భద్రా‘జలం': క్షణక్షణం భయం భయం.. రంగంలోకి సైన్యం

16 Jul, 2022 01:45 IST|Sakshi
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో గోదావరి ఉప్పొంగడంతో నీట మునిగిన భద్రాచలం పట్టణంలోని పలు ప్రాంతాలు(ఏరియల్‌ వ్యూ)

భద్రాచలంలో మరింత ఉగ్రరూపం దాల్చిన గోదావరి

రాత్రి 10 గంటలకు 71 అడుగులకు చేరిన వరద

అర్ధరాత్రికల్లా 75 అడుగులు దాటే అవకాశం

రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్, సింగరేణి రెస్క్యూ బృందాలు

ఇతర జిల్లాల అధికారులకు కూడా బాధ్యతలు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం వద్ద గోదావరి మరింత ఉధృతంగా మారుతోంది. గంటగంటకూ మరింతగా వరద మట్టం పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 10 గంటల సమయానికి 71 అడుగులతో ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఏకంగా 24,13,509 క్యూసెక్కుల వరద వేగంగా దిగువకు ప్రవహిస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాతి నుంచి శనివారం తెల్లవారుజామున 6 గంటల మధ్య వరద స్థాయి మరింతగా పెరుగుతుందని.. ఆ సమయంలో 72 నుంచి 75 అడుగుల వరకు నీటిమట్టం పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 

ఆ స్థాయిలో వరద వస్తే భారీగా ముంపు నమోదయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. అయితే భద్రాచలం సహా ఏజెన్సీ మండలాల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయ శిబిరాలకు తరలించింది. 101 మందితో కూడిన ఆర్మీ బృందం కూడా భద్రాచలానికి చేరుకుంది. అత్యవసర పరిస్థితిలో వినియోగించేందుకు ఒక ఆర్మీ హెలికాప్టర్‌ను కూడా భద్రాచలంలో సిద్ధంగా ఉంచారు. టూరిజం, అగ్నిమాపక శాఖకు చెందిన బోట్లతో  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకోవాల్సిందిగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మూడు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఉండగా, మరిన్ని బృందాలను పంపాలని కేంద్రాన్ని కోరారు.

ప్రత్యేక బలగాల మోహరింపు
వరద కారణంగా ఎలాంటి ఇబ్బందులు, ఇతర సమస్యలు తలెత్తకుండా పెద్ద సంఖ్యలో పోలీసులనూ భద్రాచలం ఏజెన్సీకి తరలించారు. ఐజీ నాగిరెడ్డి భద్రాచలం చేరుకుని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాలకు చెందిన ప్రభుత్వ సిబ్బందిని వరద సహాయ కార్యక్రమాల కోసం రప్పించారు. వీరితోపాటు నలుగురు డిప్యూటీ కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. సింగరేణి సీఎండీ శ్రీధర్‌కు వరద సహాయ కార్యక్రమాల ప్రత్యేకాధికారిగా బాధ్యత అప్పగించారు. సీఎం కేసీఆర్‌తోపాటు చీఫ్‌ సెక్రెటరీ సోమేశ్‌కుమార్‌ సహాయ కార్యక్రమాల్లో ఉన్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

భద్రాచలంలో సహాయక కేంద్రాలకు వెళ్లాలని బాధితులకు చెబుతున్న మంత్రి పువ్వాడ

అంధకారంలోనే ఏజెన్సీ
వరద కారణంగా విద్యుత్‌ స్తంభాలు, సబ్‌స్టేషన్లు మునిగిపోవడంతో చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, బూర్గంపాడు, పినపాక మండలాలు అంధకారంలో మునిగిపోయాయి. మణుగూరు వద్ద మిషన్‌ భగీరథ ఇన్‌టేక్‌ వెల్‌ వరదలో మునిగిపోవడంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లోని 1,730 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. 

శిబిరాల్లో ఆకలి కేకలు
గోదావరి వరద 80 అడుగుల వరకు చేరుకోవచ్చనే ప్రచారం జరగడంతో.. గురువారం రాత్రి నుంచి లోతట్టు ప్రాంతాల ప్రజలు సహాయ శిబిరాలకు పోటెత్తారు. సొంత వాహనాల్లో సామాన్లతో సహా తరలివచ్చారు. ఒకేసారి ఎక్కువ మంది రావడంతో.. తగిన స్థలం చూపించడం, సమయానికి ఆహారం అందించడంలో ఆలస్యం జరిగింది. అన్నం పెట్టాలంటూ సహాయ శిబిరాల్లోని బాధితులు శుక్రవారం మధ్యాహ్నం ఆందోళన చేశారు.

అతి పెద్ద వరదగా మారుతుందా?
భద్రాచలం: భద్రాచలం వద్ద ఈసారి గోదావరి ఉధృతితో పాత రికార్డులన్నీ బద్దలుగొట్టే పరిస్థితి కనిపిస్తోంది. గోదావరి చరిత్రలో 1986 ఆగస్టు 16న 75.6 అడుగుల వరద రావడం ఇప్పటివరకు ఉన్న రికార్డు. ఆ తర్వాత 1990 ఆగస్టు 24న 70.8 అడుగుల వరద రెండో స్థానంలో నిలిచింది. ఈసారి వరద రెండో రికార్డును శుక్రవారం రాత్రి 8గంటలకు దాటేసింది. ఇప్పటివరకు జూలై నెలలో గోదావరికి వచ్చిన వరదల్లో ఇదే అత్యధికం. ప్రవాహం మరింతగా పెరుగుతుందన్న అంచనాల మేరకు.. 1986 నాటి రికార్డును కూడా తాజా వరద అధిగమిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే జూలై నెలలోనే కాకుండా.. గోదావరి వరదల్లోనే ఇదే అతి పెద్దదిగా నమోదు కానుంది.

కలవరపెడుతున్న కరకట్ట
భద్రాచలం పట్టణానికి రక్షణగా ఉన్న కరకట్ట అధికారులను కలవరపెడుతోంది. 1986లో వచ్చిన వరదలను దృష్టిలో ఉంచుకుని ఈ కరకట్టను డిజైన్‌ చేసినా.. భారీ వరదను ఏమేరకు తట్టుకుంటుందనే ఆందోళన కనిపిస్తోంది. ఇప్పటికే కరకట్టకు ఉన్న డ్రైనేజీ స్లూయిస్‌ల నుంచి నీరు లీకవుతోంది. భద్రాచలంలోని అయ్యప్పకాలనీ, యటపాక దగ్గర కరకట్టలో లీకేజీలు శుక్రవారం బయటపడ్డాయి. అప్పటికప్పుడు ఇసుక బస్తాలు వేశారు. కరకట్టపై ఎక్కడ లీకేజీలు వచ్చినా అడ్డుకునేందుకు ప్రతీ వంద మీటర్లకు ఒకచోట ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచారు.

ఆ ఆరు గంటలే కీలకం
శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు భద్రాచలం వద్ద గోదావరికి గరిష్ట వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. తర్వాత క్రమంగా ఉధృతి తగ్గుతుందని అంటున్నారు. వరద ప్రవాహం 60 అడుగులకన్నా దిగువకు చేరితే.. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి సహాయ శిబిరాల్లో ఉన్నవారిని ఇళ్లకు పంపిస్తామని మంత్రి పువ్వాడ అజయ్‌ తెలిపారు. అప్పటివరకు ప్రజలు సహకరించాలని కోరారు.

నీట మునిగిన గ్రామాలు..
చర్ల మండలంలో 18 గ్రామాలు, దుమ్ముగూడెం మండలంలో 20, మణుగూరులో 3 గ్రామాలు, అశ్వాపురంలో 8, బూర్గంపాడు, చుట్టూ ఉన్న గ్రామాలు నీట మునిగాయి. భద్రాచలంలోని సుభాష్‌ నగర్, కొత్తకాలనీ, అయ్యప్పకాలనీ, ఇండస్ట్రియల్‌ ఏరియా, రాజుపేట,  శాంతినగర్, అశోక్‌ నగర్, ఏఎంసీ కాలనీ, రామాలయం పరిసర ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. దుమ్ముగూడెం వద్ద కరకట్టపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో ఇసుక బస్తాలు వేశారు. వరద పెరిగితే కరకట్టకు గండ్లు పడే అవకాశం ఉంది. పోటెత్తిన వరదతో 42 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో కోల్‌ యార్డులోకి వరద నీరు చేరుకుంది.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు