి ఉంది. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్న సమయంలో ఈ లీకేజీలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రాజెక్టు ఆధునీకరణలో భాగంగా 2013లో డ్యామ్‌ లోపలివైపు ఇనుప జాలి ఏర్పాటు చేసి సిమెంటుతో ప్లాస్టింగ్‌ (షాట్‌ క్రీటింగ్‌) చేశారు. దీంతో కొన్ని చోట్ల నీటి లీకేజీలు ఆగాయి. మరికొన్ని చోట్ల ఆగడం లేదు. రాతికట్టడం జాయింటింగ్‌ లేయర్స్‌ నుంచి నీరు వస్తున్నట్లు కనిపిస్తోంది. కాగా, రాతికట్టడం డ్యామ్‌లకు సీపేజీ సహజమేనని అధికారులు కొట్టి పారేస్తున్నారు.

మరిన్ని వార్తలు